
బంగారు తెలంగాణను నిర్మిస్తాం
టీ-కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఏ వర్గాన్నీ విస్మరించకుండా అందరిపైనా వరాల జల్లు కురిపించింది.
మాతోనే దివాళి.. టీఆర్‌ఎస్‌తో దివాలా: జైరాం
టీ-కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
రైతులు, డ్వాక్రా సంఘాలకు ప్రోత్సాహకాలు
ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాల కల్పన,నిరుద్యోగులకు పది వేల నగదు వోచర్
అమరవీరుల కుటుంబాల కోసం రూ. వంద కోట్ల నిధి.. అందరికీ ఆరోగ్యశ్రీ.. పెన్షన్ రూ. వెయ్యికి పెంపు
సాక్షి, హైదరాబాద్: టీ-కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఏ వర్గాన్నీ విస్మరించకుండా అందరిపైనా వరాల జల్లు కురిపించింది. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు సహా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా 218 హామీలను గుప్పించింది. తొలి ఏడాదే లక్ష ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు, 50 లక్షల మంది రైతులకు రూ. 10 వేల చొప్పున, పొదుపు సంఘాలకు లక్ష రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు రూ. పది వేల నగదు వోచర్ వంటి అంశాలతో భారీ ఎన్నికల ప్రణాళికను కాంగ్రెస్ నేతలు తీర్చిదిద్దారు.
మళ్లీ అధికారంలోకి వస్తే ఈ హామీలన్నీ నెరవేర్చి ‘బంగారు తెలంగాణ’ను నిర్మిస్తామంటూ.. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ శనివారం గాంధీభవన్‌లో టీ-కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుద ల చేశారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు, కో-చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా జైరాం రమేశ్ కొనియాడారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో మాత్రం ప్రజలను దివాలా తీసేదిగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో హామీల అమలుపై ఏటా సమీక్ష జరుపుతామన్నారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరిచామని పొన్నాల పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
1969లో, ఇటీవల జరిగిన తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ. 100 కోట్ల నిధితో ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్టు ఏర్పాటు. తెలంగాణలో పనిచేసే ఉద్యోగులందరికీ ‘స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్’. సకల జనుల సమ్మె కాలానికి వేతన చెల్లింపు.
అధికారంలోకొచ్చిన తొలి ఏడాది లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. నిరుద్యోగుల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60కి పెంపు. ప్రతి నిరుద్యోగికి రూ. 10 వేల నగదు వోచర్. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో కలిపి జిల్లాకో లక్ష చొప్పున 10 లక్షల ఉద్యోగాల కల్పన.
తెలంగాణలో బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి రైతుకూ రూ. 10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం. ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ. లక్ష ప్రోత్సాహక నగదు. రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ. వెయ్యి కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.
రెండే ళ్లలో తెలంగాణలోని 35,974 చెరువుల పునరుద్ధరణ. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కోసం కృషి.
సార్వత్రిక ఆరోగ్య పథకం ద్వారా ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. ప్రతి కుటుంబానికి ఉచిత ఆరోగ్య సేవలందించేందుకు ‘యూనివర్సల్ హెల్త్ కేర్’ ఏర్పాటు. అందుబాటు ధరల్లో ప్రైవేటు వైద్యం.
పగటిపూట ఏడు గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా. ప్రతి మండలానికి 30 మెగావాట్ల సౌరశక్తి విద్యుత్ కేంద్రాల ఏర్పాటు.
8 నుంచి 10 కొత్త జిల్లాల ఏర్పాటు. బీసీ, మైనారిటీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు. ఖాయిలా పరిశ్రమల పునరుద ్ధరణ. నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.
స్మార్ట్ సిటీ, సేఫ్ సిటీలతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొనసాగింపు. కేంద్రంతో సమానంగా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పదేళ్ల పాటు పన్నుల మినహాయింపు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ రూ. వెయ్యికి పెంపు. జాతీయ సలహా మండలి తరహాలో పౌర సమాజంలోని ప్రముఖులతో రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రస్తుత శ్లాబ్ వ్యవస్థపై సమీక్ష. గ్రామీణ ప్రాంతాల్లో మినీ థియేటర్ల నిర్మాణం.