వైఎస్సార్‌ సీపీ వర్గాలపై టీడీపీ దాడి

TDP Leaders Attack on YSRCP Leaders - Sakshi

కానిస్టేబుల్‌కు గాయాలు

హుస్సేన్‌పురంలో ఉద్రిక్తత

ఇరువర్గాలపై కేసులు

తూర్పుగోదావరి ,సామర్లకోట (పెద్దాపురం):  నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామంలో ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఈ గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను కొంతమంది గ్రామంలో అడ్డుకున్న విషయం విదితమే. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు పుట్టిన రోజు కార్యక్రమానికి ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు హాజరైన వీడియో, ఫొటోలను ఫేస్‌బుక్‌లో కొందరు పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు çసోమవారం రాత్రి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై మద్యం సీసాలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. సీఐ యువకుమార్‌ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, పోలీసులు దాడి చేస్తున్నారన్న సమాచారం అందడంతో వేట్లపాలేనికి చెందిన గోలి వెంకట్రావు, గోలి శ్రీరామ్‌ గ్రామానికి చేరుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంట సమయంలో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు విసురుకోవడంతో కానిస్టేబుల్‌ ఎ.వినోద్‌ గాయపడ్డాడు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి అందరినీ చెదరగొట్టారు. ఒక విలేకరి సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోను పోలీసులు తొలగించడంతో విలేకరులు నిరసన తెలిపారు. 

ఇరువర్గాలూ ఫిర్యాదులు  
ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు ఏడుగురు టీడీపీ కార్యకర్తలపై, తొమ్మిది మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ నేతలు వెంకట్రావు, శ్రీరామ్, కోట వీర్రాజులను, టీడీపీకి చెందిన చల్లా బుజ్జి, కోట అప్పారావు, పుప్పాల రాంబాబులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ యువకుమార్‌ తెలిపారు. కానిస్టేబుల్‌ను గాయపర్చిన కేసులో వెంకట్రావు, గోలి శ్రీరాములను కోర్టుకు తరలించామన్నారు. అయితే తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో 144 సెక్షన్‌ విధించి, పోలీసులు పహరా కాస్తున్నారు.  

కానిస్టేబుల్‌కు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాణి పరామర్శ
ఈ ఘర్షణలో గాయపడిన కానిస్టేబుల్‌ వినోద్‌ను వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట వాణి పరామర్శించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులు అరెస్ట్‌ చేసిన పార్టీ నాయకులు గోలి వెంకట్రావు, శ్రీరామ్, కోట వీర్రాజులను పరామర్శించారు. తప్పుడు కేసులు పెట్టే వారికి గుణపాఠం చెబుతామని, బాధితులకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. హుస్సేన్‌పురం గ్రామంలోని మహిళలు స్టేషన్‌కు రావడంతో వారికి కూడా ఆమె ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు గోలి రామారావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోరంపూడి శ్రీరంగనాయకులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొబ్బరాడ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్‌లో ఉన్న వైఎస్సార్‌ సీపీ నాయకులను మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు కూడా పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గాయపడిన కానిస్టేబుల్‌ వినోద్‌ను పరామర్శించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top