స్వర్ణోత్సవ వేళ.. పోటీల మేళా

స్వర్ణోత్సవ వేళ.. పోటీల మేళా

భీమడోలు : ఈ ఏడాది రాష్ట్ర పౌర గ్రంథాలయ సంస్థ స్వర్ణోత్సవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు ఈ ఏడాది నవంబర్‌ 14వ తేదీ బాలల దినోత్సవం నాటికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్వర్ణోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. స్వర్ణోత్సవాల వేళ.. గతానికి భిన్నంగా గ్రంథాలయ సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించనుంది. ఈ ఏడాది నవంబర్‌ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలకు ముందుగా స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని వివిధ పోటీలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబం« దించి సర్క్యులర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ తమ గ్రంథపాలకుల ద్వారా విద్యాశాఖాధికారులకు అందించారు. గ్రంథాలయ సంస్థ, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు అకర్షణీయమైన బహుమతులను ప్రకటించింది. జిల్లాలోని గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, గ్రేడ్‌–3, జిల్లా కేంద్ర గ్రంథాలయాల పరిధిలోని  73 గ్రంథాలయాల్లో, 3,236 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. 

మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు 

గతంలో గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథా లయాల పరిధిలో మాత్రమే నిర్వహించేవారు. అయితే రోజు రోజుకూ గ్రంథాలయాల పట్ల అసక్తి సన్నగిల్లడంతో వాటిని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ.. ఇలాంటి పోటీలు లైబ్రరీల బలోపేతానికి దారి తీస్తుందని సంబం« దిత అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మండల, జిల్లా స్థాయిల్లో విద్యార్థుల్లో సబ్‌ జూనియర్, జూనియర్, సీనియర్‌ విభాగాల్లో పలు అంశాలపై పోటీలను నిర్వహిస్తారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాల్లో నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిభ కనుబర్చిన విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ, పాఠశాల విద్యాశాఖలు సంయుక్తంగా ప్రశంసా పత్రాలను అందజేస్తాయి.  

విద్యార్థులకు: వివిధ స్థాయిల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ట్యాబ్‌లను బహుమతిగా అందిస్తారు. విద్యార్థులను మూడు కేటగిరిలుగా విభజించారు. వారిలో 4, 5 తరగతులను సబ్‌ జూనియర్‌గా, 6,7 తరగతుల వారిని జూనియర్గా, 8 నుంచి 10వ తరగతుల వారిని సీనియర్స్‌గా విభజించారు. 

పాఠశాలలకు:

రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాల (ఎక్కువ పోటీల్లో ఎక్కువ మంది పాల్గొంటే) మొదటి బహుమతి పొందిన పాఠశాలకు రూ.50 వేల విలువ చేసే పుస్తకాలు, ద్వితీయ బహుమతి పొందిన పాఠశాలకు రూ.25 వేలు, తృతీయ శ్రేణి సాధించిన పాఠశాలకు రూ.10 వేల విలువ గల పుస్తకాలను అందిస్తారు. 

ఉపాధ్యాయులు:

సెకండరీ గ్రేడ్, స్కూలు అసిస్టెంట్లు, గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులకు మూడు కేటగిరిల్లో పోటీలను నిర్వహిస్తారు. 

ఆక్టివిటీ ఇన్‌చార్జి:

పాఠశాల స్థాయిలో ప్రతి నెల మొదటి గురువారం, మూడో గురువారాల్లో విద్యార్థులకు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పోటీలకు రెండు పీరియడ్లను కేటాయించాలి. ఆక్టివిటీ ఉపాధ్యాయుడిని నియమించి ఆ రోజుల్లో పోటీలు నిర్వహించాలి. ఆ రోజుల్లో సెలవులు వస్తే మరుసటి రోజున జరపాలి. భాషా పండితులతో కలిపి పోటీలను నిర్వహించాలి. 

జిల్లాస్థాయిలో 

పాఠశాల స్థాయిలో అక్టోబర్‌ 6న, మండల స్థాయిలో అక్టోబర్‌ 13, జిల్లా స్థాయిలో అక్టోబర్‌  27న పోటీలు జరుగుతాయి. 

రాష్ట్రస్థాయిలో...

రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్‌ 11, 12వ తేదీల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారు. నవంబర్‌ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో బహుమతులు, ప్రశంసా పత్రాలను అందిస్తారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top