Sakshi News home page

యూబీఐకి రూ.2 కోట్ల మేర టోకరా

Published Wed, May 4 2016 9:37 PM

Manger cheats Bank, arrested

ఇద్దరు మేనేజర్లు సహా నలుగురి అరెస్టు
మంచిర్యాల టౌన్(ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసగించి దాదాపు రూ.2 కోట్లు రుణం పొందిన కేసులో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన సోమాల ఫణికుమార్, జన్నారానికి చెందిన మహ్మద్ యూసుఫ్, ఎస్డీ రహీముల్లా కలిసి 2013లో జన్నారంలో తొమ్మిదిన్నర గుంటల స్థలం కొనుగోలు చేశారు.

ఇందులో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించి.. మంచిర్యాల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్‌గా అప్పుడు పనిచేసిన రాజేశ్ డాయిఫోడ్‌ను సంప్రదించారు. కాంప్లెక్స్ కట్టకుండానే, కట్టినట్లుగా దానిని మార్టిగేజ్ చేసేలా మేనేజర్‌తో మాట్లాడుకున్నారు. వచ్చిన డబ్బు తలా కొంత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ రాజేశ్ రూ.1.20 కోట్లు రుణం అందజేశారు. కొద్ది రోజుల తర్వాత జరిపిన ఆడిటింగ్‌లో ఈ బండారం బయటపడింది. దీంతో అప్పటి మేనేజర్ రాజేశ్ ఈ సమస్యను లక్సెట్టిపేట ఎస్‌బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒబెరాయ్ ఝాన్సీలక్ష్మీభాయ్‌కు వివరించారు. ఇద్దరూ స్నేహితులు కావడంతో ఆమెతో కలిసి ఎస్‌బీఐకి లోను కోసం దరఖాస్తు చేసుకుని 23 మంది పేరిట యూనియన్ బ్యాంకులో దొంగ ఖాతాలను సృష్టించారు.

ఇందుకు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఎస్‌బీఐ నుంచి ఝాన్సీ అందించి సహకరించింది. 23 నకిలీ ఖాతాల్లో జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేటలో ఉండే వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. వారి పేర రూ. 1,78,81,000 రుణం రూపంలో పొందారు. ఇందులో నుంచి గతంలో వీరు పొందిన రూ.1.20 కోట్లు బ్యాంకుకు చెల్లించారు. మిగతా రూ.58.81 లక్షలను సొంతానికి వాడుకున్నారు. కొద్ది రోజులకు యూనియన్ బ్యాంకుకు మేనేజర్‌గా వచ్చిన వరదరాజన్ 23 మంది ఖాతాదారులు రుణాలు చెల్లించకపోవడంపై ఆరా తీశారు. బ్యాంకును మోసం చేసినట్లుగా గుర్తించి 2015 మార్చి 27న కేసు పెట్టారు. చెన్నూరు ఎస్సై సతీశ్‌కుమార్ పూర్తి విచారణ జరిపి నిందితులు సోమాల ఫణికుమార్, మహ్మద్ యూసుఫ్‌లతోపాటు ఘట్‌కేసర్ డిప్యూటీ బ్రాంచ్ హెడ్‌గా పనిచేస్తున్న రాజేశ్ డాయిఫోడ్, చిత్తూరు జిల్లా చంద్రగిరి బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఝాన్సీలక్ష్మీబాయిని అరెస్టు చేశారు. వీరందరిపైనా చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

What’s your opinion

Advertisement