బాగ్దాదీ ‘ఆపరేషన్‌’!

Editorial On Operation Baghdadi - Sakshi

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) అధినాయకుడు, ఉగ్రవాది అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ కోసం అమెరికా అయిదారేళ్లుగా సాగిస్తున్న వేట ముగిసింది. అతగాడిని సిరియాలో తమ దళాలు వెంటాడి ఓ సొరంగంలో చిక్కుకున్నాక మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ప్రకటించారు. ముందు ట్విటర్‌ ద్వారా ఏకవాక్య ప్రకటన చేసి, ఆ తర్వాత మీడియా సమావేశం ద్వారా బాగ్దాదీ మృతి వివరాలను ఆయన వెల్లడించారు. వీక్షకుల్లో ఉత్కంఠ రేపేందుకు చానెళ్లు  సస్పెన్స్‌ దట్టించి మధ్యమధ్యలో విడుదల చేసే టీజర్ల మాదిరి ఆ ట్వీట్‌ ఉంది. తమ బలగాల చర్య పర్యవసానంగా ఐఎస్‌ నడ్డి విరచగలిగామని ట్రంప్‌ సంతోషపడుతున్నారు. ఆ మాటెలా ఉన్నా రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని మళ్లీ గెలుచుకోవాల్సిన సమయం దగ్గర పడుతున్న వేళ బాగ్దాదీ మరణం ఖచ్చితంగా ఆయనకు కలిసిరావొచ్చు. ఇరాక్‌ తదితర దేశాల్లో అనేకానేక దురాగతాలకూ, దుర్మార్గాలకూ కారణమైన సంస్థ అధినాయకుడు మరణించాడంటే సహజంగానే ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక జర్మన్‌ పాత్రికేయుడు యూర్గన్‌ టోడెన్‌ హ్యోపర్‌కి అయిదేళ్లక్రితం ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాక్‌లోని మోసుల్‌లోఐఎస్‌ ముఠాలో కొందరిని కలిసి బాగ్దాదీని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరిన ఆయనతో ‘అతను కేవలం వ్యక్తిమాత్రుడు.

విద్యావంతులు, నాయకులు సభ్యులుగా ఉండే ఒక మండలి ఆయన్ను నాయకుడిగా ఉంచింది. ఆయన మరణిస్తే ఆ మండలి మరొకరిని ఆ స్థానంలో ప్రతిష్టిస్తుంది. మీరు కలవదల్చుకుంటే మండలి సభ్యుల్ని కలవండి’ అని సలహా ఇచ్చారట! కనుక బాగ్దాదీ మరణంతో ఐఎస్, దాని దుర్మార్గాలు కనుమరుగవుతాయని భావించడం దురాశే. ఒకపక్క దురాగతాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు కొనసాగిస్తూనే.... ఆ సంస్థ పుట్టుకకూ, అది పుంజుకోవడానికి ఏ కారణాలు దోహదపడ్డాయో గుర్తించడం, అందుకు కారకులెవరో తేల్చడం, వారిపట్ల ఎలా వ్యవహరించాలో నిర్ణయించడం ఇప్పుడు ప్రపంచ ప్రజల కర్తవ్యం. లేనట్టయితే బాగ్దాదీలాంటివారు మున్ముందు కూడా పుట్టు కొస్తూనే ఉంటారు. ఊహకందని మారణహోమాలు సృష్టిస్తూనే ఉంటారు. సరిగ్గా ఎనిమిదేళ్లక్రితం అల్‌ కాయిదా నాయకుడు బిన్‌ లాడెన్‌ను అమెరికా మెరైన్లు మట్టు బెట్టినప్పుడు కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా మీడియా సమావేశం ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అయితే అందులో ట్రంప్‌ ప్రదర్శించినంత నాటకీయత లేదు.

ఆయన ఒక ప్రకటన చదవబోతున్నట్టు తెలుసుకున్న వెంటనే అప్పటికప్పుడు చానెళ్లు అన్నిటినీ నిలిపి దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఒబామా ప్రకటనలో అవసరమైన వివరాలేమీ లేవు. కానీ ట్రంప్‌ తీరు వేరు. ఆపరేషన్‌ మొత్తం ఎలా జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పారు. ఆయన మాటలు జాగ్రత్తగా విన్న ప్రతి ఒక్కరూ అది కళ్లముందే జరిగిందన్న భ్రాంతికి లోనుకావడం ఖాయం. అమెరికన్‌ బలగాలు గుర్తించి కాల్పులు మొదలెట్టిన వెంటనే బాగ్దాదీ ముగ్గురు పిల్లల్ని తీసుకుని లబోదిబోమంటూ ఒక సొరంగంలో దూరిన వైనం, ఆ సొరంగానికి బయటకుపోయే మార్గం లేకపోవడం గురించి ట్రంప్‌ వివరించారు. అనంతరం పాత్రికేయులడిగిన సందేహాలన్నిటికీ జవాబి చ్చారు. మొత్తం నలభై నిమిషాలపాటు ట్రంప్‌ ప్రసంగించారు. బాగ్దాదీ తొలిసారి ప్రపంచానికి పరిచయమైననాటికీ, ఇప్పుడు మరణించేనాటికీ పరిస్థితుల్లో వచ్చిన వ్యత్యాసాన్ని గమనిస్తే ఐఎస్‌ ఉత్థానపతనాల గురించి స్థూలంగా అర్ధమవుతుంది. 2010లో ఐఎస్‌ ఆవిర్భావాన్ని ప్రకటించి నప్పుడు అది ప్రపంచ ముస్లింలందరికీ మార్గదర్శకత్వంవహిస్తుందని బాగ్దాదీ చెప్పుకున్నాడు.

కానీ ఇరాక్, ఇరాన్, సిరియా, అఫ్ఘానిస్తాన్‌ వగైరాల్లో అమెరికా అనుసరిస్తున్న ధోరణుల్ని గట్టిగా వ్యతిరేకించే ప్రపంచ ముస్లిం ప్రజానీకంలో సైతం అతనికి పెద్దగా మద్దతు లభించింది లేదు. సరిగదా కార్యకలాపాలు సాగించిన ప్రాంతాల్లోనే అది క్షీణించింది. తన చుట్టూ ఉండేవారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితికి అతను చేరుకున్నాడు. అల్‌ కాయిదా, ఐఎస్‌ మొదట్లో కలిసి పనిచేసినా 2013లో తెగదెంపులు చేసుకున్నాక ఆ రెండు సంస్థలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికాకు సాగిలబడిన ద్రోహులు మీరంటే మీరని నిందించుకు న్నాయి. పిరికిపందలని తిట్టుకున్నాయి. కానీ అల్‌ కాయిదా అనుబంధ సంస్థ హయత్‌ తహ్రిర్‌ అల్‌ షామ్‌(హెచ్‌టీఎస్‌)కు పలుకుబడి ఉన్న సిరియాలోని అద్లిబ్‌ ప్రాంతంలో ఇప్పుడు బాగ్దాదీ పట్టు బడటాన్ని గమనిస్తే చిట్టచివరిలో అతని స్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఖలీఫాగా తనను తాను ప్రకటించుకున్నాక అతను నేరుగా దానికి నాయకత్వంవహించింది తక్కువ. పైగా దాని కంటూ ప్రత్యేకించి ఒక స్థావరం లేదు.

2003లో అమెరికా దురాక్రమించే సమయానికి ఇరాక్‌ ఎంతో ప్రశాంతంగా ఉండే సోషలిస్టు, సెక్యులర్‌ రాజ్యం. రాజ్యాంగంలో ఇస్లామ్‌ను అధికార మతంగా ప్రకటించడానికి ఆ దేశాధ్యక్షుడు సద్దాంహుస్సేన్‌ నిరాకరించారు. అలాంటి దేశాన్ని వల్లకాడుగా మార్చి అప్పటికి పాఠశాల చదువు కూడా పూర్తిచేయని బాగ్దాదీ లాంటివారిని ఉగ్రవాదులుగా రూపాంతరం చెందే స్థితికి చేర్చింది అమెరికాయే. ఐఎస్‌ బాధితుల్లో అత్యధికులు ముస్లింలే. ఈ వాస్తవాన్ని దాచి అది మత సంస్థగా చిత్రించడం పాశ్చాత్య మీడియా అవగాహన లేమి పర్యవసానం. సిరియా అధ్యక్షుడు అసద్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడం కోసం య«థేచ్ఛగా డాలర్లు, ఆయుధాలు కుమ్మరించి, ఎందరు మొత్తుకుం టున్నా వినక ఐఎస్‌ను పెంచి పోషించిన అమెరికాయే ఇప్పుడు బాగ్దాదీ మరణంలో తన విజ  యాన్ని వెదుక్కుంటున్న తీరు విడ్డూరం. కనీసం ఇప్పటికైనా తన చేష్టలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తున్నాయో గ్రహించి తీరు మార్చుకోవడం అమెరికా బాధ్యత. ఆ బాధ్యతను అది గుర్తించేలా చేయడం ప్రపంచ ప్రజానీకం కర్తవ్యం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top