హత్యలు.. భూదందాలు.. సెటిల్‌మెంట్లు !

TDP Leader Arrest in Murder Case Guntur - Sakshi

వెలుగులోకి వస్తున్న టీడీపీ నేతల దురాగతాలు

మంగళగిరి నియోజకవర్గంలో అరాచకంగా సాగిన ఐదేళ్ల పాలన

బయటకు వస్తున్న వాస్తవాలతో నివ్వెరపోతున్న జనం

ఇప్పటికే రెండు హత్య కేసుల్లో జైలుకెళ్లిన ముగ్గురు టీడీపీ నాయకులు

గుంటూరు, మంగళగిరి: టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన హత్యలు, భూ దందాలు, సెటిల్‌మెంట్ల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేసిన దురాగతాలు అన్నీఇన్నీ కావు. రోజుకొక ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా జంట హత్యల కేసులో నిందితుడిగా టీడీపీ మండల అధ్యక్షుడు చావలి ఉల్లయ్యను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2017 లో ఒక మహిళను హత్య చేసిన ఘటనతో పాటు  ఆ హత్యకు సహకరించిన మరొకరిని హత్య చేయించిన వ్యవహారంలో నిందితులకు తోడ్పాటునందించారు. ఈ కేసులో ఉల్లయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు హత్యలు వెలుగులోకి రాకుండా చూసేందుకు అçప్పుడు డీఎస్పీగా పనిచేసిన అధికారికి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ ఐదు సంవత్సరాల కాలంలో అధిక కాలం నార్త్‌జోన్‌ డీఎస్పీగా పనిచేసిన అధికారి టీడీపీ నాయకులు చేసిన హత్యలతో పాటు భూదందాలకు సహకరించి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించారని టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీ నేతల దుర్మార్గ చర్యలకు నియోజకవర్గంలో అనేక మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. టీడీపీ నాయకుల అరాచకాలకు అప్పడు పనిచేసిన నార్త్‌ సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారితో పాటు ఇతర పోలీసులు పూర్తిగా సహకరించి తమ స్వామి భక్తిని చాటుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

వరుసగా టీడీపీ నేతల అరెస్టులు...
 భూ దందాలలో తమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఆ పార్టీకి చెందిన నాయకుడు తాడిబోయిన ఉమాయాదవ్‌ను హత్య చేయించిన కేసులో టీడీపీ నాయకుడు ఏనుగ కిషోర్‌తో పాటు  మండల అధ్యక్షుడు కుమారుడు, మండల టీడీపీ యూత్‌ నాయకుడు చావలి మురళితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు హత్య కేసులో ఉండడం సంచలనం కలిగించింది. అది మరువక ముందే టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి భూదందా కేసులో ఇరుక్కుని కోర్టు మెట్లెక్కి బెయిల్‌పై బయటకు రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పలు భూవివాదాల కేసులలో టీడీపీ నాయకుల పేర్లు బయటకు వస్తుండగా రాజీమార్గం పట్టి కేసుల వరకు రాకుండా చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.   తాజాగా జంట హత్యల కేసులో ఉల్లయ్యను అరెస్టు చేయడం కలకలం రేపింది. మరింత మంది టీడీపీ నేతల అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎంతో మంది బాధితులు ధైర్యం చేసి బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top