
అన్ని మతాలూ సేవా భావాన్ని బోధిస్తున్నాయి
హిందువుల్లో మోక్షం అనే భావన ఉంది
సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ వెల్లడి
వక్ఫ్(సవరణ) చట్టంపై ముగిసిన వాదనలు
మధ్యంతర ఉత్తర్వును రిజర్వ్ చేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మూడు రోజులపాటు జరిగిన వాదనలు గురువారం ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వక్ఫ్ అనేది కేవలం ఒక సేవా కార్యక్రమం అని, అది ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని తుషార్ మెహతా పేర్కొనగా, కపిల్ సిబల్ స్పందిస్తూ... మరణానంతర జీవితం కోసం దేవుడికి, సమాజానికి సేవ చేయడమే వక్ఫ్ అని తేల్చిచెప్పారు. ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం భగవంతుడికి అంకితంకావడం వక్ఫ్ అని వివరించారు.
సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. హిందూ మతస్తుల్లో మోక్షం అనే భావన ఉందని గుర్తుచేశారు. జస్టిస్ అగస్టీన్ జార్జి స్పందిస్తూ.. క్రైస్తవ మతంలోనూ అలాంటి భావనే ఉందన్నారు. స్వర్గానికి చేరుకోవడానికి క్రైస్తవులు ఆరాటపడుతుంటారని తెలిపారు. అనంతరం రాజీవ్ ధావన్ మాట్లాడుతూ కేంద్రం వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వేదాల ప్రకారం చూస్తే హిందూ మతంలో దేవాలయాలు తప్పనిసరి భాగం కాదని చెప్పారు. ప్రకృతిని ఆరాధించే ఆచారం హిందూ మతంలో ఉందన్నారు. అగ్ని, నీరు, వర్షం, పర్వతాలు, సముద్రాలను దేవుళ్లుగా పూజిస్తుంటారని గుర్తుచేశారు.
దాదాపు అన్ని మతాల్లో సేవా భావన ఉందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. మతాల్లో అదొక ప్రాథమిక సూత్రమని వెల్లడించారు. సేవా కార్యక్రమాల విషయంలో మతాలన్నింటి సారం ఒక్కటేనని, వాటి మధ్య భేదం లేదని పరోక్షంగా తెలియజేశారు. మరోవైపు వక్ఫ్(సవరణ) చట్టాన్ని చట్టబద్ధంగానే తీసుకొచ్చారని, ఇది చట్టవిరుద్ధమని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత పిటిషనర్లదేనని సీజేఐ సూచించారు. పార్లమెంట్ ఆమోదంతో తీసుకొచి్చన చట్టంపై స్టే ఇవ్వొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు.
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు?
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా నియమించాలన్న నిబంధనను చట్టంలో చేర్చడాన్ని కపిల్ సిబల్ తప్పుపట్టారు. హిందూ ధార్మిక సంస్థల్లో హిందూయేతరులకు ప్రవేశం ఉండదని తెలిపారు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. వక్ఫ్(సవరణ) చట్టంపై సుప్రీంకోర్టు ఉత్తర్వు శుక్రవారం వెలువడే అవకాశం ఉంది.