మొక్కుబడి

కొందర్గు: చెన్నారెడ్డిపల్లి శివారులో వర్షాలకు నేలకొరిగిన వరిపంట - Sakshi

  • పంటనష్టం కొండంత.. గుర్తించింది గోరంత

  • ముసురు వర్షాలకు దెబ్బతిన్న ఖరీఫ్‌ పంటలు

  • అంచనా సేకరణకు కదలని అధికారులు

  • 6మండలాలు.. 998హెక్టార్లలో మాత్రమే

  • పంటలు నష్టపోయినట్లు గుర్తింపు

  • మహబూబ్‌నగర్‌ వ్యవసాయం: ఎన్నో అంచనాలతో సాగుచేసిన పంటలు ముసురువర్షాలకు దెబ్బతిన్నాయి. జిల్లాలో వారం పదిరోజులుగా కురుస్తున్న వానలకు ఖరీఫ్‌లో సాగుచేసిన జొన్న, మొక్కజొన్న, పత్తి, ఆముదం, వరి, వేరుశనగ పంటలు చాలాచోట్ల నీటిలోనే కలిసిపోయాయి. వేలకు వేల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో పంటనష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ముందుకు కదలడం లేదు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సగటు వర్షపాతం 446.8మి.మీ కాగా ఇప్పటివరకు 513.2మి.మీ వర్షపాతం కురిసింది. సగటుకంటే 14.9శాతం అధికంగా నమోదైంది. ఇదిలాఉండగా జూన్‌లో 91.9శాతం అధికవర్షాలు కురవగా జూలై, ఆగస్టులో లోటు వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో 7.13లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే 1.25లక్షల హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించారు. అధికవర్షాలకు సుమారు 4లక్షల హెక్టార్ల మేర పంటనష్టం కలిగిందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. 

     

    పంటలకు నష్టం 

    ముసురువర్షాలకు జిల్లాలో చాలాచోట్ల జొన్న పంట నల్లగా మారనుంది. జూన్‌లో సాగుచేసిన వరిపైరు దిగుబడికి సిద్ధంగా ఉండగా చాలాప్రాంతాల్లో నీటమునిగింది. మరికొన్ని ప్రాంతాల్లో పంటంతా నేలవాలి గింజలు మొలకెత్తాయి. జూలై, ఆగస్టు మాసాల్లో లోటువర్షపాతం కురవడం, ఈ నెలలో ఎక్కువవర్షం పడడంతో వాతావరణంలో భారీ మార్పుల కారణంగా పత్తి, కంది, ఆముదం పంట ఎండుతెగులు బారినపడ్డాయి. ఇది పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

     

    మొక్కుబడిగా నష్టం సేకరణ

    జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు పంటలకు పంటనష్టాన్ని గుర్తించే ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోందని రైతు సంఘాలు, రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు 998.50 హెక్టార్లలో మాత్రమే పంటలకు నష్టం వాటిల్లినట్లు 8 మండలాల నుంచి వ్యవసాయశాఖ జిల్లా అధికారులకు నివేదిక అందించింది. ఇందులో కొందుర్గు మండలంలో 8 హెక్టార్లలో వరి, 4.20హెక్టార్లలో జొన్న, పెబ్బేరు మండలంలో 30హెక్టార్లలో మొక్కజొన్న, 45హెక్టార్లలో ఉలువ, 20హెక్టార్లలో పెసర, 25హెక్టార్లలో కంది, 350హెక్టార్లలో వేరుశనగ, గద్వాల మండలంలో రెండు హెక్టార్లలో పత్తి, తాడూరు మండలంలో 16 హెక్టార్లలో వరి, 48 హెక్టార్లలో పత్తి, మల్దకల్‌ మండలంలోని 94హెక్టార్లో వరి, 40హెక్టార్లలో వేరుశనగ, 88హెక్టార్లలో కంది, 144హెక్టార్లలో పత్తి, 56హెక్టార్లలో ఆముదం పంట,ధరూర్‌ మండలంలో 58.45హెక్టార్లలో వరి, పత్తి, ఆముదం, చెరుకు పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.

     

    పల్లెలు ఎరుగని అధికారులు 

    వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు వ్యవసాయాధికారులు ఆసక్తిచూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇటిక్యాల, కొడంగల్, కోస్గి, బొంరాస్‌పేట, దేవరకద్ర, అలంపూర్, భూత్పూర్, నర్వ, మక్తల్, మాగనూర్, ఆత్మకూర్, తలకొండపల్లి, మాడ్గుల, వెల్దండ, కల్వకుర్తి, కొత్తకోట, పాన్‌గల్, వనపర్తి, కొల్లాపూర్‌ మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షాలు కురవడంతో పంటలకు నష్టంవాటిల్లింది. కానీ మండల వ్యవసాయశాఖ అధికారులు మాత్రం ఆయా మండలాల్లో పంటన ష్టాన్ని గుర్తించేందుకు మొగ్గుచూపడం లేదు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. 

     

    మండలం పంటనష్టం(హెక్టార్లలో..)

    కొందుర్గు 12.05

    పెబ్బేరు 440

    గద్వాల 02

    తాడూరు 64

    మల్దకల్‌ 422

    ధరూర్‌ 58.45
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top