బొమ్మల పాఠం | syllabus change in anganwadies | Sakshi
Sakshi News home page

బొమ్మల పాఠం

Jul 19 2017 10:03 PM | Updated on Jun 2 2018 8:36 PM

బొమ్మల పాఠం - Sakshi

బొమ్మల పాఠం

ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

అంగన్‌వాడీల్లో మారిన సిలబస్‌
చిన్నారుల్లో సృజనాత్మకతకు పదును
పూర్వ ప్రాథమిక విద్యతో గట్టి పునాది


జిల్లాలో మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు: 5,126
మొత్తం చిన్నారులు     :2,58,948
సొంత భవనాలున్న సెంటర్లు        :1540
అద్దె, తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న సెంటర్లు        :2705
అంగన్‌వాడీ సిబ్బంది    :5,120


ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంఠస్త విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థుల్లో సృజనాత్మకకు పదును పెట్టేలా బోధనలు సాగుతున్నాయి. పరీక్షల్లోనూ స్వతహాగా జవాబులు రాసేలా విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. పూర్వ ప్రాథమిక విద్యనుంచే విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించే దిశగా సిలబస్‌లో రూపకల్పనలు జరుగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలనుంచే తొలి అడుగులు పడుతున్నాయి.

గుమ్మఘట్ట : అంగన్‌వాడీ కేంద్రాల తీరుతెన్నులు మారుతున్నాయి. ఇప్పటివరకు పిల్లలకు పౌష్టికాహారం.. ఆటపాటలు.. అక్షరాల అభ్యసనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు. మారుతున్న కాలానికనుగుణంగా చిన్నారులను తీర్చేందుకు అంగన్‌వాడీల్లో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం బోధన విద్యావిధానంలో మార్పులు చేశారు. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న పూర్వ ప్రాథమిక విద్యకు మరింత పదును పెట్టారు. వివిధ రకాల కృత్యధార విజ్ఞానదాయక సిలబస్‌ను రూపకల్పన చేశారు.

సృజనాత్మకతకు పెద్దపీట
బడిమెట్లు ఎక్కేలోగా పిల్లలు స్వతహాగా బొమ్మచూసి బోలెడు విషయాలు చెప్పేలా, వారిలో నైపుణ్యాన్ని వెలికితీసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల వేళలతో పాటు సిలబస్‌ మార్పుచేశారు.  అంతేకాకుండా ప్రత్యేక బోధన కిట్లు తయారుచేసి అన్ని కేంద్రాలకు సరఫరా చేశారు. వీటి సాయంతో బోధన గురించి సీడీపీఓ, పర్యవేక్షకురాళ్లు, అంగన్‌ వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 1.16 లక్షల మంది చిన్నారులను చురుగ్గా తయారుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

14 అంశాలతో కూడిన బోధన
పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమం, కృత్యదార బోధన నిర్వహణకు అందించిన పరికరాలను విధిగా వినియోగించాలి. పిల్లల్లో చురుకైన ఆలోచన, సృజనత్మాకత, చేతి కండరాల అభివృద్ధి, మంచి అలవాట్లు పెంపొందించేందుకు దోహదపడేలా చూడాలి. ఇందుకోసం పూర్వ ప్రాథమిక విద్య కిట్లలో 14 అంశాలకు సంబంధించిన పరికరాలను పొందుపర్చారు. ఏఏ అంశాలను ఎలా బోధించాలి. ఏ పరికరం వల్ల ఎటువంటి ప్రయోజనం పొందవచ్చునో అంగన్‌వాడీ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు.

పరికరాలు.. ప్రయోజనాలు ఇలా..
కృత్యమాలికలు (యాక్టివిటీ బుక్స్‌):  20 డ్రాయింగ్‌ పుస్తకాలను ఇచ్చారు. మూడు, నాలుగేళ్లు పై బడిన పిల్లలతో వీటిలో గీతల ఆధారంగా అక్షరాలపై రంగులు వేయించాలి. తద్వార పిల్లల్లో మేధాశక్తిని పెంపొందుతుంది. సృజనాత్మకత, స్వతహాగా ఆలోచించేందుకు ఉపయోగ పడుతుంది.

వర్క్‌బుక్‌: ఒక్కో విద్యార్థికి ఒక్కో పుస్తకం ఇచ్చి వారే అందులో రాసేలా చూస్తారు. దీనివల్ల అక్షరాల సంసిద్ధత, వాటిని గుర్తించడం, పదాలు పలకటం అలువడుతుంది. రాయడం, చదవడంపై ఆసక్తి పెరుగుతుంది. చేయికి కంటికి సమన్వయం కలిగేలా దీన్ని రూపొందించారు.

ఆకృతులు: వివిధ ఆకారాలు, పరిమాణాల పూసలు, వివిధ ఆకారాల్లో చిన్న, పెద్ద పరిమాణంలో ప్లాస్టిక్‌ ఆకృతులు ఇచ్చారు. వృత్తం, త్రికోణం ఇలా వివిధ ఆకృతుల్లోని వస్తువులను చిన్నవాటి నుంచి పెద్ద వాటిని వేరు చేయడం చిన్నారులకు నేర్పాలి. దీనిద్వారా ఆకృతులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా చిన్న, పెద్ద కండరాల అభివృద్ధి, ఆలోచించడం, ఆనందించడం, మేధాశక్తి పెంపొందించడం, రంగులు గుర్తించడం, పరిశీలన శక్తి పెరుగుతుంది.

బొమ్మలు: ఫింగర్‌ పప్పెట్లు, బొమ్మలు, రంగు రంగుల మైనం పెన్సిళ్లు, టచ్‌ టాబ్‌ లెట్స్, స్టిక్‌ పప్పెట్స్, (మంచి అలవాట్లు), ముసుగుల (మాస్కులు), కన్‌స్ట్రక్షన్‌ బ్లాక్‌లు, నట్టులు, బోల్టులు, బాస్కెట్‌బాల్, గడియారం, సీతాకోకచిలుక, షూలెస్‌, లేస్‌ బోర్డులు అందించారు. ఈ కిట్లలో ఇచ్చిన పరికరాల ప్రయోజనాలను తెలియజేయడం ద్వారా పిల్లల్లో మేధాశక్తి, సృజనాత్మకతను వెలికి తీసేలా సిలబస్‌ రూపొందించారు.

సక్రమంగా అమలయ్యేలా చూస్తాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాం. 14 అంశాలకు సంబంధించిన కిట్లను అన్ని కేంద్రాలకు సరఫరా చేశాం. ఈ విధానంతో చిన్నారుల్లో సృజనాత్మకత వెలికితీసేలా అంగన్‌వాడీలు బోధన సాగుతుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నారులకు నాణ్యమైన బోధన సాగేలా చూస్తాం
– కృష్ణకుమారి, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement