దంపతుల దారుణ హత్య | brutal murder of the couple | Sakshi
Sakshi News home page

దంపతుల దారుణ హత్య

Mar 30 2016 5:08 AM | Updated on Jul 10 2019 8:00 PM

దంపతుల దారుణ హత్య - Sakshi

దంపతుల దారుణ హత్య

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారడంతో మానవత్వం మంట కలసి పోతోంది.

చిన్నాన్న కొడుకే హంతకుడు
ఆర్థిక వివాదాలా.. అనుమానమా?
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తల్లిదండ్రుల మరణంతో అనాథలైన పిల్లలు

 మైదుకూరు టౌన్ :  మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారడంతో మానవత్వం మంట కలసి పోతోంది. అన్నదమ్ములు, దగ్గరి బంధువుల మధ్య ఆప్యాయత కనుమరుగై ఆర్థిక వివాదాలు ప్రాణాలు బలి తీసుకునేదాకా వెళ్తున్నాయి. ఈ క్రమంలో మైదుకూరు సాయినాథపురంలోని రేణుకా యల్లమ్మ గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 1.20 గంటల ప్రాంతంలో పట్టే అయ్యవారయ్య (38), పట్టే నాగులమ్మ( 36) దంపతులు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అయ్యవారయ్య, నాగులమ్మలు కొన్నేళ్ల క్రితం మైదుకూరుకు వచ్చి పాత దుస్తుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయ్యవారయ్య ఒల్డ్ క్లాత్ మర్చంట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేస్తుండేవాడు.

ఈ క్రమంలో అయ్యవారయ్య చిన్నాన్న కొడుకు పట్టే శ్రీనుతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవాడు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలొచ్చాయి. దీంతో శ్రీను అయ్యవారయ్యపై కక్ష పెంచుకుని ఆయన్ను హత్య చేయాలని కాచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తండ్రి చిన్న నరసింహులు, మరికొంత మందితో కలిసి మేడపైన నిద్రిస్తున్న అయ్యవారయ్య, నాగులమ్మలపై మారణాయుధాలతో దాడిచేసి కిరాతకంగా హత్య చేశాడు. డీఎస్పీ రామకృష్టయ్య, అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మృతుడి తండ్రి పట్టె పెద్ద నరసింహులు ఫిర్యాదు మేరకు శ్రీను, చిన్న నరసింహులు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతి చెందిన దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తిరుపతిలోని

 ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్, కుమారుడు మైదుకూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణంతో ఆ ఇద్దరు బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఆర్థిక విషయాలే కారణమా?
అయ్యవారయ్య కొంత కాలంగా శ్రీనుతో కలిసి వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తున్నాడు. శ్రీనుకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. కొద్ది రోజుల క్రితం భార్యతో మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అయ్యవారయ్య పెద్ద మనిషిగా వ్యవహరించి దంపతులను కలిపే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో తన అన్న అయ్యవారయ్యపై ఏదో అనుమానం పెట్టుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని సమాచారం. దంపతులిద్దరూ ఒకేసారి హత్యకు గురికావడంతో ఆస్తి వివాదలా.. లేక మరేదైనా కారణమా అనే కోణంలో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.


దుఃఖాన్ని దిగమింగుకుని..

అయ్యవారయ్య, నాగులమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్ స్థానిక టీవీఎస్‌ఎం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మ్యాథ్స్-1 పరీక్ష ఉండటంతో సోమవారం రాత్రి కిందింట్లో చదువుకుని అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి మేడపై నుంచి పెద్దగా అరుపులు, కేకలు వినిపించగానే పైకి వెళ్లాడు. తల్లిదండ్రులిద్దరూ దారుణంగా హత్యకు గురై ఉండటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఉదయం వరకు కన్నీరు మున్నీరుగా విలపించాడు. బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకు తెచ్చుకుని దుఃఖాన్ని దిగమింగుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement