టెంపోలలో వలసవెళ్తున్న వివిధ గ్రామాల ప్రజలు
కర్నూలు జిల్లా నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలసలు
మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇప్పటికే 10 వేలమంది వలసబాట
పలు మండలాల్లో నిర్మానుష్యమైన గ్రామాలు
తల్లిదండ్రులతో బడిపిల్లలు కూడా..
పాఠశాలల్లో భారీగా తగ్గిపోయిన హాజరు
కోసిగి: ఉన్న ఊళ్లో పనులు చేసుకుని కలోగంజో తాగి బతికే వేలాదిమంది ఇప్పుడు ఇక్కడ ఉపాధి కరువై వలసబాట పట్టారు. కర్నూలు జిల్లా నుంచి పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన మంత్రాలయం నియోజకవర్గం నుంచి అత్యధికంగా బతుకుదెరువు కోసం ఊళ్లొదిలి వెళుతున్నారు. ఈ ఏడాది అధికవర్షాలు, తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోలేదు.
పెట్టుబడులకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక రైతులు, కూలీలు కూడా పనుల కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మూటాముల్లె సర్దుకుని పిల్లాపాపలతో ఇళ్లకు తాళాలు వేసి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లి పనులు వెదుక్కుంటున్నారు. మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలంలోని వివిధ గ్రామాల నుంచి 20 రోజులుగా లారీలు, టెంపోలు, ట్రాక్టర్లలలో 10వేల మంది వలస వెళ్లారు. ప్రధానంగా కోసిగి మండలం నుంచి అత్యధికంగా వలసలు ఉంటున్నాయి.
కోసిగితో పాటు చింతకుంట, పల్లెపాడు, దుద్ది, కొల్మాన్‌పేట, ఆర్లబండ, కామన్‌దొడ్డి, చిర్తనకల్లు, సజ్జలగుడ్డం, వందగల్లు, జుమ్మాలదిన్నె, మూగలదొడ్డి, జంపాపురం గ్రామాల ప్రజలు ఊళ్లొదిలారు. దీంతో ఆయా గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని సేదాపురం, గబ్బూరు, మటమారి, మర్చటాల్, ఉట్నూరు, తెలంగాణ రాష్ట్రంలో గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు.
ప్రాంతాల్లో పత్తి పొలాల్లో పనులకు వెళ్తున్నారు. కిలో పత్తి సేకరిస్తే రూ.15 చొప్పున కూలి లభిస్తోంది. రోజుకు ఒక క్వింటా పైగా తీస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ గిట్టుబాటు కాదని, ఆ పనులకు పోతే బతకడం కష్టమవుతోందని స్థానికులు వాపోతున్నారు.
పాఠశాలల్లో తగ్గిన హాజరుశాతం
పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా తీసుకెళ్లడంతో మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల హజరుశాతం పూర్తిగా తగ్గింది. ప్రధానంగా కోసిగి హిందూ గరŠల్స్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 442 మంది చదువుతున్నారు. పదిరోజులుగా పాఠశాలకు 166 మంది మాత్రమే హజరవుతున్నారు. ఆగస్ట్, సెపె్టంబర్ నెలల్లో 343 మంది వరకు హాజరయ్యారు. వలస వెళ్లడంతో అక్టోబర్‌లో సగానికి పైగా తగ్గిపోయారు.
కోసిగిలోని చాకలగేరి, ఆదిఆంధ్ర, రంగప్పగట్టు, కుమ్మరివీధి, జేబీఎం, ఎస్‌డబ్ల్యూ, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో హాజరు అమాంతం పడిపోయింది. మండలంలో 1 నుంచి 10వ తరగతి వరకు 48 ప్రభుత్వ పాఠశాలల్లో 14,554 మంది విద్యార్థులు చదువుతున్నారు. అధికారికంగా 432 మంది విద్యార్థులు తల్లిదండ్రులతో వలస వెళ్లారు. అనధికారికంగా ఈ సంఖ్య వెయ్యికిపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
అమ్మ, నాన్న వలస వెళ్లారు
కోసిగి హిందూ గర్ల్స్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నా. అమ్మానాన్నతో పాటు అన్న, అక్క వలస వెళ్లారు. నన్ను మా నానమ్మ దగ్గర వదిలిపెట్టారు. అక్కడ ఉండి రోజూ బడికి పోతున్నా. ప్రతి సంవత్సరం అమ్మానాన్న సుగ్గికి పోతుంటారు. – విజయలక్ష్మి, 5వ తరగతి, కోసిగి
సగానికిపైగా తగ్గిన హాజరు
మా పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 442 మంది చదువుతున్నారు. దసరా సెలవుల తరువాత సగానికిపైగా పిల్లలు రావడం లేదు. తల్లిదండ్రులను, పిల్లలను విచారిస్తే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు చెబుతున్నారు. ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో విద్యార్థుల హాజరు తగ్గిపోతోంది. – సంజన్న, హిందూగర్ల్స్ స్కూల్ హెచ్‌ఎం, కోసిగి


