నిర్ణేతలు వారే..! | Ghulam Rasool Khan.. a freedom fighter | Sakshi
Sakshi News home page

నిర్ణేతలు వారే..!

Mar 28 2014 12:15 AM | Updated on Oct 16 2018 6:01 PM

నిర్ణేతలు వారే..! - Sakshi

నిర్ణేతలు వారే..!

గులాం రసూల్ ఖాన్.. స్వాతంత్య్ర సమరయోధుడు.

జిల్లాలో కీలకంగా మారిన ముస్లిం ఓట్లు

 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: గులాం రసూల్ ఖాన్.. స్వాతంత్య్ర సమరయోధుడు. వహాబీ ఉద్యమాన్ని నడిపి కర్నూలు పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేశారు. బ్రిటీష్ వారికి ముస్లింల పౌరుషాన్ని చూపిన ధీరుడు. జిల్లాలో ఇలాంటి ముస్లిం ధీరులెందరో ఉన్నారు. ప్రజాస్వామ్య భారతంలో తమ ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవడంలో వీరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పలు నియోజకవర్గాల్లో వీరే కీలకం కానున్నారు. జిల్లాలో ప్రతిసారి జరిగే ఎన్నికల్లో అల్ప సంఖ్యాకవర్గాల ప్రజలే కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు.



 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు నగరం తరువాత అధిక ముస్లింలు కర్నూలు జిల్లాలో ఉన్నారు. జనాభాలో 15శాతం వరకు ఉన్న వీరు ఎన్నికల్లో ప్రధాన పాత్రపోషిస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు నియోజకవర్గంతోపాటు శ్రీశైలం, నంద్యాల, ఆదోని అసెంబ్లీ నియోజవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల గెలుపును వీరే నిర్ణయించనున్నారు. కర్నూలులో 40.38శాతానికి పైగా ముస్లింలు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి 1955లో ఎంఏ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో 1972లో రహమాన్ ఖాన్, 1978లో ఎం.డి. ఇబ్రహీం ఖాన్ కాంగ్రెస్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. 1994, 2004లో కార్మిక నాయకుడిగా ఎదిగిన ఎంఎ గఫూర్ సీపీఎం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థులు కె.ఇ. కృష్ణమూర్తి, టి.జి. వెంకటేష్‌లపై విజయం సాధించారు. కర్నూలు మునిసిపల్ చైర్మన్‌గా గతంలో దావూద్ ఖాన్, కార్పొరేషన్ అయ్యాక 2000లో ఎల్. ఫిరోజ్ బేగం మేయరుగా బాధ్యతలు నిర్వహించారు.


ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు, వెలుగోడులో ముస్లింలే కీలకం. గత 50 ఏళ్లుగా ఆత్మకూరులో ముస్లిం అభ్యర్థులే సర్పంచ్‌గా కొనసాగడం గమనార్హం. ఆదోని పట్టణంలో ముస్లింల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తున్నాయి. అక్కడ పాతికేళ్ల క్రితం మునిసిపాలిటీ చైర్మన్ పదవిలో ముస్లింలు కొనసాగగా గత కొంత కాలంగా వైస్ చైర్మన్ పదవుల్లో ముస్లింలు రాణిస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 60వేల వరకు ముస్లింలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరి మద్దతు తప్పనిసరి.  నంద్యాల మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత దాదేభాయ్ షర్వాని అనే వ్యక్తి రెండో చైర్మన్‌గా పనిచేయగా, 1989లో నౌమన్ చైర్మన్‌గా పనిచేశారు.

 ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్‌ఎండీ. ఫరూక్ 1985, 1994, 1999లో గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. బనగాపల్లెలో 1947వరకు నవాబుల పరిపాలన కొనసాగింది. ఇక్కడ కూడా ముస్లిం ఓటర్ల శాతం ఇతరుల కంటే అధికంగా ఉంది. అయితే  ముస్లిం మైనారిటీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. వైఎస్సార్ ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుడే మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ముస్లింలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓట్లు వేసి యువనాయకుడికి పట్టం కడతామని వారు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement