సీజన్ ఆరంభంలోనే చలిపులి జిల్లావాసులను వణికిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నా, రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
– అగళిలో 8.2 డిగ్రీల కనిష్టం
– వణుకుతున్న జనం
అనంతపురం అగ్రికల్చర్ : సీజన్ ఆరంభంలోనే చలిపులి జిల్లావాసులను వణికిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నా, రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అగళి మండలంలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మడకశిర 9.3 డిగ్రీలు, రొద్దం 9.5 డిగ్రీలు, తనకల్లు 9.6 డిగ్రీలు నమోదయ్యాయి.
వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీలు, రాత్రిళ్లు సరాసరి 13 నుంచి 15 డిగ్రీలు నమోదయ్యాయి. గతంతో పోల్చుకుంటే రాత్రి సమయాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. చలి ప్రభావంతో రైతులు, కూలీలు, పారిశుద్ధకార్మికులు, పాలు, కూరగాయలు వ్యాపారులు, తోపుడుబండ్లు మీద అమ్ముకునే చిరువ్యాపారులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు టోపీలు, మాస్క్‌లు, స్వెట్టర్లు ధరిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ పెరిగింది. డిసెంబర్, జనవరి నెలల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.