breaking news
economic disputes
-
ఒకప్పటి ఆర్థిక అద్భుతం.. కోల్పోయిన మరో స్థానం
జపాన్ను ఒక ఆర్థిక అద్భుతంగా కీర్తిస్తుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురైనా అనూహ్యంగా పుంజుకున్న దేశంగా కొనియాడతారు. నిస్సారమైన భూముల నుంచి ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని ప్రశంసిస్తారు. ఇటీవలి వరకు దాని కీర్తి అలానే కొనసాగుతూ వచ్చింది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న జపాన్ తాజా గణాంకాల ప్రకారం నాలుగోస్థానానికి చేరినట్లు తెలిసింది. ఆ దేశ జీడీపీ 2023లో జర్మనీ కంటే తక్కువగా ఉంది. గతేడాది జపాన్ నామమాత్రపు జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో జర్మనీది 4.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దాంతో జపాన్ ఒక స్థానం కిందకు వెళ్లినట్లైంది. జపాన్ వాస్తవిక జీడీపీ వృద్ధి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం క్షీణించింది. నామమాత్రపు జీడీపీని ప్రస్తుత ధరల వద్ద, వాస్తవిక జీడీపీని స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తారు. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పడిపోతుందని విశ్లేషకులు తెలిపారు. 2010 వరకు జపాన్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. కానీ దానితర్వాత తన స్థానాన్ని కోల్పోయింది. దాంతో చైనా ఆ స్థానాన్ని భర్తీ చేసింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో జపాన్, జర్మనీలు గణనీయమైన ఉత్పాదకత కోసం పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకున్నాయి. కానీ జపాన్‌తో పోలిస్తే జర్మనీ బలమైన ఆర్థిక పునాదులు నిర్మించుకుంది. ద్రవ్యోల్బణం కారణంగా జపాన్ కరెన్సీ రోజురోజు క్షీణిస్తోంది. వాహన తయారీ రంగంలో బలంగా ఉన్న జపాన్ విద్యుత్తు వాహనాలు, కొత్తగా వివిధ దేశాల్లో పుట్టుకొస్తున్న తయారీ సంస్థలతో సవాళ్లు ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు. జపాన్ దేశంలో శ్రామికశక్తి కొరత అధికంగా ఉందని చెబుతున్నారు. దాన్ని అధిగమించడానికి వలస విధానం ఒక మార్గమని విశ్లేషకులు సూచిస్తున్నారు. కానీ తమ దేశం మాత్రం విదేశీ కార్మికులను అనుమతించడం లేదంటున్నారు. దీంతో వైవిధ్యంలేని, వివక్షాపూరిత దేశంగా విమర్శలు ఎదుర్కొంటోందని చెబుతున్నారు. ఇదీ చదవండి: డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్’.. ఎక్కడో తెలుసా.. కొంతకాలంగా జపాన్ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న దేశ జనాభా.. గతేడాది రికార్డు స్థాయిలో క్షీణించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది జననాల సంఖ్య దాదాపు ఐదు శాతం క్షీణించిందని ప్రభుత్వం పేర్కొంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిస్థితేనని పేర్కొన్న జపాన్ ప్రభుత్వం.. వివాహాలు, జననాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించింది. -
దంపతుల దారుణ హత్య
♦ చిన్నాన్న కొడుకే హంతకుడు ♦ ఆర్థిక వివాదాలా.. అనుమానమా? ♦ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ♦ తల్లిదండ్రుల మరణంతో అనాథలైన పిల్లలు మైదుకూరు టౌన్ : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారడంతో మానవత్వం మంట కలసి పోతోంది. అన్నదమ్ములు, దగ్గరి బంధువుల మధ్య ఆప్యాయత కనుమరుగై ఆర్థిక వివాదాలు ప్రాణాలు బలి తీసుకునేదాకా వెళ్తున్నాయి. ఈ క్రమంలో మైదుకూరు సాయినాథపురంలోని రేణుకా యల్లమ్మ గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 1.20 గంటల ప్రాంతంలో పట్టే అయ్యవారయ్య (38), పట్టే నాగులమ్మ( 36) దంపతులు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అయ్యవారయ్య, నాగులమ్మలు కొన్నేళ్ల క్రితం మైదుకూరుకు వచ్చి పాత దుస్తుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయ్యవారయ్య ఒల్డ్ క్లాత్ మర్చంట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో అయ్యవారయ్య చిన్నాన్న కొడుకు పట్టే శ్రీనుతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవాడు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలొచ్చాయి. దీంతో శ్రీను అయ్యవారయ్యపై కక్ష పెంచుకుని ఆయన్ను హత్య చేయాలని కాచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తండ్రి చిన్న నరసింహులు, మరికొంత మందితో కలిసి మేడపైన నిద్రిస్తున్న అయ్యవారయ్య, నాగులమ్మలపై మారణాయుధాలతో దాడిచేసి కిరాతకంగా హత్య చేశాడు. డీఎస్పీ రామకృష్టయ్య, అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మృతుడి తండ్రి పట్టె పెద్ద నరసింహులు ఫిర్యాదు మేరకు శ్రీను, చిన్న నరసింహులు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతి చెందిన దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్, కుమారుడు మైదుకూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణంతో ఆ ఇద్దరు బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్థిక విషయాలే కారణమా? అయ్యవారయ్య కొంత కాలంగా శ్రీనుతో కలిసి వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తున్నాడు. శ్రీనుకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. కొద్ది రోజుల క్రితం భార్యతో మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అయ్యవారయ్య పెద్ద మనిషిగా వ్యవహరించి దంపతులను కలిపే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో తన అన్న అయ్యవారయ్యపై ఏదో అనుమానం పెట్టుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని సమాచారం. దంపతులిద్దరూ ఒకేసారి హత్యకు గురికావడంతో ఆస్తి వివాదలా.. లేక మరేదైనా కారణమా అనే కోణంలో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. దుఃఖాన్ని దిగమింగుకుని.. అయ్యవారయ్య, నాగులమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్ స్థానిక టీవీఎస్ఎం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మ్యాథ్స్-1 పరీక్ష ఉండటంతో సోమవారం రాత్రి కిందింట్లో చదువుకుని అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి మేడపై నుంచి పెద్దగా అరుపులు, కేకలు వినిపించగానే పైకి వెళ్లాడు. తల్లిదండ్రులిద్దరూ దారుణంగా హత్యకు గురై ఉండటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఉదయం వరకు కన్నీరు మున్నీరుగా విలపించాడు. బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకు తెచ్చుకుని దుఃఖాన్ని దిగమింగుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశాడు.