వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Published Wed, Aug 3 2016 11:29 PM

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి - Sakshi

చాట్రాయి :
 జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. మొక్కజొన్న కండెల లోడు లారీ పల్టీ కొట్టడంతో భార్యాభర్తలు మృతిచెందారు. లారీ ఢీకొని మరో యువకుడు దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం అడ్డరోడ్డుకు చెందిన 18మంది కూలీలు బుధవారం చాట్రాయి మండలంలోని చిత్తపూరు గ్రామంలో మొక్కజొన్న కండెలు విరిచే పనికి వచ్చారు. సాయంత్రం మొక్కజొన్న కండెలు లోడు చేసుకుని తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా, మర్లపాలెం గ్రామం వద్ద లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న కూలీలు అబ్బదాసరి ఫ్రాన్సిస్‌(40), అబ్బదాసరి లక్ష్మి(35) దంపతులు మృతిచెందారు. తాణంకి నాగరాజు, తాణంకి వేణు, కొమ్ము పద్మ, శిరోమణి, నాగజ్యోతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో నూజివీడు, చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
మితిమీరిన వేగం.. తీసింది ప్రాణం
కంకిపాడు : 
జాతీయ రహదారిపై కంకిపాడు–గోసాల మార్గంలో వేగంగా వెళ్తున్న లారీ, మోటారుసైకిల్‌ ఢీకొని ఓ యువకుడు మరణించాడు. విజయవాడ నుంచి ఉయ్యూరు వైపు వెళ్తున్న లారీ, కంకిపాడు నుంచి విజయవాడ వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఓ కార్పొరేట్‌ కాలేజీ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. లారీ ఇంజిన్‌ భాగంలో బైక్‌ ఇరుక్కుపోయింది. బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన యువకుడు ఈడుపుగల్లు గ్రామానికి చెందిన ఎన్‌.అశోక్‌ (25)గా గుర్తించారు. అతను పెయింటర్‌గా పని చేస్తుంటాడని తేలింది. గాయపడిన వ్యక్తి కూడా అదే గ్రామానికి చెందిన కర్రా శివకోట్లుగా నిర్ధారించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అశోక్, శివకోట్లును 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
Advertisement