మంత్రి పేరు లేకుండా ఫిర్యాదు ఇమ్మంటున్నారు | Sakshi
Sakshi News home page

మంత్రి పేరు లేకుండా ఫిర్యాదు ఇమ్మంటున్నారు

Published Sat, Apr 2 2016 9:01 AM

చికిత్సపొందుతున్న సురేంద్రనాథ్ - Sakshi

ఫిర్యాదులో మంత్రి ప్రత్తిపాటి, ఆయన భార్య పేరు వద్దని పోలీసుల ఒత్తిడి
దుండగుల దాడిలో గాయపడిన ‘సాక్షి’ విలేకరి సురేంద్ర ఆవేదన
చికిత్స పొందుతున్న బాధితుడు


గుంటూరు (పట్నంబజారు): మంత్రి ప్రత్తిపాటి దంపతుల పేర్లు లేకుండా ఫిర్యాదు ఇమ్మని పోలీ సులు ఒత్తిడి చేస్తున్నారని గుంటూరు జిల్లా చిలకలూరి పేట ‘సాక్షి’ విలేకరి సురేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన సురేంద్ర శుక్రవారం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కర్రలతో తీవ్రంగా గాయపరచడంతో తీవ్ర మైన నొప్పులతో ఆయన బాధపడుతున్నారు. బంధువుల సహాయంతో గుంటూరు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సురేంద్ర మీడియాతో మాట్లాడారు.

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రి గోల్డ్ భూ ములు, రాజధానిలో కొనుగోలు చే సిన భూముల గురించి వార్తలు రాయడంతోనే తనపై ఆయన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. గతంలోనూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వార్తలు రాసిన నేపథ్యంలో మంత్రి భార్య ఆదేశాల మేరకే పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని వాపోయారు. తనపై దాడి జరిగిన అనంతరం యడ్లపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అయితే సంబంధిత స్టేషన్ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు..  ఫిర్యాదులో మంత్రి ప్రత్తిపాటి, ఆయన భార్య పేర్లు లేకుండా తిరిగి ఇవ్వమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై రౌడీషీటు కూడా తెరిపించారని, మంత్రి ప్రత్తిపాటి ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకుంటున్నారని వాపోయారు. సురేంద్రనాథ్‌పై దాడిని ఎంపీటీసీ సభ్యుడు వి.శ్రీనుబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి చింతారావు ఖండించారు.

Advertisement
Advertisement