ఎయిర్‌పోర్టులోకి తూటాలతో ప్రవేశం

TDP Leader Caught With Bullets At Renigunta Airport - Sakshi

తనిఖీలో పట్టుబడిన టీడీపీ నేత

20 తూటాలు స్వాధీనం

రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఘటన 

అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పోలీసులు

రేణిగుంట(చిత్తూరు జిల్లా): అత్యంత భద్రతా వలయంతో కూడుకున్న ఎయిర్‌ పోర్టులోకి ఓ టీడీపీ నేత తుపాకీ తూటాలతో ప్రవేశించగా భద్రతా సిబ్బంది గుర్తించారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం సింగిల్‌ విండో అధ్యక్షుడు సాయినాథ్‌ శర్మ హైదరాబాద్‌ వెళ్లేందుకు శనివారం స్పైస్‌జెట్‌ విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అతను మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అతని బ్యాగును తనిఖీ చేయగా 20 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విమానాశ్రయం పోలీసులకు సమాచారం అందించారు. ఏర్పేడు సీఐ మురళీ నాయక్‌ అక్కడకు చేరుకుని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

సాయినాథ్‌ అదుపులోకి తీసుకుని రాత్రి 8 గంటల వరకు విచారణ చేసినట్లు సమాచారం. అతను లైసెన్డŠస్‌ తుపాకీని కలిగి ఉన్నప్పటికీ మారణాయుధాలతో ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించడాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. తనను విడిచి పెట్టాలని, హైదరాబాద్‌లో పని ఉందని, తాను త్వరగా వెళ్లాలని పోలీసులతో సాయినాథ్‌ గొడవపడినట్లు సమాచారం. టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కిందట ఇదే తరహాలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి బంధువు తూటాలను తీసుకెళుతూ రేణిగుంట విమానాశ్రయంలోనే పట్టుబడిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ విజిటర్స్‌ పాసులను సైతం రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికుల ముసుగులో మారణాయుధాలతో విమానాశ్రయంలోకి తరచూ ప్రవేశిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top