రాజకీయ బదిలీలకు తెరలేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే తహసీల్దార్లను నియమించాలంటూ పలువురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడును కోరారు.
మంత్రి సిఫార్సులతో ఒత్తిడి తెస్తున్న తహసీల్దార్లు
ఏలూరు : రాజకీయ బదిలీలకు తెరలేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే తహసీల్దార్లను నియమించాలంటూ పలువురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడును కోరారు. సరేనన్న మంత్రి ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ జిల్లా అధికారులను గురువారం ఆదేశించారు. కొందరు తహసీల్దార్లకు సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు.
అవి శుక్రవారం జిల్లా అధికారులకు అందాయి. బదిలీలకు గడువు ముగిసినప్పటికీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సిఫార్సు లేఖలు ఇవ్వడంతో తహసీల్దార్లను వారు కోరుకున్న స్థానానికి పంపించేందుకు రంగం సిద్ధమవుతోంది. నిబంధనల ప్రకారం తహసీల్దార్లు ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన పరిస్థితి లేదు.
ఈ దృష్ట్యా ఇప్పట్లో వారికి బదిలీలు ఉండవని అంతా భావించారు. అయితే, మంత్రి ఆదేశాల మేరకు నిబంధనలను పక్కనపెట్టి తహసీల్దార్ల బదిలీలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జిల్లాలో పలువురు మండల స్థాయి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది.