అమృతలూరులో యువకుడి దారుణ హత్య

Young Man Murder in Amruthaluru Guntur - Sakshi

గుంటూరు, అమృతలూరు(వేమూరు): మండల కేంద్రమైన అమృతలూరులో గురువారం దారుణం జరి గింది. అమృతలూరుకు చెందిన కొమ్మెర్ల శేఖర్‌బాబు (42)పై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానికులు వచ్చి వెంటనే తెనాలి వైద్యశాలకు,ఆ వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

సేకరించిన వివరాల ప్రకారం...
అమృతలూరుకు చెందిన కొమ్మెర్ల శేఖర్‌బాబుకు, పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రుకు చెందిన మారి విశాలాక్షితో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విశాలాక్షి పొన్నూరులో ఉంటూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. శేఖర్‌బాబు పొన్నూరులోనే పెయింట్‌ పనులకు వెళుతుంటాడు. వారం రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. పొన్నూరు పోలీస్‌స్టేషన్‌లో  కేసు నమోదు చేసి, కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో శేఖర్‌బాబు తల్లి వద్దకు అమృతలూరు వచ్చాడు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం తెల్లవారు జామున సుమారు 2 గంటల సమయంలో మట్టి గోడను పగలగొట్టి దుండగులు లోనికి ప్రవేశించి నిద్రిస్తున్న శేఖర్‌బాబుపై గుర్తు తెలియని వ్యక్తి ఇనుప వస్తువుతో తలపై మోదడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చప్పుడుకు తల్లి కేకలు వేయగా దుండగుడు పరారయ్యాడు.

నీకేమైనా నాకు సంబంధం లేదు...
భార్యాభర్తలకు వివాదం జరిగిన నేపథ్యంలో భార్య విశాలాక్షి భర్త శేఖర్‌బాబుకు ఫోన్‌ చేసి నువ్వు నన్ను అంతటి పరాభవం చేశావు. నీకేమైనా జరిగినా నాకు సంబంధం లేదని చెప్పినట్టు స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో ఇంతటి ఘోరం జరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చిన దుండగులు ఎవరు.. భార్య తాలూకూ వ్యక్తులా... లేక పెయింట్‌ పనులు చేస్తూ ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు రెండు బృందాలుగా విచారిస్తున్నారని చుండూరు సీఐ బి.రమేష్‌బాబు తెలిపారు.

ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ...
ఘటనా స్థలిని తెనాలి డీఎస్పీ ఎం.స్నేహిత, చుండూరు సీఐ బి. రమేష్‌బాబు, ఎస్‌ఐ వి.బాలకృష్ణ పరిశీలించి ఆధారాలను సేకరించారు. పలు వస్తుసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించాలని ఆదేశించారు. మృతుడి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి. బాలకృష్ణ కేసు నమోదు చేశారు.శేఖర్‌బాబు మృతదేహానికి చుండూరు సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో, వీఆర్వో అనిల్‌ సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం అమృతలూరుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top