సీపీతో మాట్లాడితే శిక్షే!


ట్రాఫిక్ సిగ్నల్ సమస్యపై కమిషనర్‌కు ఫోన్ చేసిన కానిస్టేబుల్

నేరుగా దొరగారికి ఫోన్ చేస్తావా.. అంటూ  ఉన్నతాధికారుల వేధింపులు

అర్థంతరంగా ఏఆర్‌కు బదిలీ వచ్చే ఏడాది రిటైర్ కానున్న ఆ కానిస్టేబుల్


 


‘పోలీసుల పరంగా ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా ఫోన్ చేయండి.. ఏ క్షణంలోైనైనా సమాచారం ఇవ్వండి..  తక్షణం స్పందిస్తాం.. సమస్య పరిష్కరిస్తాం’..  కొత్తగా వచ్చే ఏ పోలీసు అధికారి అయినా చేసే ప్రకటన.. ఇచ్చే హామీ ఇదే. ఇటీవలే నగర పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగానంద్ కూడా ఇటువంటి హామీనే ఇచ్చారు. దీనికి సామాన్య ప్రజల సంగతేమో గానీ.. ముందుగా ఓ పోలీసాయనే స్పందించారు. సీపీకి ఫోన్ చేశారు. ఫలితం.. ఆయన హఠాత్తుగా లూప్‌లైన్‌కు బదలీ అయ్యారు. పై అధికారుల నుంచి వేధింపులకు గురయ్యారు. సరిగ్గా మరో ఏడాదిలో రిటైర్ కానున్న ఆ పోలీసాయనకు ఖాకీ బాస్‌లు చుక్కలు చూపిస్తున్నారు. వివరాలేమిటో మీరే చూడండి.


 


విశాఖపట్నం : పరవాడ ట్రాఫిక్  విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ పెద్దాయన విధి నిర్వహణలో కొన్నాళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. లంకెలపాలెం జంక్షన్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టసాధ్యంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న వందలాది ఫార్మా కంపెనీలకు చెందిన వాహనాలు, జాతీయ రహదారి జంక్షన్ మీదుగా ప్రయాణించే వేలాది లారీల ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నల్స్ అవసరం అనివార్యమైంది. ఈ విషయమై ఆయన పలుమార్లు తనపై అధికారులకు విన్నవించుకున్నారు. ముందుగా ఎస్‌ఐకి చెప్పుకున్నారు. ఆ తర్వాత సీఐకు మొరపెట్టుకున్నారు. ఫలితం కానరాకపోవడంతో ఆయనకు సీపీ యోగానంద్ మాటలు గుర్తొచ్చాయి. ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నేరుగా కమిషనర్‌కు ఫోన్ చేశారు. సార్.. చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నాం.. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదని విన్నవించుకున్నారు. స్పందించిన సీపీ అయ్యో అలాగా.. పక్కనే ట్రాఫిక్ అధికారి ఉన్నారు.. మాట్లాడండి.. అని ఆ ఫోన్ సదరు ట్రాఫిక్ అధికారికి ఇచ్చారు. సమస్య మొత్తం మళ్లీ సదరు ట్రాఫిక్ అధికారికి ఏకరువు పెట్టారు.


 

దొరగారికే చెబుతావా.. నీ సంగతి చూస్తాం..

పెద్ద బాస్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో హమ్మయ్య.. ఇక సమస్య పరిష్కారమైపోతుందని ట్రాఫిక్ కానిస్టేబుల్ భావించాడు. కానీ అప్పటి నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. 9వ తేదీ ఉదయం ఎస్సై ఫోన్ చేసి వెంటనే స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశారు. ఏం జరిగిందోనని ఆదుర్దాగా వెళ్లిన ఆ కానిస్టేబుల్‌పై అధికారులు తిట్ల దండకం అందుకున్నారు. ‘నువ్వేంటి.. నీస్థాయి ఏమిటి.. నేరుగా దొరగారికే ఫోన్ చేస్తావా.. వెంటనే నీ పాస్‌పోర్టు సరెండర్ చేయి.. స్టేషన్ రికార్డులన్నీ ఇవ్వు .. ఇవాళ నుంచి ఇక్కడొద్దు.. ఏఆర్‌కు పో’.. అని ఈసడించుకున్నారు. సర్.. నేను చేసిన తప్పేంటి దొరగారికి ఫోన్ చేయడమే తప్పయితే తొలి తప్పుగా క్షమించండి.. 59 ఏళ్ల వయసులో ఉన్న నేను ఏఆర్‌లో ఏం చేస్తాను.. వచ్చే జూన్‌లో రిటైర్‌మెంట్ ఉంది.. అప్పటివరకు ఇక్కడే ఉంచండి.. అని పలుమార్లు ప్రాధేయపడ్డా ఆ అధికారులు కనికరించలేదు. పైగా అతనితో సీపీకి ఫోన్ చేయడం తప్పని లిఖిత పూర్వకంగా లేఖ కూడా రాయించుకున్నట్టు తెలుస్తోంది.  ఎన్నాళ్లుగానో అపరిష్కృతంగా ఉన్న సమస్య మీద తమ శాఖకే చెందిన ఓ  సీనియర్ ఉద్యోగి సీపీకి ఫోన్ చేయడమే నేరమన్నట్టు  పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top