ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు విఫలం | Sakshi
Sakshi News home page

ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు విఫలం

Published Mon, Sep 12 2016 11:02 PM

ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు విఫలం - Sakshi

కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేశారన్నారు.  సోమవారం స్థానిక కష్ణకాంత్‌ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   అధికారం కోసం బీజేపీ, టీడీపీలు డ్రామా ఆడయాన్నారు.  రాజ్యసభ సభ్యుడిగా వేరే రాష్ట్రానికి పోయినంత మాత్రాన మీరు రాష్ట్రవాసి కాకపోరు కదా అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని ప్రశ్నించారు. 

టీడీపీ, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చినా చంద్రబాబు, వెంకయ్యనాయుడుకు  సిగ్గురాలేదన్నారు. అదిగో..ఇదిగో ప్రత్యేక హోదా అని రెండున్నర ఏళ్లుగా ప్రచారం చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి  ఇప్పుడు మాట మార్చితే జనం హర్షించరన్నారు.   ఓర్వకల్లు దగ్గర 30 వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏడాది క్రితం శిలాఫలకం వేశారని, ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు.  రాష్ట్రానికి హోదా లేకుంటే ఏ పరిశ్రమ రాదని చెప్పారు. తనకు తానుగా నీతిమంతుడిని నని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో స్టే ఎందుకు తెచ్చుకున్నట్లని ప్రశ్నించారు. దీనిపై ఎక్కడ తనను నిలదీస్తారోనని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. బాబు పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారంతా ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి.రాజా విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు యాదవ్, అశోక్, ప్రహ్లాదాచారి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement