భూ కబ్జా కేసులో టీడీపీ మహిళా నేత అరెస్ట్‌

TDP Women Leader Arrested In Land Grabbing Case - Sakshi

పీఎం పాలెం(భీమిలి): టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో  కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన టీడీపీ మహిళా నేతను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గతంలో  జీవీఎంసీ నాలుగో వార్డు టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన షేక్‌ జహనార అప్పటి మంత్రి అండదండలతో పీఎం పాలెం హౌసింగ్‌ బోర్డు కాలనీ సర్వే నంబరు 20లో ఉన్న భూమిని ఆక్రమించడానికి స్కెచ్‌ వేసి భవన నిర్మాణం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఆ నిర్మాణాన్ని అప్పట్లోనే కూల్చేశారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత మళ్లీ అదే స్థలంలో నిర్మాణం చేపట్టగా విషయం తెలుసుకున్న అధికారులు మళ్లీ కూల్చివేశారు.

కొన్నాళ్ల తర్వాత జీవీఎంసీ, హౌసింగ్‌ బోర్డు అధికారులను మాయ చేసిన జహనార అదే స్థలంలో భవనం నిర్మించేసింది. అప్పట్లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే స్థలం సొంతం చేసుకుని దర్జాగా భవన నిర్మాణం పూర్తి చేసేసింది. అనంతరం టీడీపీ అధికారం కోల్పోయినప్పటికీ ఆక్రమణల్లో ఆరితేరిన షేక్‌ జహనార మాత్రం వెనక్కు తగ్గలేదు. తాజాగా ఈ నెల 13న సర్వే నంబరు 20/4లో ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. లారీలతో కంకర తీసుకొచ్చి యంత్రాల సహాయంతో పనులు చేపట్టింది. విషయం తెలుసుకున్న విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ కె.నరసింగరావు ఆదేశాల మేర కు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పనులు నిలుపుదల చేయించారు. అనంతరం తహసీల్దారు పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు టీడీపీ మహిళా నేత షేక్‌ జహనారను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.

  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top