మార్చి 24 నుంచి టెన్త్ పరీక్షలు..? | Tenth examinations from March 24 ..? | Sakshi
Sakshi News home page

మార్చి 24 నుంచి టెన్త్ పరీక్షలు..?

Nov 22 2015 12:40 AM | Updated on Nov 9 2018 5:52 PM

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలను మార్చి 24 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

యోచిస్తున్న విద్యాశాఖ.. 
వివిధ పరీక్షల ఫీజుల పెంపునకు కసరత్తు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలను మార్చి 24 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏపీలో మార్చి 24 నుంచే పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలోనూ అదే తేదీ నుంచే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఏపీ, తెలంగాణల్లో వేర్వేరు తేదీల్లో పరీక్షల నిర్వహణ వల్ల అక్కడ ఇచ్చే ప్రశ్నలు ఇక్కడ, ఇక్కడ ఇచ్చే ప్రశ్నలు అక్కడ వచ్చే అవకాశమున్నందున రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పరీక్షలు మొదలుపెడితే బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. 
 
 పదో తరగతి పరీక్షా ఫీజు పెంపు...!
 వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి 2017 మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులను పెంచాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం రూ.125 ఉన్న ఫీజును రూ.600కు పెంచాలని ఆలోచిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉన్నందున మిగతా సామాజిక వర్గాల విద్యార్థులకు కూడా ఫీజు మినహాయింపు ఇవ్వాలని యోచిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement