జెండా పండగలోనూ రాజకీయమే | flag festival also politics | Sakshi
Sakshi News home page

జెండా పండగలోనూ రాజకీయమే

Aug 16 2016 1:03 AM | Updated on Oct 30 2018 5:17 PM

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జెండా పండగలోనూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఏలూరులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా.. జిల్లానుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ సహా

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జెండా పండగలోనూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఏలూరులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా.. జిల్లానుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ సహా ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు జెండా ఎగురవేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సర్పంచ్‌లు బేఖాతర్‌ చేశారు. 
చిన్నబుచ్చుకున్న సుజాత
జిల్లా కేంద్రంలో జెండాను ఆవిష్కరించే అవకాశం వరుసగా మూడో సంవత్సరం కూడా మంత్రి మాణిక్యాలరావుకే దక్కింది. దీంతో చిన్నబుచ్చుకున్న మరో మంత్రి పీతల సుజాత అనంతపురం వెళ్లి అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ఏలూరు నగరానికి పక్కనే ఉండే విప్‌ చింతమనేని ప్రభాకర్‌ సైతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి కొద్దిసేపు ఈ కార్యక్రమంలో ఉండి వెళ్లిపోయారు. ఇప్పటికే మంత్రి మాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్‌ బాపిరాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నరసాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జెండా పండగ సాక్షిగా తారస్థాయికి చేరింది. కొత్తపల్లి సుబ్బారాయుడు రుస్తుంబాదలోని తన నివాసం నుంచి, ఎమ్మెల్యే రాయపేటలోని తన నివాసం నుంచి మోటార్‌ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశారు. నాయకులు, కార్యకర్తలకు తమ తమ ఇళ్ల వద్ద విందు ఏర్పాటు చేశారు. 
సర్కారు ఉత్తర్వుల్ని లెక్కచేయని సర్పంచ్‌లు
జెండా ఎగురవేసే అవకాశాన్ని సర్పంచ్‌లకు బదులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సర్పంచ్‌లు లెక్కచేయలేదు. ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో  వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ నీలపాల శ్రీనివాసరావును కాదని అధికార పార్టీ సర్పంచ్‌ దొప్పసాని రామసిద్ధిరాజు జెండా ఎగురవేశారు. కొయ్యలగూడెం, పొంగుటూరు, దిప్పకాయలపాడు, సీతంపేట, రాజవరం, బయ్యనగూడెం పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్‌లు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రతి హైస్కూల్‌ వద్ద జెడ్పీటీసీ సభ్యునిచే జాతీయజెండా ఎగురవేయించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా గుంపర్రు హైస్కూల్‌ నుంచి యలమంచిలి జెడ్పీటీసీ సభ్యుడు బోనం వెంకట నరసింహరావుకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఉంగుటూరులోఅంతర్గత ఒప్పందం ప్రకారం అక్కడి సర్పంచ్‌ గంటా శ్రీలక్ష్మి మూడేళ్ల అనంతరం పదవికి రాజీనామా చేయాల్సి ఉండగా, ఆమె అందుకు భిన్నంగా వ్యవహరించారు. సర్పంచ్‌ గంటా శ్రీలక్ష్మి జెండా ఎగురవేయాల్సి ఉండగా, ఉప సర్పంచ్‌ సంధి నాగలక్ష్మి ముందుగానే పంచాయతీ కార్యాలయానికి చేరుకుని జెండా ఆవిష్కరించారు. సర్పంచ్‌ శ్రీలక్ష్మిని సంధి నాగలక్ష్మి, మరికొంత మంది మహిళలు బయటకు గెంటేశారు. సర్పంచ్‌కు స్పల్పగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఒక దశలో పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్‌ ధర్నాకు దిగారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement