వేర్వేరు ఘటనల్లో ఇద్దరికి యావజ్జీవ శిక్ష

Tirupur Women Court Verdict Over Murder And Attempted Murder Case - Sakshi

సాక్షి, చెన్నై :  రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన హత్య, హత్యాయత్నం కేసుల్లో అరెస్టయిన ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. తిరుప్పూర్‌ జిల్లా తారాపురం పెరియకాళియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన గురునాథన్‌ (29). ఇతను తిరుప్పూర్‌లోని ఓ బనియన్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. తిరుప్పూర్‌కు చెందిన ప్లస్‌-1 (16 ఏళ్ల) విద్యార్థిని ప్రేమ పేరిట వేధించాడు. ఇందుకు విద్యార్థిని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అలాగే వేరొకరితో వివాహం చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన గురునాథన్‌ 2015, సెప్టెంబర్, 14న సాయంత్రం పాఠశాల ముగిశాక.. విద్యార్థినిపై బీర్‌ బాటిల్‌తో దాడిచేశాడు. తీవ్రగాయాలైన విద్యార్థినిని స్థానికులు చికిత్స నిమిత్తం తిరుప్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి గురునాథన్‌ని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తిరుప్పూర్‌ జిల్లా మహిళ కోర్టులో నడుస్తోంది. బుధవారం ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి జయంతి గురునాథన్‌కి యావజ్జీవ శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అల్లుడి హత్యకేసులో మేనమామకు..
నాగై సమీపం వేలాంగన్ని నిరత్తణ మంగలం మేల వీధికి చెందిన జిమ్మిగార్డన్‌ భార్య ఉషా. వీరి కుమారులు రాబర్ట్‌ (12), రాబిన్‌. ఉషా తమ్ముడు అంథోని (25). ఇతను చిన్నప్పటి నుంచే తన అక్క ఇంట్లోనే ఉంటున్నాడు. 2012లో ఉషా సారాయి విక్రయ కేసులో అరెస్టయి తిరువారూర్‌ జైల్లో ఉంది. ఈ స్థితిలో ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదు కనిపించలేదని జిమ్మి గార్డన్‌ వెతికాడు. అప్పుడు రాబర్ట్, ఆ నగదుని ఆంథోని మామ తీశాడు అని తెలిపాడు. ఈ క్రమంలో అంథోని ఆ రోజు రాత్రి రాబర్ట్‌ని గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి అంథోనిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నాగై జిల్లా కోర్టులో నడుస్తోంది. బుధవారం ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి పద్మనాభన్‌ అంథోనికి యావజ్జీవ శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top