breaking news
skull symbol
-
‘పుర్రె’ పోటు
♦ బీడీ కార్మికుల ‘ఉపాధి’పై దెబ్బ ♦ పది రోజులు ఆందోళన చేసినా స్పష్టత ఇవ్వని సర్కారు ♦ 2.50 లక్షల బీడీ కార్మికుల్లో అభద్రత ♦ మళ్లీ ఏప్రిల్ నుంచి పోరుకు సన్నద్ధం ♦ చిత్రంలో కనిపిస్తున్న వాళ్లు మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్‌కు చెందిన కంఠం సాయమ్మ. ఈమె వయసు 70 సంవత్సరాలు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో తనపై ఆధారపడి ఉన్న కూతురు రూప, కొడుకు భరత్‌ల కోసం రోజు బీడీలు చుడుతుంది. సాయమ్మ కూతురు, కొడుకుల మానసిక స్థితి బాగులేక పోవడంతో అన్ని తానై కుటుంబాన్ని ఆ వృద్ధురాలు నెట్టుకొస్తుంది. సాయమ్మ చిన్న తనం నుంచి బీడీలు చుడుతోంది. రోజుకు వేయి బీడీలు చుడితే నెలకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు లభిస్థారుు. ఈమెకు బీడీలు తప్ప మరో పని తెలియదు. మొన్నటి వరకు బీడీ పరిశ్రమలు బంద్ కావడంతో చాలా అవస్థలు పడ్డామని తెలిపింది. పుర్రె గుర్తును తొలగించాలని వేడుకుంటోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పల్లె జీవనంలో వివిధ వృత్తులు, ఉపాధి ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న మహిళలకు ‘పుర్రె’ గుర్తు ప్రతిబంధకం అవుతోంది. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న ఉత్తర్వులపై ప్రభుత్వాలు ఏటూ తేల్చక పరిశ్రమను నమ్ముకున్న వారిని అభద్రతలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు బీడీ తయారీ కంపెనీలు.. మరోవైపు కార్మిక సంఘాలు తరచూ ఆందోళనలకు దిగుతుండటంతో బీడీ పరిశ్రమను నమ్ముకున్న కార్మికుల ‘ఉపాధి’కి భరోసా లేకుండా పోతుంది. ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘ది తెలంగాణ బీడీ మాన్యుప్యాక్చరర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమల బంద్‌కు పిలుపునివ్వడం.. బీడీలు చుట్టి ఉపాధి పొందే మహిళలకు పిడుగు పాటులా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ బీడీ పరిశ్రమలను బంద్ పెట్టడంతో జిల్లాలో బీడీలు చుడుటూ జీవించే 2.50 లక్షల మంది ఉపాధిపై దెబ్బ పడింది. ఈ బీడీ పరిశ్రమపై మహిళలతోపాటు బట్టివాలా, ప్యాకింగ్ కార్మికులు, వార్మెన్లు, గంపావాలా, గుమాస్తాలు, అకౌంటెంట్ల కుటుంబాల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అసలు కారణం 85 శాతమే.. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉప సంహరణ ప్రధాన డిమాండ్‌గా బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెరపైకి తెచ్చింది. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 297 ద్వారా బీడీ కట్టలపై 41 శాతం పుర్రె, ఎముకల గుర్తులను ముద్రించాలని ప్రకటించింది. ఈ ఉత్తర్వులపై బీడీ కార్మికులు, సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ఫలి తం లేదు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్క్య్లర్ జీవో 727(ఈ) ద్వారా 85 శాతం డేంజర్ గుర్తును ఏప్రిల్ నుంచి ముద్రించాలని కోరడంతో మళ్లీ బడీ కంపెనీలు ఆందోళనకు దిగాయి. బీడీ కట్టలపై 85 శాతం పుర్రెగుర్తు ముద్రించాలని జారీ చేసిన జీఎస్ఆర్ 727(ఈ)ను నిరసిస్తూ బీడీ కంపెనీల మూసివేతకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 80 లక్షల మంది బీడీలు చుట్టే బీడీ కార్మికులు ఉం టే.. ఆ పరిశ్రమలో ఇతర పనులు చేసే వారు 1.30 కోట్ల మంది కార్మికులు ఉన్నారనేది అంచనా. కాగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 8 లక్షల మంది బీడీ కార్మికులు, లక్ష మంది వరక తునికాకు సేకరించే కార్మికులు బీడీ పరిశ్రమలో పనిచేస్తూ జీవితాలు వెళ్లదీస్తున్నారు. మళ్లీ ఏప్రిల్ నుంచి ఆందోళనకు బీడీ కార్మికులు సిద్ధం అవుతున్నారు. -
ఉపాధిపై పుర్రె పోటు
ఆదుకోని చట్టాలు.. ఆకలి తీర్చని పని. పొద్దంతా కష్టం.. రోగాలతో సతమతం.. ఇదీ క్లుప్తంగా బీడీ కార్మికుల జీవితం. విరామం లేకుండా కష్టిస్తున్నా జీవితమంతా దుర్భరమే. పండగలు, పబ్బాలకు దూరమై.. కుటుంబ పోషణలో లీనమై.. అవసరానికి ఆదుకోని సంపాదనతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు పీఎఫ్ లేక శాపగ్రస్తులు కాగా.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరి ‘పుర్రె’లు పగిలిపోయేలా ఉన్నాయి. * శ్రమ దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికులు * ఆదుకోని యాజమాన్యాలు.. ఆసరా ఇవ్వని వేతనాలు * కేంద్ర ప్రభుత్వ ‘పుర్రె’ నిర్ణయంపై నిరసన జ్వాలలు * నష్టపోతున్నామని.. ఇబ్బందులు పెట్టొద్దని వేడుకోలు మిరుదొడ్డి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది కార్మికులు బీడీ రంగాన్నే నమ్ముకున్నారు. వీరిలో అధిక శాతం మహిళలు కావడం గమనార్హం. జిల్లాలో సుమారు 82 వేల మంది పనిచేస్తున్నారు. అందులో 60 వేల మందికి ఫీఎఫ్ నంబర్లు ఉండగా.. 22 వేల మంది నాన్ పీఎఫ్ నంబర్లు కలిగి ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, నంగునూరు, గజ్వేల్, రామాయంపేట, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, అందోల్, జోగిపేట, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఒక కార్మికుడికి వెయ్యి బీడీలు చుట్టినందుకు రూ.152 చెల్లించాలి. ఇందులో పీఎఫ్ కటింగ్ పోను రూ.139 ఇస్తున్నారు. టేకే దారులు అందులోనూ రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గించి అందజేస్తున్నారు. పీఎఫ్ కార్డులు లేవన్న సాకుతో వారి శ్రమను దోచేస్తున్నారు. నెలకు కనీసం 26 రోజుల పని దినాలను కల్పించాలన్న నిబంధన ఉన్నా 15 రోజులు కూడా వర్క కల్పించడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సరిపడని ఆకు, తంబాకు బీడీ యాజమాన్యం ప్రతి వెయ్యి బీడీల తయారీకి 650 గ్రాముల ఆకు, దానికి సరిపడా తంబాకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే, ఆకు తూకంలో తాము మోసపోతున్నామని కార్మికులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆకు అందిస్తుండటంతో అదనంగా కిలోకు రూ.100 నుంచి లేక రూ.120లు చెల్లించి ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నామన్నారు. వైద్య సేవలు నిల్ మహిళా బీడీ కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు బీడీలు చుడుతూనే ఉంటారు. దీంతో వారికి శ్వాస సంబంధిత వ్యాధులు, మెడ.. వెన్ను నొప్పులు వెంటాడుతున్నాయి. వీరికి డెస్పెన్సరీలతో పాటు మొబైల్ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాల్సి ఉన్నప్పటికీ అవేమీ అమలులో లేవు. దీంతో అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తెర మీదకి ‘పుర్రె’ గుర్తు ఇప్పటికే అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికుల జీవితాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఇబ్బందుల్లోకి నెట్టింది. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించాలన్న నిర్ణయంతో కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల తమ బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపాధికి చిచ్చుపెట్టే పుర్రె గుర్తును తొలగించాల్సిందేనని పలు బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తొలగింపుపై తీర్మానం బీడీ కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉన్న పుర్రె గుర్తును కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మిరుదొడ్డి మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బలపరిచారు. తెలంగాణలో ఎక్కువ శాతం బీడీ రంగాన్ని నమ్ముకున్నారని.. బీడీ కట్టలపై పుర్రెగుర్తును ముద్రించాలన్న యోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. - దుబ్బాక ఎమ్మెల్యే ఉద్యమాలు చేస్తాం బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తున్నాం. కార్మికుల ఉపాధిపై దెబ్బ కొట్టడం సరికాదు. సంక్షోభంలో ఉన్న బీడీ కార్మిక రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఎంత వరకు సమంజసం. పుర్రె గుర్తును తొలగించే వరకు బీడీ కార్మికులతో ఐక్య ఉద్యమాలు చేస్తాం. - గొడ్డుబర్ల భాస్కర్, తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పరేషాన్ చేస్తున్నరు ఆకు తూకంలో తేడాలు వస్తున్నయ్. నాణ్యత లేని ఆకే ఎక్కువగా ఉంటుంది. వెయ్యి బీడీలు చేయాలంటే గగనంగా మారుతోంది. అదనంగా ప్రైవేటుగా రూ.120 తో ఆకు కొంటున్నం. గివ్వన్ని సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే పుర్రె గుర్తు పెడ్తమని మమ్మల్ని పరేషాన్ చేస్తున్నరు. - బోయిని కనకవ్వ, బీడీ కార్మికురాలు పట్టించుకునేటోళ్లు లేరు బీడీలు చుట్టేటప్పుడు తంబాకుతో రోగాల పాలైతున్నం. మెడ నొప్పులు, వెన్ను నొప్పులతో మస్తు ఇబ్బందులు పడుతుంటం. రోగాల పాలై మంచాన పడ్డా ఎవరూ పట్టించుకోరు. చేసేది లేక వ్రైవేటు దవాఖానల చూపెట్టుకుంటున్నం. - అక్కమ్మ బాలమణి, బీడీ కార్మికురాలు పుర్రెగుర్తు తొలగించాలి పొగ తాగితే కాన్సర్ వస్తదనే సాకుతో బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెడతారా? మద్యం మీద లేని ఆంక్షలు బీడీలపైనే ఎందుకు? మద్యంతో సంసారాలు గుల్ల అవుతున్నాయి. జీవనోపాధి కలిగించే బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టుడు సరికాదు. మా పొట్టలు కొట్టొద్దు, పుర్రెగుర్తు తొలగించాలి. - వనం పద్మ, బీడీ కార్మికురాలు నిర్వీర్యం చేయడానికే... బీడీ రంగాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్రం పుర్రె గుర్తును తెరమీదికి తెచ్చింది. దీని వల్ల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రభుత్వం వెంటనే పుర్రెగుర్తు ముద్రించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇందుకోసం మండల సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. - పంజాల కవిత, ఎంపీపీ మిరుదొడ్డి -
‘పుర్రె’పై పోరు ఉధృతం
ముస్తాబాద్/మేడిపెల్లి: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ , మేడిపెల్లి మండల కేం ద్రాల్లో బీడీ కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తును ముద్రించాలని జారీ చేసిన జీవో 727 (ఇ)ని రద్దు చేయాలని గురువారం బీడీ టేకెదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. తెలంగాణలో ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసి సిగార్ కంపెనీల కొమ్ముకాసేందుకే ఈ జీవో తీసుకొచ్చిందన్నారు. బీడీ కార్మికుల పొట్టగొట్టే చర్యలను వెం టనే నిలిపివేయాలనే డిమాండ్‌తో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. -
‘పుర్రె’పై మరో పోరు
ఢిల్లీలో నేడు బీడీ యాజమాన్యాల సమావేశం కోరుట్ల: బీడీ పరిశ్రమను సమ్మెబాట పట్టించిన పుర్రె గుర్తు మరోమారు కార్మికులను కలవరపరుస్తోంది. బీడీకట్టలపై పుర్రె గుర్తు సైజు పెంపునకు కేంద్ర కార్మిక సంక్షేమశాఖ చర్యలు తీసుకుంటుండడాన్ని బీడీ కంపెనీల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే బీడీకట్టలపై ఉన్న పుర్రె గుర్తు, అవయవాల ముద్రణతో అమ్మకాలు పడిపోయాయని, మళ్లీ గుర్తు పెద్దగా చేసి మద్రించాలన్న యోచనతో తమ పరిస్థితి అధ్వానంగా మారుతుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో బీడీకట్టలపై పుర్రె గుర్తు సైజు పెంపునకు నిరసనగా కంపెనీల మూసివేతకు యజమాన్యాలు యోచిస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న బీడీ కంపెనీల యాజమాన్యాలు గురువారం ఢిల్లీలో సమావేశమవుతున్నాయి.