తుపాకీతో కాల్చుకుని డాక్టర్‌ ఆత్మహత్య

Sri Aditya Hospital MD Ravinder Kumar Suspicious Lifeless - Sakshi

మృతుడు శ్రీ ఆదిత్య ఆస్పత్రి ఎండీ 

భార్యతో ఘర్షణ.. అనంతరం ఘటన 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ రవీంద్రకుమార్‌ తన లైసెన్స్‌డ్‌ తుపాకీతో కాల్చుకుని సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కాప్రా సాకేత్‌ మిథిల ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రం సిద్దిపేటకు చెందిన డాక్టర్‌ రవీంద్రకుమార్, డాక్టర్‌ స్మిత దంపతులు. వీరికి ఒక కుమారుడు. వీరు ఆరేళ్ల క్రితం దమ్మాయిగూడలో శ్రీ ఆదిత్య ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కాప్రా సాకేత్‌ సమీపంలోని మిథిల ఎన్‌క్లేవ్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 57లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రవీంద్రకుమార్, స్మిత దంపతుల మధ్య బంధువుల ఫంక్షన్‌కు వెళ్లే విషయమై ఘర్షణ జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో కుమారుడిని తీసుకుని స్మిత దిల్‌సుఖ్‌నగర్‌లోని తల్లిగారింటికి వెళ్లారు. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో రవీంద్రకుమార్‌ తన కుమారుడికి ఫోన్‌చేసి మాట్లాడారు. అనంతరం ఆయన తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
 
శ్రీఆదిత్య ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ రవీంద్రకుమార్‌

ఘటన వెలుగు చూసిందిలా.. 
స్మిత చెల్లెలు స్వప్న ఆదిత్య ఆసుపత్రిలోనే పనిచేస్తోంది. సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చి రవీంద్రకుమార్‌కు ఫోన్‌చేయగా లిఫ్ట్‌ చేయలేదు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఫ్లాట్‌కువెళ్లి చూడగా డాక్టర్‌ రవీంద్రకుమార్‌ రక్తపుమడుగులో పడి ఉన్నారు. పక్కనే తుపాకీ ఉంది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ ఘటన స్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో పరిసరాల్లో గాలించారు. రవీంద్రకుమార్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబసభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. జవహర్‌నగర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

డాక్టర్‌కు గతంలో ‘మాజీ’ల బెదిరింపులు  
మాజీ నక్సలైట్ల పేరుతో 2015లో డాక్టర్‌ రవీంద్రకుమార్‌కు బెదిరింపులు వచ్చాయి. అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించిన ఆయన తన ఆస్పత్రిలోనే 2016లో వారిని జవహర్‌నగర్‌ పోలీసులకు పట్టించారు. అప్పటి నుంచి ఫోన్‌ బెదిరింపులు వస్తుండటంతో లైసెన్స్‌డ్‌ గన్‌ తీసుకున్నారు. కాగా, జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక్కరోజు వ్యవధిలో ఓ జవాన్‌తో పాటు డాక్టర్‌ తమ వద్ద ఉన్న గన్‌లతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top