డీఆర్‌డీఏ పీడీపై ఉద్యోగుల తిరుగుబాటు | employees rebellion on drda pd | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీఏ పీడీపై ఉద్యోగుల తిరుగుబాటు

Jul 4 2017 10:07 PM | Updated on Sep 5 2017 3:12 PM

ప్రతి చిన్న విషయానికి గట్టి గట్టిగా కేకలు వేయడం, అరవడం, కింది స్థాయి ఉద్యోగులను దూషించడం చేస్తున్నారంటూ డీఆర్‌డీఏ పీడీ వై. రామకృష్ణపై ఆ శాఖ ఉద్యోగులు తిరుగుబాటు చేసినంత పనిచేశారు.

-  ఏఓను సెర్ప్‌కు సరెండర్‌ చేయడంపై ఆగ్రహం
- అధికారి తిట్లు భరించలేమని ఆవేదన 
 
కర్నూలు(హాస్పిటల్‌): ప్రతి చిన్న విషయానికి గట్టి గట్టిగా కేకలు వేయడం, అరవడం, కింది స్థాయి ఉద్యోగులను దూషించడం చేస్తున్నారంటూ డీఆర్‌డీఏ పీడీ వై. రామకృష్ణపై ఆ శాఖ ఉద్యోగులు తిరుగుబాటు చేసినంత పనిచేశారు. మంగళవారం సాయంత్రం ఉద్యోగులంతా కలిసి వెళ్లి సదరు అధికారిని నిలదీశారు. ఆ శాఖ ఏఓ షరీఫ్‌ను సెర్ప్‌ సీఈఓకు సరెండర్‌ చేస్తారన్న ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. సామాజిక భద్రత పింఛన్ల విషయంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కర్నూలు వెనుకబడి ఉందన్న కారణంతో నెలరోజుల క్రితం ఏఓ షరీఫ్‌ను పీడీ రామకృష్ణ మందలించారు. దీంతో కలత చెందిన షరీఫ్‌ ఎలాగూ రంజాన్‌ పండుగ ఉంది కాబట్టి 20 రోజుల పాటు సెలవుపై వెళ్లిపోయారు. అయితే మధ్యలోనే పీడీ వై. రామకృష్ణ కలుగజేసుకుని  వెనక్కి పిలిపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. మూడురోజులుగా ఏఓ షరీఫ్‌ విధుల్లో చేరేందుకు రావడం, పీడీ చేర్చుకోకపోవడం జరుగుతోంది.
 
విషయంపై మంగళవారం పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పీడీని కలిశారు. అయినా పీడీ వై. రామకృష్ణ శాంతించకుండా ఇప్పటికే తాను సెర్ఫ్‌ సీఈఓకు లేఖ రాశానని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని, ఇప్పటికిప్పుడు షరీఫ్‌ను విధుల్లో తీసుకోలేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో కార్యాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. పీడీ తన వైఖరి మార్చుకోకపోతే సామూహిక సెలవులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  విషయమై పీడీని వివరణ కోరగా పింఛన్ల పంపిణీ విషయంలో జిల్లా వెనుకబడి ఉందని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉందని, ఈ నేపథ్యంలో ఆ విషయం చెప్పి మందలించిన మాట వాస్తవమేనన్నారు. పనిచేయాలని సూచిస్తే సెలవుపై వెళ్తే తానే చేయలేనని తెలిపారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement