బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన తనకెప్పుడూ స్నేహితుడు కాడని సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు.
బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన తనకెప్పుడూ స్నేహితుడు కాడని సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. తామిద్దరం తరచు కలిసేవారిమని, తామిద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉండేవని మోడీ చెప్పడం చాలా హాస్యాస్పదమని అన్నారు. మోడీ అలా చెప్పడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని, ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించడానికే ఆయనలా చేస్తున్నారని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి తాను ఏమైనా తీసుకున్నట్లు ఆయనవద్ద ఆధారాలుంటే నిర్భయంగా బయట పెట్టాలి తప్ప ఇలా చెప్పడం సరికాదని అన్నారు.
తన సొంత పార్టీలోనే ఎవరితోనూ స్నేహంగా ఉండని మోడీ... తనతో స్నేహం చేయడం ఎలా సాధ్యమని అహ్మద్ పటేల్ ప్రశ్నించారు. మోడీని ఆయన ఇంట్లో గానీ, కార్యాలయంలో గానీ ఎప్పుడూ కలవలేదని, అలాగే ఆయన కూడా తనతో కలిసి ఎప్పుడూ భోజనం చేయలేదని స్పష్టం చేశారు. దూరదర్శన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అహ్మద్ పటేల్, తాను మంచి స్నేహితులమని నరేంద్రమోడీ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనలా లేరని, బహుశా ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉండటంవల్లే తనను తప్పించుకుని తిరుగుతున్నారని మోడీ చెప్పారు. పటేల్ను తానెప్పుడూ అహ్మద్ భాయ్ అనలేదని, బాబూ భాయ్ అనేవాడినని అన్నారు. దాన్నే అహ్మద్ పటేల్ ఇప్పుడు నిర్ద్వంద్వంగా ఖండించారు.