అపూర్వ విజయం

ISRO Successfully Launches GSLV MARK 3D 2 - Sakshi

చంద్రయాన్‌–2కు, అంతరిక్ష మానవ సహిత ప్రయోగాలకు అందివస్తుందని భావిస్తున్న జీఎస్‌ ఎల్‌వీ మార్క్‌3–డీ2 రాకెట్‌ ద్వారా బుధవారం మన శాస్త్రవేత్తలు జీ శాట్‌–29 భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. గగనవీధుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నమోదు చేసుకుంటున్న విజయ పరంపరలో తాజా ప్రయోగం కలికితురాయి అని చెప్పాలి. అంతా ముందనుకున్నట్టే సాయంత్రం 5–08 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం లోని ప్రయోగవేదిక నుంచి మార్క్‌3–డీ2 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్‌ డౌన్‌ పూర్తయి రాకెట్‌ నిప్పులు చిమ్మడం మొదలైన దగ్గరనుంచి నిర్దేశిత కక్ష్యకు ఉపగ్రహం చేరు కోవడం వరకూ చూస్తే... మొత్తం 16 నిమిషాల 43.5 సెకన్ల సమయం పట్టింది. ప్రయోగం విజయ వంతమయ్యాక ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ చెప్పినట్టు ఇన్నాళ్లూ చేసిన ప్రయోగాలతో పోలిస్తే ఇది నిస్సందేహంగా ఎవరెస్టు శిఖరం వంటిది. చాలామంది దీన్ని ‘బాహుబలి’గా అభివర్ణించారు కూడా.

రాకెట్‌ మొదటి దశకు రెండువైపులా 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్లుంటే, రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధన బూస్టర్లున్నాయి. మూడో దశ కోసం 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనం బూస్టర్‌ను వాడారు. ఈ మూడూ శాస్త్రవేత్తలిచ్చిన కమాండ్లకు అనుగుణంగా సక్రమంగా పనిచేసి వారిలో ఆత్మసై్థర్యాన్ని నింపాయి. ఇస్రో ఈ ఏడాది చేసిన వరస ప్రయోగాల్లో ఇది అయిదవది. మార్క్‌3 రాకెట్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి. 2014 జూన్‌లో మార్క్‌ 3 రాకెట్‌ద్వారా జీశాట్‌–19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. చెన్నై–శ్రీహరికోట మధ్య తీరం దాటుతుందని అంచనావేసిన పెను తుపాను ‘గజ’ దారి మార్చుకోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం సాధ్యపడింది. మన శాస్త్రవేత్తలకు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ మాదిరి జీఎస్‌ఎల్‌వీ చాన్నాళ్లు కొరుకుడు పడలేదు. జీఎస్‌ఎల్‌వీని ప్రయోగించినప్పుడల్లా వైఫల్యాలే ఎదురయ్యాయి. కానీ రెండు దశాబ్దాలపాటు ఆ రాకెట్‌ విషయంలో అకుంఠిత దీక్ష బూని పనిచేయడం ఫలితంగా అది సైతం పట్టుబడింది.

ప్రయోగం విఫలమైనప్పుడల్లా కూలంకషంగా అధ్యయనం చేసి సూక్ష్మ స్థాయిలో జరిగిన పొర పాట్లను సైతం గుర్తించడం, డిజైన్‌లో దానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేసుకోవడం, మళ్లీ ప్రయోగానికి సిద్ధపడటం విడవకుండా కొనసాగింది. ఒక దశలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొం దించిన ఇంజిన్‌ విఫలం కాగా, మరో దశలో రష్యా తయారీ ఇంజిన్‌ సైతం మొరాయించింది. కానీ మన శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేశారు. విసుగూ, విరామం లేకుండా శ్రమిం చారు. ఫలితంగా జీఎస్‌ఎల్‌వీ కూడా సులభగ్రాహ్యమైంది. సుదూర కక్ష్యల్లోకి అధిక బరువుండే ఉప గ్రహాలను పంపాలంటే క్రయోజెనిక్‌ సాంకేతికతను వినియోగించే జీఎస్‌ఎల్‌వీ ఆసరా తప్పనిసరి. జీఎస్‌ఎల్‌వీలో మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని, మూడో దశలో క్రయోజెనిక్‌ ఇంధనాన్ని వినియోగించాల్సివస్తుంది. మొదటి రెండు దశల విషయంలో శాస్త్రవేత్త లకు ఎప్పుడూ సమస్యలేదు.

మూడోదైన క్రయోజెనిక్‌ సాంకేతికతే చాన్నాళ్లు ఇబ్బంది పెట్టింది. ఇందులో వాడే హైడ్రోజన్‌నూ, దాన్ని మండించడానికి ఉపయోగించే ఆక్సిజన్‌ను ద్రవరూపంలోకి మార్చడం సాధారణమైన పని కాదు. అందుకోసం ఆ రెండు ఇంధనాలనూ నిర్దిష్ట స్థాయికి శీతలీ కరించాలి. ఈ క్రమంలో ఎక్కడ లోపం జరిగినా ఆ రెండు ఇంధనాలూ నేరుగా వాయు రూపంలోకి మారిపోతాయి. పైగా హైడ్రోజన్‌ ద్రవరూపంలోకి మారాలంటే మైనస్‌ 253 డిగ్రీల సెల్సియస్‌ వద్ద, ఆక్సిజెన్‌ ద్రవరూపంలోకి మారడానికి మైనస్‌ 183 డిగ్రీల వద్ద ఉండాలి. ఇందుకు తగినట్టుగా ఇంజిన్‌లోని పరికరాలు, పైపులూ శీతల స్థితిలో ఉండాలి. అడుగడుగునా ఎదురయ్యే ఈ సవాళ్లను అధిగమించే మార్గంలో ఎన్నో అడ్డంకులు! ఈ సాంకేతికతను ఇవ్వడంపై అమెరికా ఆంక్షలు విధిం చగా, రష్యా అత్యధిక మొత్తాన్ని డిమాండు చేసింది. కనుకనే ఇందుకోసం దేశీయ సాంకేతి కతను అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరని మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతటి అపారమైన కృషి వల్లనే జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌3–డీ2 ప్రయోగం విజయవంతమైంది.

పదేళ్లపాటు సేవలందించగల జీశాట్‌–29లో అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి రాగలిగేందుకు అనువైన ఉపకరణాలను అమర్చారు. ప్రపంచంలో మరే దేశమూ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో ఈ మాదిరి ఉపకరణాలు ఇంతవరకూ వినియోగించలేదు. దేశంలోని మారుమూల పల్లెల్లో ఉండే వనరులు, అక్కడుండే సదుపాయాలు సులభంగా తెలుసుకోవడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ఇటు జమ్మూ–కశ్మీర్‌లోనూ మూల మూలలకూ ఇంటర్నెట్‌ సర్వీసులు అందుబాటులోకొస్తాయి. ఈ ఉపగ్రహంలోని ఆప్టికల్‌ కమ్యూ నికేషన్‌ పేలోడ్‌ వల్ల డేటా బదిలీ అత్యంత వేగవంతంగా ఉండగలదని చెబుతున్నారు.

ఈ ప్రయో గానికి వినియోగించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–డీ2 రాకెట్‌ రకాన్నే వచ్చే జనవరిలో చంద్రయాన్‌–2 ప్రయోగానికీ, 2022లో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమానికీ వినియోగించాలని భావిస్తున్నారు. మొత్తానికి అంతరిక్ష రంగంలో గుత్తాధిపత్యాన్ని నెరపాలన్న అగ్రరాజ్యాల కలను మన శాస్త్రవేత్తలు చెదరగొట్టారు. ఈ వరస విజయాలు వాణిజ్యపరంగా కూడా దేశానికి లాభదా యకమవుతాయి. మన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రూపొందే రాకెట్లు, ఉపగ్రహాలు, వాటిల్లో విని యోగించే ట్రాన్స్‌పాండర్లు, ఇతర పరికరాలు అంతర్జాతీయంగా విశ్వసనీయతను సాధించాయి. పైగా అగ్రరాజ్యాలతో పోలిస్తే రాకెట్‌ ప్రయోగాల వ్యయం చాలా తక్కువ అవుతోంది. అందువల్లే అంతరిక్ష రంగంలో భారత్‌ సేవలు వినియోగించుకోవడానికి పలు దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరికొన్ని ప్రయోగాల తర్వాత మార్క్‌3 కూడా అరియాన్, అట్లాస్‌ తరహాలో వాణిజ్యపరమైన రాకెట్‌గా రూపుదిద్దుకోవడం ఖాయం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top