breaking news
rain comes
-
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. దీంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం లో కేంద్రీకృతమై ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న కారణంగా, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
151 మండలాల్లో వర్షాభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 151 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 292 మండలాల్లో సాధా రణ, 141 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నెల 21 వరకు అంచనాల ప్రకారం ఈ లెక్కలు వేశారు. అక్టోబర్‌లో ఇప్పటివరకు అధిక వర్షం నమోదైనా.. సీజన్ మొత్తంగా సరాసరి వర్షాభావ మండలాల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. అత్యధికంగా మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 17 మండలాల చొప్పున వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా వాతావరణంలో తేమ కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. స్వైన్ ఫ్లూతో బాలింత మృతి హైదరాబాద్: మేడ్చల్‌లోని కటికె బస్తీలో రాజ్యలక్ష్మి(32) అనే బాలింత శనివారం స్వైన్ ఫ్లూతో మరణించింది. రాజ్యలక్ష్మి తన భర్త చిట్టిబాబు, ఇద్దరు పిల్లలతో కలసి స్థానికంగా నివాసముంటోంది. ప్రసవం కోసం పుట్టినిల్లు అయిన కామారెడ్డికి వెళ్లింది. అక్కడ జలుబు, దగ్గు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఈ నెల 17న యశోద ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్య పరీక్షల్లో స్వైన్ ఫ్లూగా నిర్ధారణ అయింది. అనంతరం 18న సిజేరియన్ ద్వారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన పాప ఆరోగ్యంగానే ఉన్నా.. రాజ్మలక్ష్మికి స్వైన్ ఫ్లూ తీవ్రం కావడంతో 20న గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. రాజ్యలక్ష్మి మరణంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. -
ప్రత్యామ్నాయమేదీ..?
వర్షంరాకతో సాగుకు సిద్ధమైన రైతన్న విత్తనాలు అందుబాటులో లేక కష్టాలు త్వరలో అంటూ తప్పించుకుంటున్న వ్యవసాయశాఖ అనంతపురం అగ్రికల్చర్: చాన్నాళ్ల తర్వాత జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా వర్షం పడుతోంది. జూలై ఆఖరితోనే ప్రధాన పంటల సాగుకు సమయం ముగిసిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ, పత్తి, కంది లాంటి పంటలు వేసుకోవద్దని శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటించారు. అంతేకాదు సజ్జ, కొర్ర, జొన్న, అలసంద, పెసర, ఉలవ లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. కానీ... రైతుల దగ్గర విత్తనాలు లేవు. జూలై 15 నుంచి ప్రత్యామ్నాయ పంటలు, విత్తన ప్రణాళికలు, ప్రతిపాదనలు, నివేదికలు అంటూ వ్యవసాయశాఖ హడావుడి చేస్తున్నా ఇంతవరకు విత్తనాలు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. ప్రతిపాదనల్లోనే ప్రత్యామ్నాయం ఆగస్టు ఒకటో తేదీ వ్యవసాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్య శాస్త్రవేత్తలు ఆరు జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలను పిలిపించి ప్రత్యామ్నాయంపై చర్చాగోష్టి నిర్వహించి జిల్లాల వారీగా విత్తన ప్రతిపాదనలు తయారు చేశారు. ఒకటో తేదీ నుంచే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలులోకి వచ్చిందని గొప్పగా ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో విత్తన సరఫరా, పంపిణీ ఏర్పాట్లు చేస్తామన్నారు. కానీ 15వ తేదీ వస్తున్నా ఆచరణలోకి రాని పరిస్థితి నెలకొంది. భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం జూన్, జూలైలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కారణంగా ఖరీఫ్‌లో ప్రధాన పంటల సాగు పడకేశాయి. 6.04 లక్షల హెక్టార్లకు గానూ వేరుశనగ పంట 2.08 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. మిగతా పంటలన్నీ మరో 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ఇంకా 5.50 లక్షల హెక్టార్ల వరకు భూములు ఖాళీగానే ఉన్నాయి. మొత్తమ్మీద 8.01 లక్షల హెక్టార్లకు గానూ వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి అన్ని పంటలు కలిపి 30 శాతం విస్తీర్ణం అంటే 2.55 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. జిల్లా రైతుల మంచికో చెడుకో కానీ ఈసారి చిరుధాన్యాలు, నవధాన్యాల పంటలు సాగు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఏక పంట విధానానికి స్వస్తిపలకడం, పంట మార్పిడికి అవకాశం రావడంతో సరికొత్త వ్యవసాయానికి మార్గం లభించినట్లు చెబుతున్నారు. ప్రతిపాదనలకే పరిమితం ప్రత్యామ్నాయ విత్తన ప్రతిపాదనలు ఇప్పటికే నాలుగు సార్లు తయారు చేసి కమిషనరేట్‌కు పంపినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నారు. మొదట 67 వేల క్వింటాళ్లు, తర్వాత 84 వేల క్వింటాళ్లు, మూడో సారి 48 వేల క్వింటాళ్లు, తాజాగా 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. అత్యధికంగా 50 వేల క్వింటాళ్ల ఉలవలు, 18,990 క్వింటాళ్ల అలసందలు, 12,500 క్వింటాళ్ల మొక్కజొన్న, 11,040 క్వింటాళ్ల పెసలు, 8,050 క్వింటాళ్ల జొన్నలు, 5,250 క్వింటాళ్ల కందులు, 2,512 క్వింటాళ్ల కొర్రలు, 2,350 క్వింటాళ్ల సజ్జలు, 1,250 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 562 క్వింటాళ్ల అనుములు అవసరమని నివేదించారు. సేకరణ, సరఫరా బాధ్యతలు ఏపీ సీడ్స్‌కే విత్తన సేకరణ, సరఫరా బాధ్యతలు ఏపీ సీడ్స్‌కు అప్పగించారు. ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా ఇంకా వాటి ధరలు, రాయితీ ఖరారు కావాల్సి ఉంది. అవి పూర్తయితే కానీ సేకరణ, సరఫరా, పంపిణీ కొలిక్కివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇవన్నీ కావాలంటే ఎంతలేదన్నా వారం, పది రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల వర్షాలు రావడంతో పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నా విత్తనం లేక ఇబ్బంది పడుతున్నారు. కొందరు రైతులు బయట మార్కెట్లో అధిక ధరలు కొంటున్న పరిస్థితి నెలకొంది. సకాలంలో విత్తనాలు అందేనా..? వ్యవసాయశాఖ అధికారులు 90 శాతం రాయితీతో బయోమెట్రిక్ పద్ధతిలో ప్రత్యామ్నాయ విత్తనాలు ఇస్తామని చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఏపీ సీడ్స్ వద్ద 600 క్వింటాళ్ల జొన్నలు, 500 క్వింటాళ్ల సజ్జ, 1,370 క్వింటాళ్ల కందులు, 90 వేల వరకు బహుధాన్యపు కిట్లు సిద్ధంగా ఉన్నా... ధరలు, రాయితీలు ఖరారు కాక పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేసేలోగా వర్షాలు మొహం చాటేస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. -
రాగల నాలుగు రోజుల్లో వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాకు రానున్న నాలుగు రోజుల్లో అంటే ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు వచ్చే నాలుగు రోజుల్లో 4 నుంచి 35 మి.మీ. మేర తేలికపాటి నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 79, మధ్యాహ్నం 55 నుంచి 59 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 9 నుంచి 13 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 48 మండలాల్లో వర్షపాతం : జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి 48 మండలాల్లో వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు 22.2 మి.మీ, మడకశిర 17.7 మి.మీ, కూడేరు 14.2 మి.మీ, నల్లచెరువు 13.8 మి.మీ, బుక్కపట్నం 12.1 మి.మీ, బుక్కరాయసముద్రం 10.7 మి.మీ మేర వర్షం పడగా మిగతా మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 55.8 మి.మీ నమోదైంది.