అధికారుల ఎదుటే అఘాయిత్యం

Women Try To Commited Suicide In Gantastambam, Vizianagaram - Sakshi

సాక్షి,గంటస్తంభం(విజయనగరం) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సక్రమంగా చూసుకోవడం లేదన్న వేదన ఒకవైపు... తన బాధ చెప్పినా అధికారులు స్పందించడం లేదన్న ఆవేదన మరోవైపు.. ఆ వివాహితను మానసికంగా కుంగదీసింది. తన బాధను మరోసారి అధికారులకు చెప్పుకుందామని, అప్పటికీ పరిష్కారం కాకుంటే తనవు చాలిద్దామన్న మానసిక సంఘర్షణ మధ్య ఆమె కలెక్టరేట్‌లో అడుగుపెట్టింది. అధికారులకు మరోసారి తన సమస్య చెప్పుకుంది.

అయితే పరిష్కారం లభిస్తుందని, తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం కోల్పోవడంతో ఏకంగా ప్రాణం తీసుకుందామని అత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు యువతిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి  తరలించడంతో ప్రాణముప్పు తప్పింది. వివరాల్లోకి వెళితే... బొబ్బిలి మండలం అలజంగికి చెందిన వసుంధర అదే గ్రామానికి చెందిన రాపాక ఈశ్వరరావును ప్రేమించి నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకుంది.

అయితే భర్త ఈశ్వరరావు తనను సక్రమంగా చూడడం లేదని సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. తన ఆవేదన మొత్తం వినతిపత్రం రూపంలో రాసుకున్న ఆమె ఫిర్యాదును కలెక్టరు ఎం. హరి జవహర్‌లాల్‌కు ఇచ్చింది. గ్రామానికి చెందిన ఈశ్వరరావు, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో తాను గర్భవతి అయ్యానని... అయితే ఈశ్వరరావు పెళ్లికి అంగీకరించకపోవడంతో విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపింది.

దీంతో పోలీసులు ఈశ్వరరావుకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 19న సింహాచలంలో వివాహం చేసుకున్నామని వివరించింది. అయితే అప్పటి నుంచి తనను అత్తవారింటికి తీసుకెళ్లలేదని... పైగా బలవంతంగా మందులు వేయించి గర్భస్రావం చేయించారని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తమ కుమారుడ్ని వదిలేయాలని అత్తమామలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని..దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖలో పొందుపరిచింది. 

చీమల మందు తినేసిన బాధితురాలు..
ఇదిలా ఉంటే అధికారులకు తన గోడు చెప్పుకుంటున్న బాధితురాలు ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న చీమలమందు తినేసింది.  దీంతో అధికారులు వెంటనే స్పందించి సపర్యలు చేపట్టారు. అక్కడే ఉన్న జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ఉషశ్రీ,, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మి అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించి  108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో స్పందించడంతో బాధితురాలికి ప్రాణహాని తప్పింది. ఇదిలా ఉండగా బాధితురాలి సమస్య పరిష్కరించాలని, వసుంధర భర్త, ఇతర కుటుంబ సభ్యులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు పోలీసులను ఆదేశించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top