‘పుర్రె’ పోటు

‘పుర్రె’ పోటు


బీడీ కార్మికుల ‘ఉపాధి’పై దెబ్బ

పది రోజులు ఆందోళన చేసినా స్పష్టత ఇవ్వని సర్కారు

2.50 లక్షల బీడీ  కార్మికుల్లో అభద్రత

మళ్లీ ఏప్రిల్ నుంచి పోరుకు సన్నద్ధం

చిత్రంలో కనిపిస్తున్న  వాళ్లు మోర్తాడ్ మండలం


 తాళ్లరాంపూర్‌కు చెందిన కంఠం సాయమ్మ. ఈమె వయసు 70 సంవత్సరాలు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో తనపై ఆధారపడి ఉన్న కూతురు రూప, కొడుకు భరత్‌ల కోసం రోజు బీడీలు చుడుతుంది. సాయమ్మ కూతురు, కొడుకుల మానసిక స్థితి బాగులేక పోవడంతో అన్ని తానై కుటుంబాన్ని ఆ వృద్ధురాలు నెట్టుకొస్తుంది. సాయమ్మ చిన్న తనం నుంచి బీడీలు చుడుతోంది. రోజుకు వేయి బీడీలు చుడితే నెలకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు లభిస్థారుు. ఈమెకు బీడీలు తప్ప మరో పని తెలియదు. మొన్నటి వరకు బీడీ పరిశ్రమలు బంద్ కావడంతో చాలా అవస్థలు పడ్డామని తెలిపింది. పుర్రె గుర్తును తొలగించాలని వేడుకుంటోంది.


 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పల్లె జీవనంలో వివిధ వృత్తులు, ఉపాధి ద్వారా ఆదర్శంగా  నిలుస్తున్న మహిళలకు ‘పుర్రె’ గుర్తు ప్రతిబంధకం అవుతోంది. బీడీ    కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న ఉత్తర్వులపై ప్రభుత్వాలు ఏటూ తేల్చక పరిశ్రమను నమ్ముకున్న వారిని అభద్రతలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు బీడీ తయారీ కంపెనీలు.. మరోవైపు కార్మిక సంఘాలు తరచూ ఆందోళనలకు దిగుతుండటంతో బీడీ పరిశ్రమను నమ్ముకున్న కార్మికుల ‘ఉపాధి’కి భరోసా లేకుండా పోతుంది. ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘ది  తెలంగాణ బీడీ మాన్యుప్యాక్చరర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమల బంద్‌కు పిలుపునివ్వడం.. బీడీలు చుట్టి ఉపాధి పొందే మహిళలకు పిడుగు పాటులా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ బీడీ పరిశ్రమలను బంద్ పెట్టడంతో జిల్లాలో బీడీలు చుడుటూ జీవించే 2.50 లక్షల మంది ఉపాధిపై దెబ్బ పడింది. ఈ బీడీ పరిశ్రమపై మహిళలతోపాటు బట్టివాలా, ప్యాకింగ్ కార్మికులు, వార్‌మెన్లు, గంపావాలా, గుమాస్తాలు, అకౌంటెంట్ల కుటుంబాల్లో ఆందోళనకు కారణమయ్యాయి.



అసలు కారణం 85 శాతమే..

బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న కేంద్ర   ప్రభుత్వ నిర్ణయం ఉప సంహరణ ప్రధాన డిమాండ్‌గా బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెరపైకి తెచ్చింది. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 297 ద్వారా బీడీ కట్టలపై 41 శాతం పుర్రె, ఎముకల గుర్తులను ముద్రించాలని ప్రకటించింది. ఈ ఉత్తర్వులపై బీడీ కార్మికులు, సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ఫలి తం లేదు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్క్య్‌లర్ జీవో 727(ఈ) ద్వారా 85 శాతం డేంజర్ గుర్తును ఏప్రిల్ నుంచి ముద్రించాలని కోరడంతో మళ్లీ బడీ కంపెనీలు ఆందోళనకు దిగాయి. బీడీ కట్టలపై 85 శాతం పుర్రెగుర్తు ముద్రించాలని జారీ చేసిన జీఎస్‌ఆర్ 727(ఈ)ను నిరసిస్తూ బీడీ కంపెనీల మూసివేతకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 80 లక్షల మంది బీడీలు చుట్టే బీడీ కార్మికులు ఉం టే.. ఆ పరిశ్రమలో ఇతర పనులు చేసే వారు 1.30 కోట్ల మంది కార్మికులు ఉన్నారనేది అంచనా. కాగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 8 లక్షల మంది బీడీ కార్మికులు, లక్ష మంది వరక తునికాకు సేకరించే కార్మికులు బీడీ పరిశ్రమలో పనిచేస్తూ జీవితాలు వెళ్లదీస్తున్నారు. మళ్లీ ఏప్రిల్ నుంచి ఆందోళనకు బీడీ కార్మికులు సిద్ధం అవుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top