breaking news
sk univeresity
-
కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’
సాక్షి, ఎస్కేయూ(అనంతపురం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల కల్పన పేరుతో నిరుద్యోగులను వంచనకు గురిచేసిన వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆరుగురు యువకులు సోమవారం ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వచ్చారు. వారి వద్ద ఉన్న నియామక పత్రాలను అధికారులకు అందజేసి, మాట్లాడారు. ఆ పత్రాలను పరిశీలించిన అధికారులు అవి నకలీవిగా ధ్రువీకరించారు. వీసీ ఆచార్య రహంతుల్లా సంతకాన్ని ఫోర్జరీ చేసి నియామక పత్రాలు జారీ చేసినట్లు తేలిచెప్పారు. దీంతో వాటిని తీసుకువచ్చిన నిరుద్యోగులు అయోమయానికి గురయ్యారు. వెంటనే తమకు ఆ నియామక పత్రాలు అందజేసిన యువతని ఫోన్లో నిలదీశారు. అధికారుల ఎదుట తాము భంగపడిన వైనాన్ని వివరించారు. దీంతో స్వీయ రక్షణలో పడిన ఆ యువతి వెంటనే వారిని అక్కడి నుంచి వచ్చేయాలని, వారు ఇచ్చిన డబ్బును వెనక్కు చెల్లిస్తానంటూ నమ్మబలికింది. దీంతో వారు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ వ్యవహారంలో సదరు నిరుద్యోగుల నుంచి రూ. 6 లక్షలు ఆ యువతి దండుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నకిలీ నియామక పత్రాలు, వీసీ సంతకం ఫోర్జరీ వ్యవహారంపై ఎస్కేయూ ఉన్నతాధికారులు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నోటిఫికేషన్‌తోనే ఉద్యోగాల భర్తీ ఎస్కేయూలో ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఈ సందర్భంగా వర్సిటీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఒకవేళ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తే కచ్చితంగా పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీలో ఉద్యోగాల పేరుతో గతంలో చాలా మంది నిరుద్యోగులను పలువురు మోసం చేసి సొమ్ము చేసుకున్నారని గుర్తు చేశారు. ఇటీవల క్యాంపస్ కళాశాలలోని విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చామని, వెంటనే విధుల్లోకి చేరాలంటూ నిరుద్యోగులను మోసం చేసి రూ. లక్షల్లో ఓ యువతి దండుకున్న వైనంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తాజాగా వీసీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏకంగా నియామక పత్రాలు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
చదువు‘కొనాల్సిందే’!
‘అనంత’.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లా. రెక్కలు ముక్కలు చేసుకున్నా పొట్ట నిండటమే గగనం. అలాంటిది చదువు ‘కొనాలంటే’ సాధ్యమయ్యేపనేనా? అయినా చాలా మంది తల్లిదండ్రులు తమలా కాకుండా పిల్లలను ప్రయోజకులను చేయాలని అప్పులు చేసి చదివిస్తున్నారు. ఇలాంటి వారికి చేయూతనివ్వాల్సిన ఎస్కేయూ యాజమాన్యం.. ఫీ‘జులుం’ ప్రదర్శిస్తోంది. ప్రైవేటు కళాశాలల ఒత్తిడితో డిగ్రీ ఫీజులను రెండింతలు పెంచేసింది. నిరుపేదలకు ‘డిగ్రీ’ విద్యనూ దూరం చేసింది. ప్రభుత్వం మాత్రం పెంచిన ఫీజుల మేరకు రీయింబర్స్మెంట్ ఇస్తుందా? ఇచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్ రాని విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్కేయూ అనంతపురం: ఎస్కేయూ.. ఇక్కడ నిబంధనలన్నీ హుష్‌కాకి.. ఎవరికిష్టమొచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. నిబంధనలు తుంగలో తొక్కేస్తారు. ఎవరికో లాభం చేకూర్చేందుకు ఎందరినో ఇబ్బంది పెడతారు. తాజాగా డిగ్రీ ఫీజులు రెండింతలు పెంచి విద్యార్థులను కన్నీరు పెట్టిస్తున్నారు. సరైన మౌలిక సదుపాయాలు లేకుండానే ఏళ్లుగా కళాశాలలు నిర్వహిస్తున్నా... యాజమాన్యాలకు కనీసం నోటీసులు కూడా జారీ చేయని ఎస్కేయూ ఉన్నతాధికారులు...అదే ‘ప్రైవేటు’ కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గారు. డిగ్రీ ఫీజును రెండింతలు పెంచేసి వారికి భారీగా లబ్ధి చేకూర్చారు. రాయలసీమలో ఎక్కడాలేని విధంగా.. పొరుగునే ఉన్న రాయలసీమ వర్సిటీ, యోగి వేమన వర్సిటీలో డిగ్రీ కోర్సుకు గతేడాది ఫీజులనే ఖరారు చేశారు. బీఏ, బీకాం కోర్సులకు ఏడాదికి రూ.9 వేలు, బీఎస్సీకి రూ.11 వేలు మాత్రమేవసూలు చేస్తున్నారు. కానీ ఎస్కేయూలో మాత్రం ఫీజులు రెట్టింపు చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో ఉండే అనుబంధ డిగ్రీ కళాశాల స్థాయిలో ఎస్కేయూ అనుబంధ ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజులు ఖరారు చేశారు. కళాశాలలకు నిబంధనలు పట్టవా? వర్సిటీకి అనుబంధ డిగ్రీ కళాశాల ఏర్పాటైతే... మొదటి 5 సంవత్సరాల వరకూ అద్దె భవనాల్లో నిర్వహించుకోవచ్చనీ, ఆ తర్వాత సొంత భవనాల్లో కళాశాల నిర్వహించాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అయినప్పటికీ జిల్లాలోని 20 శాతం కళాశాలలు ఏళ్లుగా అద్దెభవనాల్లోనే నడుస్తున్నా... ఎస్కేయూ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. ‘ప్రైవేటు’ కళాశాలలకు నిబంధనలు సడలించిన ఎస్కేయూ యాజమాన్యం...విద్యార్థుల ఫీజుల దగ్గరి వచ్చే సరికి మాత్రం నిబంధనల పేరుతో రెట్టింపు చేసింది. దీంతో నిరుపేద విద్యార్థులకు డిగ్రీ చదువు భారంగా మారగా...ప్రైవేటు అనుబంధ డిగ్రీ కళాశాలలకు భారీగా లబ్ధి చేకూరుతోంది. ఈ వ్యవహారంలో వర్సిటీలోని ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అడ్డుగోలు నిర్ణయాలు డిగ్రీ కోర్సులో ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులను ఒకే దఫా 10 శాతానికి మించి పెంచడానికి వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఏకంగా ఫీజులు రెట్టింపు చేశారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోల్చుకుని ఫీజులు పెంచాలని కళాశాలల అసోసియేషన్ చెప్పినట్లు.. ఎస్కేయూ ఉన్నతాధికారులు వెంటనే ఆమోదం తెలిపి .. అమలు చేసేశారు. ఫీజులు ఎంత పెంచినా రీయింబర్స్మెంట్ అందుతుందనే ఉద్దేశంతో పెంచేశారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ రాని విద్యార్థుల పరిస్థితి గురించి మాత్రం పట్టించుకోలేదు. బీటెక్ కోర్సు స్థాయిలో ఎస్కేయూ డిగ్రీ కోర్సులకు ఫీజులు నిర్ణయించినా...ఆ స్థాయిలో విద్యాప్రమాణాలు ఉన్నాయా..? కళాశాలల్లో మౌలిక సదుపాయాలున్నాయా..? అని పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తుగా వసూలు ఏటా డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య 60 వేలుగా ఉంటోంది. గతేడాది వరకు ఒక్కో విద్యార్థి ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు ఫీజును చెల్లించాలని ఎస్కేయూ నిర్ణయించింది. తాజా అకడమిక్ విద్యాసంవత్సరం (2018–19) నుంచి ఏడాదికి కోర్సు ఫీజు మొత్తాన్ని బీఏకు రూ.9 వేల నుంచి రూ.15,840, బీకాంకు రూ. 18,720, బీఎస్సీకి రూ.11 వేల నుంచి రూ.18,720 పెంచారు. ఇంతటితో అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆగలేదు. రూ.18 వేలకు అదనంగా రూ.6 వేల మేర అడ్మిషన్ ఫీజును నిర్ధారించి ఏకంగా రూ.24 వేలు ఫీజును నిర్ణయించారు. ఈ మొత్తాన్ని అడ్మిషన్ ముందస్తుగా చెల్లించాలని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ‘రీయింబర్స్మెంట్’ నిబంధనలకు విరుద్ధం కుటుంబ ఆర్థిక పరిస్థితి విద్యార్థి ఉన్నత చదువులకు అవరోధం కాకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముందస్తుగా ఫీజులు వసూలు చేయకూడదని జీఓ నంబర్–18ను జారీ చేశారు. అలా వ్యవహరిస్తే ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని అప్పట్లో హెచ్చరించారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా ఫీజులు పెంచేయడమే కాకుండా ప్రభుత్వం ఆ మేరకు ఫీజు రీయింబర్స్ ఇస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి పూర్తి మొత్తంలో ఫీజులు కట్టించుకుంటున్నాయి. వాస్తవానికి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇదే తరహాలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నప్పటికీ, ముందస్తుగా నయాపైసా కూడా కట్టించుకోలేదు. కానీ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు మాత్రం యథేచ్ఛగా నిబంధనలను విస్మరిస్తున్నాయి. రెండింతలు పెంచారు డిగ్రీ ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రెండింతలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెంచిన ఫీజుల మేర ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ముందస్తుగా ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని తెలిసినా కళాశాలల యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. వర్సిటీ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. –సుజాత, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని -
లక్ష మందికి శిక్షణ
• పరిశ్రమలకు ,కళాశాలలకు అనుసంధానం • ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్యదర్శి గంటా సుబ్బారావు ఎస్కేయూ : రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ , పీజీ లక్ష మంది విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వనున్నామని ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ కార్యదర్శి గంటా సుబ్బారావు అన్నారు. ఎస్కేయూ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలకు గురువారం వర్సిటీలో ‘ ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి అనుసరించాల్సిన పద్ధతులు ’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంటా సుబ్బారావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఇప్పటి వరకు 1069 మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికయ్యారని తెలిపారు. నైపుణ్యాలు పెంపొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 200 డిగ్రీ కళాశాలల్లో తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ట్యాలీ, ఎస్ఏపీ, టెస్టింగ్ టూల్స్, ఆండ్రాయిడ్ ట్రైనింగ్, కంప్యూటర్, తదితరాలకు సంబంధించి విద్యార్థులకు నచ్చిన అంశంలో శిక్షణ ఇస్తారన్నారు. ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ మాట్లాడుతూ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ప్రిన్సిపల్ కన్సెల్టెన్స్ డాక్టర్ ఎం. శైలజ, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యాంమోహన్, విన్సెంట్, ఎస్కేయూ సీడీసీ డీన్ ఆచార్య లక్ష్మీదేవి, ఎస్కేయూ స్కిల్‌డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆచార్య బి. నాగభూఫణ రాజు తదితరులు పాల్గొన్నారు.