Sakshi News home page

ధరల దరువు బతుకు బరువు

Published Fri, Jun 17 2016 3:35 AM

ధరల దరువు బతుకు బరువు

భయపెడుతున్ననిత్యావసర వస్తువులు
మండుతోన్న కూరగాయల ధరలు
మార్కెట్‌లో దళారుల మాయాజాలం
జీవనం కష్టంగా మారిందంటున్న
పేద, మధ్యతరగతి ప్రజలు కేజీబీవీల నిర్వహణ
బహుకష్టంగా మారిన వైనం

జేబులో వంద, రెండువందలో డబ్బులు పెట్టుకుని మార్కెట్‌కు వెళితే సరుకులతో సంచి నిండి ఇంటికొచ్చే రోజులుపోయాయి. కనీసం రూ.2000 ఉంటేగానీ సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అదీ అరకొరనే. పప్పులు నిప్పులవ్వుతున్నాయ్. నూనెలు సలసల కాగుతున్నాయ్. కూరలు కరుస్తున్నాయ్.. బియ్యం భయపెడుతున్నాయ్.. ఇక మధ్య తరగతి, సామాన్యుల నోటికి మాంసం ముక్క చిక్కడం లేదు. కనీసం కోడి గుడ్డు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. దళారుల మాయాజాలంలో మార్కెట్ నడుస్తోంది. ధరలను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో ప్రజానీకం గగ్గోలు పెడుతోంది.

సాక్షి  ప్రతినిధి, కడప:  మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు దడపుట్టిస్తున్నాయి. కూరగాయలు మొదలు అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీంతో సగటు మధ్యతరగతి జనాల బతుకు భారమైంది. ధరలు చూసి  సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలీ పనిచేసి జీవించే పేదలకు ఈ ధరలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. నెలరోజుల కిందటికీ ఇప్పటీకీ అటు నిత్యావసర వస్తువులు ఇటు కూరగాయాల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. జిల్లాలోని మున్సిపాలిటీలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు ధరాఘాతంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు నెలాఖరున మాత్రమే ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు నెలంతా ఇబ్బందిగానే మారింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటినా సర్కారు నియంత్రించలేకపోతోంది. ధరల మానిటరింగ్ కమిటీ ఉన్నా ఉపయోగంలేదు. సామాన్యుడు సన్న బియ్యం తినలేని పరిస్థితి నెలకొంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సన్న బియ్యం కిలో నెల కిందట రూ.40లుండగా, తాజాగా కిలో రూ.48కు చేరింది.

 నిప్పులు కురిపిస్తున్న పప్పుల ధరలు
నిత్యం ఉపయోగించే కందిపప్పుతో పాటు అల్పాహారాలలో వినియోగించే ఉద్దిపప్పు, పెసరపప్పు ధరలు నింగిని తాకుతున్నాయి. వేరుశనగ విత్తనాల ధరలు అదేస్థాయిలో ఉన్నాయి. రెండు నెలల నుంచి ఆయా పప్పుల ధరలు నిప్పులను కురిపిస్తున్నాయి. దీని ప్రభావం కుటుంబ బడ్జెట్‌పై చూపుతోంది. మంచిరకం కందిపప్పు కిలో నెల కిందటి వరకు రూ.120 ఉండగా నేడు కిలో రూ.180 పలుకుతోంది. మిన పప్పు కిలో రూ.130 ధర ఉండగా ఉన్నట్లుండి కిలో రూ.180లకు చేరుకుంది. కందిపప్పు, మినపప్పు మధ్యలో రూ.200ను కూడా దాటింది. అలాగే పెసరపప్పు కిలో రూ.80ల నుంచి నేడు రూ.120లకు చేరుకుంది. వేరుశనగ పప్పు కూడా రూ.100పైనే ఉంది. పప్పులు కూడా కిలో రూ.65ల నుంచి రూ.100లకు చేరుకున్నాయి. అలాగే ఎండుమిరప, తెల్లగడ్డలు ధరలు ఘాటెక్కుతున్నాయి. ఇవి మొన్నటివరకు కేవలం రూ. 70నుంచి 80లకు మించి పలకలేదు. తాజాగా ఎండుమిరప కిలో రూ.185గాను, తెల్లగడ్డలు కిలో రూ. 200ల ధర పలుకుతున్నాయి. 

 చేతికందని మాంసం ముక్క..
మాంసం పేరెత్తితేనే సామాన్యుడు హడలిపోతున్నాడు. మాంసం ధరలు నొటికందనంత దూరంలో ఉంటున్నాయి. మాంసం కిలో రూ. 450కి చేరుకుంది. అలాగే చికెన్ ధరలు రూ. 170 నుంచి 210 పలుకుతున్నాయి. అదివారం అదనం. అదేవిధంగా చేపలు ఆయా రకాలను బట్టి కిలో రూ.200 నుంచి 450లు, రొయ్యలు రూ.350 నుంచి 520 పలుకుతున్నాయి. ఇక కోడిగుడ్లు చవకగా ఉన్నాయనుకుంటే పొరపాటే. డజను గుడ్లు మార్కెట్‌లో రూ.55 నుంచి 60 వరకు ధర పలుకుతున్నాయి.

 బహుకష్టంగా మారిన కేజీబీవీల నిర్వహణ
‘సీత కష్టాలు సీతవి...పీత కష్టాలు పీతవి’ అన్నట్లుగా కూరగాయల ధరలు పెరగడంతో ప్రభుత్వ హాస్టల్స్ నిర్వహణ బహుకష్టంగా మారింది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నెలకు రూ.90 చెల్లిస్తుంది. ఒక్కో విద్యార్థికి సరాసరిన నెలకు 6 కిలోలు కూరగాయాలు (ఆకుకూరలతో కలిపి)వాడాల్సి ఉంది. కిలో రూ.15 చొప్పున నెలకు రూ.90 మాత్రమే చెల్లిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆ మొత్తానికి ఒక్క కిలోతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నెల పొడువునా ఒక్కొక్క విద్యార్థికి ఒక కిలో కూరగాయలతో నెట్టుకురావడం అసంభవమని బాధ్యులు వివరిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన భోజనం పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. వాస్తవంలో పప్పుదినుసులు, కూరగాయాల ధరలు ఆకాశాన్ని అంటుతోన్నాయి. ఈతరుణంలో కేవీజీబీ బాధ్యులకు హాస్టల్ నిర్వహణ బహుకష్టంగా మారింది. ప్రస్తుతం తమ బాధలను చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని, చెప్పుకున్నా పట్టించుకునే నాథుడులేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 మార్కెట్‌లో దళారుల మాయాజాలం...
ధరలు అమాంతం పెరగడానికి మార్కెట్ మాయాజాలమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. మార్కెట్‌లో స్టాకు తక్కువగా చూపుతూ వ్యాపారులు, దళారులు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాలో రోజుకు వినియోగదారులు అన్నిరకాల కూరగాయలను కలిపి 356 మెట్రిక్ టన్నులు వాడుతున్నారని అధికారుల అంచనా. రైతుల వద్ద వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిని మార్కెట్‌లోని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తుండటం వల్ల ధరలు అమాంతం పెరుగుతున్నాయని పలువురు వివరిస్తున్నారు. నిత్యావసర వస్తువులు సైతం రైతుల వద్ద దిగుబడి ఉన్నంతవరకూ ధరలు ఉండటం లేదు. తర్వాతే మండిపోతున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement