‘ఆధార్‌’కు రాజ్యాంగబద్ధత

Constitutional Validity To Aadhar - Sakshi

సర్వోన్నత న్యాయస్థానం వెలువరించాల్సిన కీలక తీర్పుల పరంపరలో ఒకటైన ఆధార్‌ కేసులో బుధవారం నిర్ణయం వెలువడింది. అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 4–1 మెజారిటీ తీర్పులో ఆధార్‌ రాజ్యాంగ బద్ధతను ధ్రువీకరిస్తూనే దాని వినియోగంపై కొన్ని ఆంక్షలు విధించింది. అంతేకాదు, ఆధార్‌ లేదన్న కారణంగా పౌరులకుండే హక్కుల్ని నిరాకరించరాదని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మాత్రం ఇతర న్యాయమూర్తులతో విభే దించారు. రాజ్యసభలో ఓటింగ్‌ తప్పించుకోవటం కోసం కేంద్రం దాన్ని ద్రవ్య బిల్లుగా చిత్రిం చడాన్ని ఆయన ‘వంచన’గా అభివర్ణించారు. కనుకనే ఈ పథకం రాజ్యాంగబద్ధం కాదని అభి ప్రాయపడ్డారు.

అయితే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం చెప్పిన విషయాలను గుర్తుకుతెచ్చుకున్నా, అనంతరకాలంలో దానిపై వ్యక్తమైన భయాందోళనల్ని పరిగణనలోకి తీసుకున్నా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చాలామందికి అసంతృప్తే మిగు లుస్తుంది. ముఖ్యంగా పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఈ పథకం ముప్పు కలిగిస్తుందన్న అభిప్రా యంతో సర్వో న్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. పైగా ఇప్పటికే దాదాపు వందకోట్లమంది పౌరులు నమోదై ఉన్నారు గనుక ఆధార్‌ను మొత్తంగా తోసిపుచ్చటం సాధ్యంకాదని తేల్చింది. ఆధార్‌ పరిధి నుంచి కొన్నిటిని ధర్మాసనం తప్పించినా సంక్షేమ పథకాలకు అది వర్తింపజేయటం సమంజసమేనని తెలిపింది. అలా వర్తింపజేయటంలో ఉన్న ఇబ్బందులు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చి నట్టు లేదు. వేలి ముద్రలు సరిపోలడం లేదంటూ అనేకమందికి రేషన్, పింఛన్, ఇతర పథకాలు నిరాకరిస్తున్నారు.

వేల కోట్ల రూపాయల వ్యయం కాగల బృహత్తరమైన ఆధార్‌ పథకం 2009లో కేవలం ఒక పాలనాపరమైన ఉత్తర్వులతో ఉనికిలోకి వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిర్దిష్టమైన మొత్తా నికి మించి వ్యయం కాగల ఏ పథకానికైనా పార్లమెంటు ఆమోదం అవసరమవుతుంది. ఆ పథ కానికి చట్టపరమైన ప్రాతిపదిక తప్పనిసరవుతుంది. కానీ ఆధార్‌ మాత్రం చాలాకాలంపాటు ఏమీ లేకుండానే కొనసాగింది. ఎన్నో విమర్శలు వచ్చాక, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యాక అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆదరా బాదరాగా జాతీయ గుర్తింపు ప్రాధికార సంస్థ బిల్లును తీసుకొచ్చింది. అది చివరకు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లింది. బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌సిన్హా నేతృత్వంలోని ఆ కమిటీ బిల్లును పూర్తిగా తిరస్కరించింది. దాని స్థానంలో వేరే బిల్లు తెస్తామని చెప్పినా చివరకు అది తీసుకురాకుండానే ప్రభుత్వ పదవీకాలం ముగిసిపోయింది. తుది తీర్పు వెలువడే వరకూ పౌరులెవరికీ ఆధార్‌ను తప్పనిసరి చేయరాదన్న సుప్రీంకోర్టు... అనంతరకా లంలో దాన్ని సడలించుకుంది. అసలు న్యాయస్థానం విధించిన పరిమితులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాలు అనేకానేక పథకాలకు ఆధార్‌ను విస్తరించుకుంటూ పోయాయి.

ఈలోగా 2016లో ఎన్‌డీఏ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆధార్‌కు ఆమోదం పొందింది. రాజ్యసభలో మెజారిటీ లేదు గనుక, దానికి సవరణలు ప్రతిపాదించి తిప్పిపంపే ప్రమాదం ఉంది గనుక దాన్ని ద్రవ్యబిల్లుగా పేర్కొని చేతులు దులుపుకుంది. ఇప్పుడు జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆ చర్యనే తప్పు బట్టారు. అందువల్లే అది రాజ్యాంగబద్ధమైనది కాదని చెప్పారు. ఆ సంగతలా ఉంచి అటు కేంద్రం, ఇటు కాంగ్రెస్‌ తదితర పక్షాలు సుప్రీంకోర్టు తీర్పు తమ విజయమంటే తమ విజయమని జబ్బలు చరుచుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ కీలక అంశంపైన అయినా అధికారంలో ఉండగా ఒక విధంగా, విపక్షంలో ఉండగా మరొకలా మాట్లాడటం మన దేశంలో మాత్రమే కనబడే వింత ధోరణి. ఆధార్‌ విషయంలోనూ అది కొనసాగింది. ఆ సంగతలా ఉంచి... ఆధార్‌పై చర్చ జరిగి అది ఆమోదం పొందిన రోజున 545మంది సభ్యులుండే లోక్‌సభలో కేవలం 73మంది మాత్రమే ఉన్నారు. సభలో అప్పటికి అధికార పక్షం బలం 336 అయితే, విపక్ష బలం 205. మరి వీరంతా ఏమైనట్టు? ఇందులో ఏ పక్షానికైనా పౌరుల వ్యక్తిగత గోప్యతపై గానీ, ఆధార్‌ డేటా లీకేజీ వల్ల జరగబోయే ఇతర ప్రమాదాలపైగానీ పట్టింపు ఉన్నదని భావించగలమా? 

ఇంతకూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల పౌరులకు అదనంగా ఒరిగిందేమిటి? ఆధార్‌ డేటా లీకైందని వార్తలు వెలువడినప్పుడల్లా అది తమ దగ్గర జరగలేదని, ఫలానా సంస్థ వల్ల బయటికొచ్చిందని ప్రాధికార సంస్థ వివరణనిచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇకపై అది చెల్లదు. డేటా భద్రతకు అది బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకవసరమైన కట్టుదిట్టమైన నిబంధనల్ని ప్రభుత్వం ఎలా రూపొందిస్తుందో వేచి చూడాలి. పౌరుల వ్యక్తిగత డేటా పరిరక్షణపై మొన్న జూలైలో శ్రీకృష్ణ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ఆధారంగా చట్టం రావలసి ఉంది. ప్రైవేటు సంస్థలు  డేటాను వినియోగించుకోవటానికి వీలు కల్పించే ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను ధర్మాసనం కొట్టేసినా ఇంతవరకూ టెలికాం సంస్థలు, బ్యాంకులు, డిజిటల్‌ పేమెంటు సంస్థలు సేకరించిన డేటా స్థితి ఏమిటో చెప్పలేదు. చట్ట ప్రాతిపదిక లేదు గనుకనే ఈ సెక్షన్‌ను కొట్టేస్తున్నామని ధర్మాసనం తెలి పింది.

దానికోసం రేపో మాపో కేంద్రం ఎటూ చట్టం తీసుకొస్తుంది. ఆ తర్వాత యధావిధిగా అది అమలవుతుంది. కనుక పౌరులకు ఇందువల్ల కలిగింది తాత్కాలిక ఊరట మాత్రమే. అసమ్మతి తీర్పు వెలువరించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. టెలికాం సంస్థలు సేకరించిన డేటాను రెండువారాల్లో తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని ఆదేశించారు. ఆయన కూడా బ్యాంకుల వద్ద ఉన్న డేటా సంగతి చెప్పలేదు. ఇక ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఆధార్‌ ధ్రువీకరణ రికార్డులను ఆర్నెల్లు మించి దగ్గరుంచుకోవటానికి వీల్లేదనటం కాస్త ఊరట. మొత్తానికి పౌరుల వ్యక్తిగత గోప్యతను సుప్రీం కోర్టు పరిరక్షిస్తుందని ఎదురుచూసినవారికి ఈ తీర్పు నిరాశ కలిగిస్తుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top