కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’ | Sakshi
Sakshi News home page

కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’

Published Tue, Jun 25 2019 9:44 AM

Unemployed Youth Cheated By Lady In Sk University  - Sakshi

సాక్షి, ఎస్కేయూ(అనంతపురం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల కల్పన పేరుతో నిరుద్యోగులను వంచనకు గురిచేసిన వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆరుగురు యువకులు సోమవారం ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. వారి వద్ద ఉన్న నియామక పత్రాలను అధికారులకు అందజేసి, మాట్లాడారు. ఆ పత్రాలను పరిశీలించిన అధికారులు అవి నకలీవిగా ధ్రువీకరించారు. వీసీ ఆచార్య రహంతుల్లా సంతకాన్ని ఫోర్జరీ చేసి నియామక పత్రాలు జారీ చేసినట్లు తేలిచెప్పారు.

దీంతో వాటిని తీసుకువచ్చిన నిరుద్యోగులు అయోమయానికి గురయ్యారు. వెంటనే తమకు ఆ నియామక పత్రాలు అందజేసిన యువతని ఫోన్‌లో నిలదీశారు. అధికారుల ఎదుట తాము భంగపడిన వైనాన్ని వివరించారు. దీంతో స్వీయ రక్షణలో పడిన ఆ యువతి వెంటనే వారిని అక్కడి నుంచి వచ్చేయాలని, వారు ఇచ్చిన డబ్బును వెనక్కు చెల్లిస్తానంటూ నమ్మబలికింది. దీంతో వారు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ వ్యవహారంలో సదరు నిరుద్యోగుల నుంచి రూ. 6 లక్షలు ఆ యువతి దండుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నకిలీ నియామక పత్రాలు, వీసీ సంతకం ఫోర్జరీ వ్యవహారంపై ఎస్కేయూ ఉన్నతాధికారులు ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

నోటిఫికేషన్‌తోనే ఉద్యోగాల భర్తీ 
ఎస్కేయూలో ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఈ సందర్భంగా వర్సిటీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఒకవేళ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తే కచ్చితంగా పబ్లిక్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీలో ఉద్యోగాల పేరుతో గతంలో చాలా మంది నిరుద్యోగులను పలువురు మోసం చేసి సొమ్ము చేసుకున్నారని గుర్తు చేశారు. ఇటీవల క్యాంపస్‌ కళాశాలలోని విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చామని, వెంటనే విధుల్లోకి చేరాలంటూ నిరుద్యోగులను మోసం చేసి రూ. లక్షల్లో ఓ యువతి దండుకున్న వైనంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తాజాగా వీసీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏకంగా నియామక పత్రాలు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.    

Advertisement
Advertisement