నామినేషన్ వేయడానికి వస్తున్న కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బుట్టా రేణుక
సార్వత్రిక ఎన్నికల భేరీ మోగింది. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది.
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
తొలిరోజు ఐదు నామినేషన్లు
పత్తికొండ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున
కోట్ల హరిచక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల భేరీ మోగింది. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, జేసీ కలెక్టర్ కె.కన్నబాబు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు జారీ చేశారు.
నోటిఫికేషన్ జారీతోనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. అయితే మొదటిరోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోలేదు. తిథి, నక్షత్రం తదితర వాటిని చూసుకుని నామినేషన్లు వేయాలనే ఉద్దేశంతో పలువురు అభ్యర్థులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి రోజు పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్.ఎం.డి.ఫరూక్ తరఫున ఆయన కుమారులు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కన్నబాబుకు అందజేశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్.కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా ముగ్గురు అభ్యర్థులు ఐదు నామినేషన్లు దాఖలు చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటిరోజు నామినేషన్లు బోణీ కాలేదు.
అయితే ఈ నెల 13వ తేదీ ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి కావడంతో సెలవుగా ప్రకటించారు. 15వ తేదీ నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఊపందుకునే అవకాశం ఉంది. నామినేషన్ దాఖలుకు వచ్చే అభ్యర్థులు ఖచ్చితమైన పత్రాలతో రావాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసేవారు ఫారం-2ఎ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారం-2బిలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.
నామినేషన్ దాఖలు చేసే వ్యక్తి అదే నియోజకవర్గానికి చెందిన వారైతే ఓటరు లిస్ట్ జతపరచాలి. వేరొక నియోజకవర్గానికి చెందినవారైతే సదరు నియోజకవర్గపు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ధృవీకరించిన ఓటరు జాబితాను సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతిపాదకులు మాత్రం అదే నియోజకవర్గానికి చెందినవారై ఉండాలని తెలిపారు. డిపాజిట్ సొమ్మును నగదు లేదా చలానా రూపంలో మాత్రమే స్వీకరిరిస్తామని, చెక్కులు, డీడీలు చెల్లవని స్పష్టం చేశారు.


