
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పెండి శ్రీనివాస్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఉదయం ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూపాలపల్లి పట్టణంలోని జంగేడుకు చెందిన పాలిక సమ్మయ్య, మరో నలుగురు రైతులకు పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగాగల 3.29 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారని కొద్ది రోజుల క్రితం జేసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఆర్డీఓను ఆదేశించారు.
ఆ ఆదేశాల జిరాక్స్ కాపీలను ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌ను పాలిక సమ్మయ్య తమ్ముడి కుమారుడైన రఘుణాచారి కోరాడు. ఇందుకు శ్రీనివాస్ రూ.లక్ష డిమాండ్ చేయగా.. రూ.50 వేలు ఇస్తానని బాధితుడు తెలిపాడు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయాన్ని వెల్లడించాడు. బుధవారం ఉదయం 11 గంటలకు రఘుణాచారి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి రూ.50 వేలు ఇస్తుండగా శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.