కువైట్‌లో ప్రొద్దుటూరు స్వర్ణకారుడు దుర్మరణం | jeweler killed in Kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో ప్రొద్దుటూరు స్వర్ణకారుడు దుర్మరణం

Jan 27 2017 1:47 AM | Updated on Sep 5 2018 2:26 PM

కువైట్‌లో ప్రొద్దుటూరు స్వర్ణకారుడు దుర్మరణం - Sakshi

కువైట్‌లో ప్రొద్దుటూరు స్వర్ణకారుడు దుర్మరణం

ఇక్కడ పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం గురుశేఖర్‌ (37) అనే స్వర్ణకారుడు నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే విధి చిన్న చూపు చూడటంతో అతను అక్కడ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు.

ప్రొద్దుటూరు క్రైం: ఇక్కడ పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం గురుశేఖర్‌ (37) అనే స్వర్ణకారుడు నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే విధి చిన్న చూపు చూడటంతో అతను అక్కడ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. మృతుని కుటుంబీకుల కథనం మేరకు.. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో నివాసం ఉంటున్న సి.గురుశేఖర్‌ బంగారు పని చేసుకొని జీవనం సాగించేవాడు. అతనికి భార్య లక్షి​‍్మ, కుమారుడు సంతోష్, కుమార్తె జయశ్రీలు ఉన్నారు. అతను పట్టణంలోని మెయిన్‌బజార్‌లో గత కొంత కాలం నుంచి స్వర్ణకారుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల పనులు బాగా తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో సన్నిహితులు, బంధువుల సలహా మేరకు నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అతను స్వర్ణకారుడు అయినప్పటికీ డ్రైవింగ్‌ వీసాపై అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో అతను కువైట్‌లోని జహ్రాలో ఉన్న అయూన్‌ ప్రాంతంలో ఈ నెల 18న తనకు కేటాయించిన రేకుల షెడ్డులో పడుకున్నాడు.
విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో ప్రమాదం
    అతను పడుకొని ఉన్న రేకుల షెడ్డులో వేకువ జామున 4.20 గంటల సమయంలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. షెడ్డంతా మంటల్లో తగలబడి పోయింది. గురుశేఖర్‌ మంటల్లో చిక్కుకొని బయటికి రాని పరిస్థితి ఉందని సమీపంలో ఉన్న వ్యక్తులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. రేకుల షెడ్డులో గ్యాస్‌ సిలిండర్‌లు కూడా ఉండటంతో అవి పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. తర్వాత వెళ్లి చూడగా గురుశేఖర్‌ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. షెడ్డులోని నాలుగు కార్లు కూడా ప్రమాదంలో కాలిపోయాయి. అతను మృతి చెందిన విషయాన్ని కువైట్‌ నుంచి బంధువులు లక్ష్మీకి చెప్పారు. విషయం తెలిసినప్పటి నుంచి భార్యా పిల్లలు, బంధువులు రోదించసాగారు.
ఇండియన్‌ ఎంబసీ జోక్యంతో కేసు
    కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసీ అధికారులు జోక్యం చేసుకొని జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంబసీ అధికారులు గురుశేఖర్‌ తరపున న్యాయవాదిని ఏర్పాటు చేశారు. అక్కడి కఫిల్‌ అజాగ్రత్త వల్లనే షెడ్డులో అగ్నిప్రమాదం జరిగిందని న్యాయవాది కువైట్‌ ప్రభుత్వంతో మాట్లాడారు. పోస్టుమార్టం అనంతరం గురువారం ఉదయం 11 గంటలకు అతని మృతదేహాన్ని చెన్నైకి తీసుకొని రాగా అక్కడి నుంచి సాయంత్రం ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రొద్దుటూరుకు తరలించారు. విషయం తెలియడంతో స్వర్ణకారులతో పాటు బంధువులు సన్నిహితులు పెద్ద ఎత్తున ఇంటి వద్ద గుమిగూడారు. భర్త మృతదేహాన్ని చూసిన భార్య లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయింది. పిల్లలిద్దరూ గుండె పగిలేలా రోదించసాగారు. స్వర్ణకారుల సంఘం నాయకులు గురుప్రసాద్, ఇలియాస్, ఖలందర్, స్వర్ణకారులు సుబ్బరాయుడు, హరి, బాషా తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement