‘కుదింపు’ రాజకీయం

Editorial On CBSE Syllabus Reduced By 30 Percentage - Sakshi

విద్యార్థులపై ప్రభుత్వాలు కరుణ చూపే సందర్భాలు గతంలో చాలా తక్కువుండేవి. ఏవో కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రభుత్వాలుగానీ, కేంద్రంగానీ వారి గోడు పట్టించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. దేశంలో విద్యను ప్రైవేటుకు విడిచిపెట్టి, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు దశాబ్దా లుగా భారీ ఫీజులతో పీల్చిపిప్పిచేస్తున్నా నామమాత్రం చర్యలతో పాలకులు పొద్దుపుచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని పరోక్షంగా తూట్లుపొడిచారు. ఈ విధానం ఇప్పట్లో మారుతుందో లేదోగానీ... కరోనా మహమ్మారి పుణ్యమా అని సిలబస్‌లో మాత్రం మూడో వంతు తగ్గిస్తున్నట్టు సీబీఎస్‌ఈ ప్రకటించింది.

2020–21 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12వ తరగతి వరకూ వున్న సిలబస్‌లో 30 శాతాన్ని తగ్గిస్తూ బుధవారం ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ తరగతుల విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లోని స్పందనలు చెబుతున్నాయి. నీట్, జేఈఈ పరీక్షలకు ప్రశ్న పత్రాలు రూపొందించేటపుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నదే వారి ఏకైక డిమాండు. ఇతర తరగతులవారు సైతం మా సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ వయసు పిల్లల్లో అత్యధికులు సిలబస్‌ భారం తగ్గిందంటే వేరే విధంగా స్పందిస్తారని అనుకోనవసరం లేదు. కానీ విపక్షాలు మాత్రం అభ్యంతరం చెబుతున్నాయి. ఈ నిర్ణయంలో దురుద్దేశాలున్నాయని ఆరోపిస్తు న్నాయి.

సిలబస్‌ తొలగింపులో కాదు... విపక్షాల పాక్షిక దృక్పథంలోనే దురుద్దేశం వుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ వాదన. అందుకాయన కొన్ని కారణాలు చెబుతున్నారు. ఒక్క సామాజిక శాస్త్రాల్లో మాత్రమే కాక సైన్స్, గణితం, ఇంగ్లిష్, హిందీ, హోంసైన్స్, జామెట్రీ వంటి వేర్వేరు సబ్జెక్టుల్లో కూడా సిలబస్‌ తొలగించారని ఆయన వివరణ. సిలబస్‌ తగ్గింపుపై రాజకీయం వద్దని కూడా ఆయన సలహా ఇచ్చారు. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల పర్యవసానంగా 190 సబ్జెక్టుల్లో సిలబస్‌ కుదించామని, ఇది ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితమని అటు సీబీఎస్‌ఈ చెబుతోంది. 

ఈసారికి సిలబస్‌ తగ్గించాలన్న డిమాండు తొలిసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మానిష్‌ సిసోడియా నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు తొలగించిన అంశాలు చూశాక ఆయనే ఆశ్చర్యపోతున్నారు. అన్నింటి మూలాలు రాజకీయాలతో ముడిపడిన వర్తమానంలో సిలబస్‌ కుదింపు అంశం వివాదం కావడంలో ఆశ్చర్యం లేదు. అన్నింటా సిలబస్‌ కుదించాం కదా అన్న కేంద్రమంత్రి పోఖ్రియాల్‌ వాదన సరైందే కావొచ్చు. కానీ ఇతర సబ్జెక్టులకూ, సామాజిక శాస్త్రాలకూ చాలా వ్యత్యాసం వుంది. పరస్పరం సంఘ ర్షిస్తున్న సిద్ధాంతాలు, భావనలు సమాజంలో అనేకం వుంటాయి. ఏకీభావం కుదిరే అంశాల్లో సైతం భిన్న దృక్పథాలుంటాయి. వాటిని గురించి చర్చించేవి, వివరించేవి, విద్యార్థికి అవగాహన కలిగించేవి

సామాజిక శాస్త్రాలు. కనుక సహజంగానే ఆ శాస్త్రాల్లో తొలగించిన సిలబస్‌పై ప్రశ్నలు తలెత్తుతాయి. ఫలానా అంశం కాకుండా ఇదే ఎందుకు తొలగించవలసివచ్చిందన్న సంశయం వస్తుంది. ఆ తొల గింపు వెనకున్న ప్రయోజనాలేమిటన్న ఆరా ఉంటుంది. విపక్షాలను సంతృప్తిపర్చడానికో, మరెవ రికో తలెత్తే అనుమానాలు తీర్చడానికో కాదు... విద్యారంగ నిపుణులనుంచి ఎలాంటి అభ్యంతరం రాకుండా వుండాలంటే సీబీఎస్‌ఈ అయినా, మరెవరైనా సిలబస్‌ తొలగింపు విషయంలో పారదర్శ కంగా వుండాలి. అసలు ఫలానా అంశం లేకపోయినా ఫర్వాలేదనో... తొలగించి తీరాలనో ఏ ప్రాతి పదికన నిర్ణయానికొచ్చారో, అందుకు అనుసరించిన విధానంలోని హేతుబద్ధత ఏమిటో చెప్పాల్సిన బాధ్యత సీబీఎస్‌ఈకి వుంటుంది.

సీబీఎస్‌ఈ తొలగించిన పాఠ్యాంశాలు చూస్తే ఆశ్చర్యం కలగడం సహజం. ఉదాహరణకు పద కొండో తరగతిలో ప్రజాస్వామిక హక్కులు, పౌరసత్వం, ఫెడరలిజం, జెండర్, మతం, జాతీయ వాదం, లౌకికవాదం వంటి అంశాలు సిలబస్‌ కుదించాక ఎగిరిపోయాయి. ఇవన్నీ ఏ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకైనా అత్యంత ప్రాథమికమైనవి. మరోవిధంగా చెప్పాలంటే అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు. ఈ అంశాల్లో సమాజం వైఖరి ఎలావుందన్నదాన్ని బట్టే ఆ సమాజం ప్రజాస్వామికమైనదా, కాదా అన్నది తేలుతుంది. సామాజిక శాస్త్రాలు చదివే విద్యార్థులు ఆ అంశాల జోలికిపోకుండా ప్రజాస్వామ్యం గురించి ఏం అవగాహన చేసుకుంటారు? పన్నెండో తరగతి సిల బస్‌లో ‘ఇరుగు పొరుగుతో భారత్‌ సంబంధాలు’, సంస్కరణలతో ఆర్థికాభివృద్ధి, సామాజిక ఉద్య మాలు, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు.

మాయమైన ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగేందుకు అనువుగా ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యా విషయక క్యాలెండర్‌లో పొందుపరిచారు గనుక ఆందోళన పడొద్దని సీబీఎస్‌ఈ వివరిస్తోంది. కానీ ఈ అంశా లను లోతుగా అధ్యయనం చేయడం, చర్చించడం ఎలా సాధ్యం? ఈ కరోనా కాలం కొత్త అనుభవా లను కలిగిస్తోంది. ఎన్నడూ ఊహించడానికి శక్యంకానివి కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఒక ప్పుడు మోడరేషన్‌ కింద ఒకటి రెండు మార్కులు కలపాలంటే ఉద్యమాలు చేయాల్సివచ్చేది. కానీ ఇప్పుడు బడికి వెళ్లాల్సిన భారం లేకపోవడం, చదవకుండానే, పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం, ఇప్పటికే ఫెయిలై సప్లిమెంటరీ రాయవలసినవారు కూడా పైతరగతులకు అర్హులు కావడం వంటివన్నీ జరిగిపోతున్నాయి.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఉంది గనుక, తొలగించిన అంశాలకు సంబంధించి బీజేపీకున్న దృక్పథమేమిటో తెలుసు గనుక సహజం గానే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిరుడు ఏప్రిల్‌లో కూడా సీబీఎస్‌ఈ కుల ఘర్షణలు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి ఎదురయ్యే సవాళ్లు, భిన్నత్వంవంటి అంశాలు తొలగించింది. విద్యార్థులకు సిల బస్‌ భారాన్ని తొలగించాలనుకోవడం ఆహ్వానించదగ్గదే. కానీ ఆ పేరుతో అసలు ఆలోచించే భారాన్నే కుదించాలనుకోవడం మంచిది కాదు. ఈ కుదింపు తరచుగా వివాదాస్పదమవుతున్నది గనుక అందులో పారదర్శకతకు చోటీయడం ఉత్తమం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top