ఏ కష్టమొచ్చిందో... 

Staff Nurse Committed Suicide In Palakonda - Sakshi

డ్యూటీరూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన స్టాఫ్‌నర్స్‌ 

పాలకొండ ఏరియా ఆస్పత్రిలో దుర్ఘటన 

హఠాత్‌ పరిణామంతో ఖిన్నులైన సహచరులు 

పాలకొండ రూరల్‌: అప్పటి వరకు రోగులకు సేవలు చేస్తూనే ఉంది.. విధి నిర్వహణలో భాగంగా వైద్యులకు సహాయమందించింది.. అంతలో ఏమైందో.. ఏ కష్టం ఆమెను కుంగదీసిందో గానీ ఆస్పత్రి డ్యూటీ రూమ్‌లోనే స్పాఫ్‌నర్స్‌ బలవన్మరణానికి పాల్పడింది.. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులతోపాటు సహచర ఉధ్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. పాలకొండ వంద పడకల ఏరియా ఆస్పత్రిలో కాకర్ల హేమలత (32) 2016 నుంచి స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. స్వగ్రామమైన రాజాం నుంచి నిత్యం విధి నిర్వహణలో భాగంగా అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్నారు. ఎప్పటిలాగే బీ–షిఫ్ట్‌ విధులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆస్పత్రికి చేరుకున్న ఆమె సాయంత్రం వరకు యధావిధిగా విధులు నిర్వహించారు.

తమతో మామూలుగానే వ్యవహరించిందని సహచర నర్సులు, డ్యూటీ డాక్టర్లు చెబుతున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తన డ్యూటీ రూమ్‌కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా ఎప్పటికీ స్పందించకపోవటంతో కుటుంబీకులు సహచర సిబ్బందికి ఫోన్‌ చేశారు. ఆస్పత్రి సిబ్బంది డ్యూటీలో ఉన్న వైద్యాధికారి డి.వి.శ్రీనివాస్‌కు ఈ విషయం తెలియజేశారు. తక్షణమే స్పందించిన వైద్యాధికారి ఆమె ఉన్న గది వద్దకు వెళ్లి తలుపును తట్టారు. ఎంతకూ తలు పు తీయకపోవటంతో కిటికి నుంచి చూడగా హేమలత ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గది తలుపులు తెరచి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

శోక సముద్రంగా మారిన ఆస్పత్రి... 
అప్పటి వరకు తమతో మామూలుగా విధులు చేపట్టిన హేమలత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న సహోద్యోగులు శోక సముద్రంలోకి మునిగిపోయారు. ఈ హఠాత్‌ పరిణామంతో ఖిన్నులైపోయారు. ఏం కష్టం వచ్చిందోనని రోదించారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్‌ జె.రవీంద్రకుమార్, స్త్రీవైద్య నిపుణురాలు భారతి ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

 గుండెలు బాదుకున్న కుటుంబ సభ్యులు 
రాజాం నగర పంచాయితీ లచ్చయ్య పేటలో నివాసముంటున్న సూరయ్య, సరస్వతి దంపతులకు ఆరుగురు కుమార్తెలు. వీరిలో ఆఖరి కుమార్తె హేమలత. కుటుంబానికి ఎంతో ఆసరాగా మెలిగేదని, ఎందుకిలా చేసిందో తెలీడం లేదని మృతురాలి పెద్దక్క పుణ్యవతి గుండెలు బాదుకుని రోదించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సనపల బాలరాజు సిబ్బందితో సహా ఘటనా స్థలానికి  చేరకుని మృతదేహం ఉన్న తీరును పరిశీలించారు. అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, బతకాలని లేదని రాసి ఉన్నట్లు వార్తలు వినిపించాయి. దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై స్పష్టం చేశారు.

లచ్చయ్యపేటలో విషాదఛాయలు 
రాజాం సిటీ: రాజాం నగర పంచాయతీ పరిధి లచ్చయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. లచ్చయ్యపేటకు చెందిన కాకర్ల హేమలత (33) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె మృతితో లచ్చయ్యపేటవాసులు విచారంలో మునిగిపోయారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top