రైతులకు మార్గదర్శకులు కండి

రైతులకు మార్గదర్శకులు కండి

 తాడేపల్లిగూడెం : రైతులకు మార్గదర్శకులుగా ఉద్యాన విద్య పూర్తిచేసిన విద్యార్థులు మారాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ త్రిలోచన్‌ మహాపాత్రో పిలుపునిచ్చారు. మండలంలోని వెంకట్రామన్నగూడెంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాపాత్రో హాజరై మాట్లాడారు. ఉష్ణోగ్రతలో ఒక సెల్సియస్‌ తేడా వస్తే ఉద్యాన పంటల దిగుబడులు గణనీయంగా పడిపోతాయి. ఇలాంటి అనేక అంశాలపై నిత్యం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగని శాస్త్రవేత్తలు పరిశోధనలకే పరిమితం కాకూడదన్నారు. పరిశోధన ఫలితాలను రైతులకు చేరువ చేయాలని సూచించారు. మెట్ట ప్రాంత ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రానికి అవసరమైన అఖిల భారత సమన్వయ పరిశోధన ప«థకాలు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. 


పరిశోధనలు చేస్తున్నాం : వీసీ 


కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉద్యాన యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ బీఎంసీ రెడ్డి మాట్లాడుతూ 17 పరిశోధన కేంద్రాల ద్వారా అధిక దిగుబడులు సాధించే ఉద్యాన ఉత్పత్తులను అభివద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. నాబార్డ్, ఆర్‌కేవై పథకాల ద్వారా విశ్వవిద్యాలయానికి గ్రాంట్లు అందుతున్నాయన్నారు. ఉద్యాన వర్సిటీ ప్రగతిని వివరించారు. 


516 మందికి పట్టాలు ప్రదానం 


రెండో స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని 516 మందికి పట్టాల ప్రదానం చేశారు. బీఎస్‌సీ పూర్తిచేసిన 410 మంది, ఎంఎస్‌సీ పూర్తిచేసిన 90 మంది, పీహెచ్‌డీ పూర్తిచేసిన 16 మందికి పట్టాలను మహాపాత్ర చేతుల మీదుగా అందజేశారు. 


బంగారు పతకాలు 


డిగ్రీస్థాయిలో హార్టికల్చర్‌ హానర్సులో అత్యుత్తమ గ్రేడ్‌ మార్కులు సంపాదించిన టి.సమత, ఎస్‌.లోకేశ్వరిలకు అన్నే శిఖామణి మెమోరియల్‌ గోల్డ్‌మెడల్, ఎంఎస్సీలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన షేక్‌ సమీన బేగం, జి.కోటేశ్వరరావులకు దాశరథి మెమోరియల్‌ గోల్డ్‌మెడల్, అధ్యాపకుల కేటగిరీలో ఎంటమాలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి, శాస్త్రవేత్తల కే టగిరీలలో ఉత్తమ పరిశోధనకు గాను డాక్టర్‌ ఎన్‌బీవీ చలపతిరావులు బంగారు పతకాలను అందుకున్నారు. రాష్ట్ర  ఉద్యాన కమిషనర్‌ చిరంజీవి చౌదరి. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్‌ మన్‌మోహన్‌సింగ్, పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. 


 


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top