breaking news
quthbullapoor
-
గోడ కూలడంతో బావిలో పడి వ్యక్తి గల్లంతు
కుత్బుల్లాపూర్: భారీ వర్షానికి గోడ కూలడంతో ఓ వ్యక్తి పక్కనే ఉన్న బావిలో పడి గల్లంతైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ డి.వి.రంగారెడ్డి కథనం ప్రకారం...కొంపల్లి బిగ్‌బజార్ ముందు సర్వీసు రోడ్డులో అంజిరెడ్డి అనే వ్యక్తికి వ్యవసాయ బావి ఉంది. అక్కడే ఉన్న ఓ గదిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెడికెట్ గ్రామానికి చెందిన గుండెం నాగలింగం(50) నివాసం ఉంటున్నాడు. మంగళవారం కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా గది గోడ కూలి నాగలింగంపై పడగా..ఆయన పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. బావి పూర్తిగా నీటితో నిండిపోవడంతో, మోటార్లతో నీటిని తోడినప్పటికీ భారీ నీటి ప్రవాహం ఉండడంతో ఫలితం కన్పించలేదు. -
పురోహితుడి ప్రాణం ఖరీదు రూ.5 లక్షలు!
కుత్బుల్లాపూర్: పురోహితుడి ప్రాణానికి వెల కట్టారు... కేసు ఊసే లేకుండా పోలీసులు కల్పించిన వెసులుబాటును ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు చక్కగా వినియోగించుకున్నారు. మూడు రోజులుగా ఈ కేసు విషయంపై స్థానికంగా ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎట్టకేలకు బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వివరాలు... పద్మానగర్ ఫేజ్–2కు చెందిన శ్రీనివాసాచార్యుల కుమారుడు భాస్కర కృష్ణ స్వరూప్ స్థానిక మహిళతో చనువుగా ఉంటుండటంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు సంక్షేమ సంఘం నేతలు చేయి చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన భాస్కర కృష్ణ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపటంతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిలో నలుగురిని అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకొని... గుట్టు చప్పుడు కాకుండా వెంటనే వదిలేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత అండతో వారు బేరసారాలకు దిగి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. కేసు లేకుండా రూ. 5 లక్షలు మృతుని కుటుంబీలకు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రూ. 2 లక్షలు మొదటి విడతలో, కేసు మాఫీ తర్వాత మరో రూ.3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. బుధవారం పద్మానగర్ సమీపంలోని ఓ ఆలయంలో మృతుని తండ్రి శ్రీనివాసాచార్యుల తరఫున కొందరు పురోహితులు చర్చలు జరిపి ఒప్పందం చేసినట్లు తెలిసింది. సామాన్య కేసుల్లో ఫిర్యాదు చేయగానే అనుమానితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించే పోలీసులు ఈ కేసులో మాత్రం పూర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సహకరించారన్న పుకార్లు షికార్లు చేశాయి. పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆరోపణలు ఎదుర్కొన్న వారు దర్జాగా తిరుగుతున్నా పట్టించుకోకుండా చివరకు బేరసారాలు జరిగే వరకు పోలీసులు అన్నీ తామై వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాల్సిన పోలీసులు.. ఈ విధంగా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడం విశేషం. -
జర్నలిస్టులపై కక్ష సాధింపు తగదు
జగద్గిరిగుట్ట: వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రిక, సాక్షి జర్నలిస్ట్‌లపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గు చేటని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో జర్నలిస్ట్ సంఘాలు, అఖిల పక్ష నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసనగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ .. ఏపీలో రాజధాని ఏర్పాటుకు ముందే రైతులను మోసం చేసి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు జరిపిన భూదందాలపై పూర్తి ఆధారాలతో వెలుగులోకి తేవడంతో జీర్ణించుకోలేని ప్రభుత్వం శనివారం పోలీసుల ద్వారా సాక్షికి నోటీసులు జారీ చేయడం సిగ్గు చేటన్నారు. ఓటుకు నోటు కేసులో తప్పు చేయని చంద్రబాబు కోర్టుకు ఎందుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. ఏపీ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను పూర్తి ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియ పరుస్తున్న సాక్షి పై చంద్రబాబు చర్యలు గర్హనీయమన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం జర్నలిస్ట్‌లకు జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకుని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐజేసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రంగు వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ..ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకుని జర్నలిస్టులపై గతంలో పెట్టిన కేసులను, ప్రసుత్తం జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో టీయూడబ్లు్యజే రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాల్‌రాజ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎత్తరి మారయ్య, రుద్ర అశోక్, సీపీఐ నాయకుడు చర్లపల్లి రాములు, వెంకటేశ్, సోమన్న, టీఎంజేఏసీ జిల్లా అధ్యక్షుడు కమ్మెట భూపాల్, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి రామస్వామి, చిరమర్తి రాజు, జేఏసీ కన్వీనర్ శివరాత్రి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొరిగె బాలప్ప, చింతకుంట వెంకటేశ్ యాదవ్, గౌరిశెట్టి శివఈశ్వర్రావు, యువజన కాంగ్రెస్ నేత రమేష్ మంజల్కర్, రమేష్‌గౌడ్, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.


