జలవిహార్‌ | jalvihar | Sakshi
Sakshi News home page

జలవిహార్‌

Sep 10 2016 6:07 PM | Updated on Apr 3 2019 5:26 PM

జలవిహార్‌ - Sakshi

జలవిహార్‌

ఇప్పటి వరకు కృష్ణా నదికే పరిమితమైన బోటింగ్‌ షికార్‌.. ఇక నుంచి కాలువల్లో ఏర్పాటు చేసేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో భాగంగా రివర్‌ కన్సర్వేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

నీటి అలలపై తేలియాడుతూ సాగే షికారుకు.. సై అనని వారు ఉండరు. సాధారణంగా నదీ జలాలపై పడవ విహారం చూస్తుంటాం. అయితే  కాలువల్లో స్పీడ్‌ బోట్లపై విహారానికి పర్యాటక శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే తూర్పు కృష్ణా కాలువలో బోటు అందుబాటులోకి వచ్చింది. జలవిహార ఆనందాన్ని అందించేందుకు సిద్ధమైంది. 
 
సాక్షి, విజయవాడ :  ఇప్పటి వరకు కృష్ణా నదికే పరిమితమైన బోటింగ్‌ షికార్‌.. ఇక నుంచి కాలువల్లో ఏర్పాటు చేసేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో భాగంగా రివర్‌ కన్సర్వేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగానే కాలువల్లోనూ బోటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. కొంత కాలంగా పర్యాటక సంస్థ కాలువల్లో బోటింగ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నా ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాలేదు. సీఆర్‌డీఏ కమిషనర్‌గా పనిచేసిన పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ చొరవ చూపడంతో కాలువల్లో బోటింగ్‌ షికారుకు అడుగు పడింది. 
తూర్పు కృష్ణా కాలువలో..
నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న తూర్పు కృష్ణా కాలువలో బోటింగ్‌  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను ప్లోటింగ్‌ జట్టీని ఏర్పాటు చేసి స్పీడ్‌ బోట్లు అక్కడ ఉంచారు. రూ.300 చెల్లిస్తే ఆరు నిముషాలు పాటు బోట్లలో కాలువలో విహరించవచ్చు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఒకేసారి వెళ్లవచ్చు. లేదా ముగ్గురు పెద్దవాళ్లు ఒకేసారి ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీని బట్టి బోట్ల సంఖ్యను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. 
ఇరిగేషన్‌ శాఖ అనుమతులు నిల్‌.. 
పర్యాటక సంస్థ.. బోట్లు ఏర్పాటు చేయడంపై చూపించే శ్రద్ధ జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవడంపై చూపించలేదు. నదిలోనూ, కాలువల్లోనూ ఏదైనా చేయాలంటే.. తప్పని సరిగా జలవనరుల శాఖ కేసీ డివిజన్‌ అధికారులు అనుమతి తీసుకోవాలి. అయితే అనుమతులు తీసుకోకుండా జట్టీలు వేసి బోట్లు తిప్పడం ప్రారంభించారు. తమ అనుమతులు లేకుండా బోట్లు తిప్పడాన్ని తప్పుపడుతూ ఇరిగేషన్‌ శాఖ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. 
 
పర్యాటకరంగ అభివృద్ధికి వ్యతిరేకం కాదు
పర్యాటరంగ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అయితే ఇరిగేషన్‌ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. బోటింగ్‌కు అనుమతిచ్చేటప్పుడు బోట్ల నాణ్యత పరిశీలించాలి. అందులో ప్రయాణించేవారికి రక్షణ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిఉంది. అవసరమైతే వారికి ఇన్యూరెన్స్‌ చేయించాల్సి ఉంటుంది. నదిలో ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన ఏడాదంతా  నీరు ఉంటుంది కాబట్టి బోటింగ్‌ ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి రైతాంగానికి నీరు అవసరం కాబట్టి కాలువలకు నీరు వదులుతున్నాం. వర్షాలు బాగా కురిసి రైతులకు నీరు అవసరం లేదని చెబితే.. తక్షణం కాలువల్లో నీటిని జీరో స్థాయికి తీసుకెళతాం. అప్పుడు కాలువల్లో బోటింగ్‌కు సాధ్యపడదు. కేవలం బోటింగ్‌ కోసం కాలువల్లో నీటిని నిల్వ ఉంచడం సాధ్యపడదు.  
– సుగుణరావు, ఎస్‌ఈ, ఇరిగేషన్‌ శాఖ 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement