జిల్లాకు రానున్న నాలుగు రోజుల్లో అంటే ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాకు రానున్న నాలుగు రోజుల్లో అంటే ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు వచ్చే నాలుగు రోజుల్లో 4 నుంచి 35 మి.మీ. మేర తేలికపాటి నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 79, మధ్యాహ్నం 55 నుంచి 59 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 9 నుంచి 13 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
48 మండలాల్లో వర్షపాతం :
జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి 48 మండలాల్లో వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు 22.2 మి.మీ, మడకశిర 17.7 మి.మీ, కూడేరు 14.2 మి.మీ, నల్లచెరువు 13.8 మి.మీ, బుక్కపట్నం 12.1 మి.మీ, బుక్కరాయసముద్రం 10.7 మి.మీ మేర వర్షం పడగా మిగతా మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 55.8 మి.మీ నమోదైంది.