సేద్యం విభాగంలో కృష్ణాజిల్లా ఎడ్లు సై

సేద్యం విభాగంలో కృష్ణాజిల్లా ఎడ్లు సై - Sakshi

గన్నవరం : మండలంలోని కేసరపల్లిలో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీల్లో కృష్ణాజిల్లా ఎడ్లు సత్తా చాటుతున్నాయి. శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం రాత్రి వరకూ జరిగిన వ్యవసాయ సేద్యం విభాగంలో పోటాపోటీగా జరిగిన ప్రదర్శనలో వరుసగా నాలుగు స్థానాలను జిల్లా ఎడ్లు కైవసం చేసుకున్నాయి. కృష్ణాజిల్లా గన్నవరం మండంల మెట్లపల్లికి చెందిన చిలకపాటి రాజీవ్‌ ఎడ్లజత నిర్ణీత వ్యవధిలో బండను రికార్డు స్థాయిలో 4,346 దూరం లాగి ప్రథమ స్థానం సాధించాయి. పెనమలూరు మండలం కానూరుకు చెందిన డీవీఆర్‌ మెమోరియల్‌ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత 3,989 అడుగులతో ద్వితీయం, పెనమలూరుకు చెందిన కోయి జగన్మోహన్‌రావు ఎడ్లజత 3,636 అడుగులతో తృతీయ స్థానంలో నిలిచాయి. మెట్లపల్లికి చెందిన చిలకపాటి రాజీవ్‌కు చెందిన మరో ఎడ్లజత 3,600 దూరంలాగి నాల్గో స్థానం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కాకాని శ్రీహరిరావు ఎడ్లజత 3,545 అడుగులతో ఐదో స్థానంలో నిలిచాయి. అనంతరం వరుసగా ఐదు స్థానాల్లో నిలిచిన ఎడ్లజతలకు డీవీఆర్‌ మెమోరియల్‌ ద్వారా వైఎస్సార్‌ సీపీ జిల్లా నాయకులు దేవభక్తుని సుబ్బారావు మొత్తం రూ.72వేల బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులను వృద్ధి చేసేందుకు, వాటి పోషకులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. కాగా, శుక్రవారం సబ్‌జూనియర్స్‌ విభాగంలో పోటీలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చిన 15 ఎడ్లజతలు ఈ పోటీల్లో బలప్రదర్శన చేస్తున్నాయి. పోటీల నిర్వాహకులు మల్లంపాటి బాబూరావు, వింత సాంబిరెడ్డి, శనగల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు దేవభక్తుని చక్రవర్తి, పుర ప్రముఖులు కంఠమనేని శ్రీనివాసరావు, పెదకడిమి సొసైటీ అధ్యక్షుడు చల్లగుళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బలప్రదర్శనను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో రావడంలో పోటీ ప్రాంగణం కోలాహలంగా మారింది.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top