భాస్కర కృష్ణ స్వరూప్ (ఫైల్)
ఎట్టకేలకు బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది
కుత్బుల్లాపూర్: పురోహితుడి ప్రాణానికి వెల కట్టారు... కేసు ఊసే లేకుండా పోలీసులు కల్పించిన వెసులుబాటును ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు చక్కగా వినియోగించుకున్నారు. మూడు రోజులుగా ఈ కేసు విషయంపై స్థానికంగా ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎట్టకేలకు బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వివరాలు... పద్మానగర్ ఫేజ్–2కు చెందిన శ్రీనివాసాచార్యుల కుమారుడు భాస్కర కృష్ణ స్వరూప్ స్థానిక మహిళతో చనువుగా ఉంటుండటంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు సంక్షేమ సంఘం నేతలు చేయి చేసుకున్నారు.
దీంతో మనస్తాపం చెందిన భాస్కర కృష్ణ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపటంతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిలో నలుగురిని అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకొని... గుట్టు చప్పుడు కాకుండా వెంటనే వదిలేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత అండతో వారు బేరసారాలకు దిగి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. కేసు లేకుండా రూ. 5 లక్షలు మృతుని కుటుంబీలకు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రూ. 2 లక్షలు మొదటి విడతలో, కేసు మాఫీ తర్వాత మరో రూ.3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.
బుధవారం పద్మానగర్ సమీపంలోని ఓ ఆలయంలో మృతుని తండ్రి శ్రీనివాసాచార్యుల తరఫున కొందరు పురోహితులు చర్చలు జరిపి ఒప్పందం చేసినట్లు తెలిసింది. సామాన్య కేసుల్లో ఫిర్యాదు చేయగానే అనుమానితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించే పోలీసులు ఈ కేసులో మాత్రం పూర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సహకరించారన్న పుకార్లు షికార్లు చేశాయి.
పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆరోపణలు ఎదుర్కొన్న వారు దర్జాగా తిరుగుతున్నా పట్టించుకోకుండా చివరకు బేరసారాలు జరిగే వరకు పోలీసులు అన్నీ తామై వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాల్సిన పోలీసులు.. ఈ విధంగా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడం విశేషం.


