దక్కని న్యాయం

Editorial On Samjhauta Express Blast Verdict - Sakshi

పన్నెండేళ్లక్రితం ఢిల్లీ నుంచి లాహోర్‌ వెళ్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో అమృత్‌సర్‌కు సమీపంలోని అట్టారిలో పేలుడు సంభవించి 68మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిందితులుగా ఉన్న వారంతా నిర్దోషులేనని బుధవారం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో కేసు కొట్టేస్తున్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి చెప్పారు. అన్ని కేసుల్లో జరిగినట్టే ఇక్కడ కూడా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు చెందినవారు తమకు న్యాయం దక్కలేదని విలపిస్తుంటే... ఇంత సుదీర్ఘకాలం తర్వాత తమ నిర్దోషిత్వం బయటపడిం దని విడుదలైనవారు చెబుతున్నారు. మన న్యాయస్థానాల్లో ఏళ్లతరబడి విచారణ సాగడం, తీర్పులు వెలువడటం రివాజే.

ఇందువల్ల నిజమైన నేరస్తులు తప్పించుకుంటున్నట్టే, ఏ నేరమూ చేయని వారు అన్యాయంగా ఏళ్ల తరబడి జైలు జీవితం గడపవలసి వస్తున్నది. ఇప్పుడు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన కేసు అనేకవిధాల కీలకమైనది. ఇందులో మరణించినవారిలో, గాయపడినవా రిలో అత్యధికులు పాక్‌ పౌరులు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ఉదంతానికి ముందు, తర్వాత దేశంలో చాలాచోట్ల ఉగ్రవాద ఘటనలు జరిగాయి. కానీ దానికి ముందు జరిగిన దాదాపు అన్ని ఉదంతా ల్లోనూ వివిధ ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్న ముస్లిం యువకులు అరెస్టయ్యేవారు. సంఝౌతా పేలుడు ఉదంతం కూడా ఆ సంస్థల పనేనని చాలామంది అనుకున్నారు. కానీ ఎన్‌ఐఏ తొలిసారి హిందూ అతివాద సంస్థకు చెందినవారికి ఇందులో ప్రమేయమున్నదని నిర్ధారించింది. దీనికన్నా ముందు 2006లో 37మంది మరణానికి దారితీసిన మాలెగావ్‌ పేలుళ్ల కేసులో 9మంది ముస్లిం యు వకులు నిందితులని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం, అనంతరం సీబీఐ కూడా నిర్ధారిం చాయి. 2011లో ఎన్‌ఐఏ ఆ నిందితులకు దీంతో ఎలాంటి ప్రమేయమూ లేదని, ఇది అతివాద హిందూ సంస్థ పని అని తేల్చింది. ముస్లిం యువకులకు బెయిల్‌ మంజూరైంది. హిందూ అతివాద సంస్థకు చెందిన 8మందిపై అభియోగాలు మోపినా 2016లో ఈ కేసులో నిందితులందరూ నిర్దోషు లని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.

సంఝౌతా కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి ఇప్పుడు నిర్దోషిగా విడుదలైన అసీమానంద ఈ ఉదంతంలో మాత్రమే కాదు...మాలెగావ్‌ పేలుళ్లు, అజ్మీర్‌ పేలుళ్లు, హైదరాబాద్‌లోని మక్కా మసీదు పేలుళ్లలో తనతోపాటు మరికొందరు పరివార్‌ నేతల ప్రమేయమున్నదని అంగీకరించాడని అప్పట్లో ఎన్‌ఐఏ ప్రకటించింది. ఇది పెను దుమారానికి దారితీసింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. కావాలనే ఆరెస్సెస్‌ నేతలను ఈ పేలుళ్ల కేసుల్లో ఇరికించి అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని బీజేపీ ఆరోపిస్తే... ఆరెస్సెస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. రాజకీయంగా ఇంత కలకలం సృష్టించిన కేసు గనుక ఎన్‌ఐఏ ఎంతో జాగ్రత్తగా దర్యాప్తు జరుపుతుందని అందరూ ఆశిస్తారు.

నిజానికి దేశంలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని అరికట్టడానికే ఆ సంస్థను ఏర్పాటు చేశారు. 2009లో ఆవిర్భవించిన ఆ సంస్థకు ఉగ్రవాద కేసుల దర్యాప్తులో నిజానికి మంచి పేరుంది. అది ఇంతవరకూ దర్యాప్తు చేసిన 187 కేసుల్లో 95 శాతం న్యాయస్థానాల్లో రుజువై నిందితులకు కఠినశిక్షలు పడ్డాయి. అయితే సమర్థవంతమైన దర్యాప్తు, పకడ్బందీగా సాక్ష్యాల సేకరణ, సాధ్యమైనంత త్వరగా విచారణ ప్రారంభమై అది చకచకా పూర్తయ్యేలా చూడటం, సాక్షులకు రక్షణ కల్పించడం ఏ కేసులోనైనా అత్యంత కీలకమైనవి. ఇవే దర్యాప్తు సంస్థల సమర్థతకు గీటురాళ్లు. వీటిల్లో ఎక్కడ తడబడినా, అలవిమాలిన జాప్యం చోటుచేసుకున్నా కేసు మొత్తం బోర్లా పడుతుంది. నిజమైన దోషులు తప్పించుకుంటారు. 

ఇప్పుడు నిర్దోషులుగా విడులైనవారంతా తమను కావాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇందులో ఇరికించిందని, ఉనికిలో లేని హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించి, రాజకీయ కక్ష తీర్చు కునేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం బాధితుల్లో ఎక్కువమంది తమ పౌరులే గనుక ముంబై ఉగ్రదాడి ఉదంతం గురించి పాక్‌ను మన దేశం నిలదీసినప్పుడల్లా మరి సంఝౌతా పేలుళ్ల మాటేమిటని ఆ దేశం ఎదురు ప్రశ్నిస్తోంది. తాజా తీర్పు వెలువడ్డాక సైతం అది ఇస్లామాబాద్‌లోని మన హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలియజేసింది. మరణించిన పాక్‌ పౌరులకు సంబంధించిన కుటుంబసభ్యులుగానీ, గాయపడినవారుగానీ పలుమార్లు సమన్లు జారీ చేసినా ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి రాలేదు.  ఇదే రైల్లో పాక్‌లోని తమ బంధువుల్ని చూడటానికి వెళ్తున్న మన పౌరులు కూడా మృతుల్లో ఉన్నారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలతో ఉన్నవారు నిందితుల్ని గుర్తుపట్టలేకపోయారు. నిజానికి అది అసాధ్యం కూడా. అందువల్ల పరిస్థితుల ఆధారంగా నిందితుల ప్రమేయాన్ని రుజువు చేయడమే మార్గం. ఆ విషయంలో కూడా ఎన్‌ఐఏ విజయం సాధించలేకపోయింది.

2006లో తమ ఇంట్లో జరిగిన ఒక సమావేశంలో అసీమా నందతోపాటు సునీల్‌ జోషి, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ వగైరాలు పాల్గొన్నారని, అందులో ఈ పేలుళ్లకు పథకరచన జరిగిందని 2010లో చెప్పిన భరత్‌ మోహన్‌లాల్‌ 2015లో ఆ వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకున్నాడు. అతనితోపాటు సాక్షులుగా ఉన్న మరో పదిమంది ఆ పనే చేశారు. బాంబులు సేక రించడానికి, దీనికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చడానికి కారకుడని ఎన్‌ఐఏ భావించిన సునీల్‌ జోషిని ఆ పేలుళ్ల ఉదంతం తర్వాత కొద్దికాలానికే ‘గుర్తు తెలియని వ్యక్తులు’ హత్య చేశారు. ఆఖరికి ఘటనకు ముందు నిందితులు బస చేసిన డార్మిటరీలో కూడా అందుకు సంబంధించిన రికార్డులు లేవు. ఏతావాతా కేసు వీగిపోయింది. ఇలాంటి కేసుల్లో ఇన్నేళ్లపాటు దర్యాప్తు సాగించాక, విచారణ జరిగాక కూడా దోషుల్ని శిక్షించలేకపోతే అంతర్జాతీయంగా మన దర్యాప్తు సంస్థల, మన న్యాయస్థానాల ప్రతిష్ట మసకబారుతుంది. అందువల్లే ఈ కేసులో ఎన్‌ఐఏ మరిన్ని జాగ్రత్తలు తీసు కుని ఉంటే బాగుండేది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top