మోసగాడు.. ఇలా దొరికాడు

Sai Santosh Was Arrested For Cheating In The Name Of Jobs - Sakshi

వార్త రాసిన ‘సాక్షి’ రిపోర్టర్‌ను ప్రలోభపెట్టే యత్నం

చాకచక్యంగా ఆఫీస్‌కు రప్పించి పోలీసులకు నిందితుడి అప్పగింత 

న్యాయవాది ముందస్తు బెయిల్‌ తీసుకురావడంతో నిందితుడి విడుదల 

ఆ మోసగాడు  సొమ్ములు ఎగ్గొట్టి.. ఖాతాదారుల కళ్లు గప్పాడు. పోలీసులనూ మాయచేసి సామగ్రిని తరలించేశాడు. ఈ వ్యవహారంపై  సాక్షిలో ప్రచురితమైన కథనంతో మాయాలోడు బయటికొచ్చాడు. ‘సాక్షి’ రిపోర్టర్‌ను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు. రిపోర్టర్‌ చాకచక్యంగా వ్యవహరించి  సాక్షి కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని   నిందితుడికి చెప్పడమే కాకుండా మరోవైపు మోసగాడు వస్తున్న విషయాన్ని బాధితులకు చేరవేశారు. దీంతో సాక్షి కార్యాలయం వద్ద మాటువేసిన బాధిత బృందం వలలో ఆ నేరగాడు చిక్కాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రయత్నంలో ‘సాక్షి’ సాహసానికి బాధితులు అభినందనలు తెలిపారు.  – సాక్షి, విశాఖపట్నం

సాక్షి, విశాఖపట్నం: రైల్వే ఉద్యోగాల పేరిట మోసం చేసి పరారీలో ఉన్న సాయిసంతోష్‌ అనే ఘరానా వ్యక్తి సాక్షి రిపోర్టర్‌ చొరవతో బాధితులకు దొరికిపోయాడు. ఆదివారం సాక్షిలో ‘రూ.కోటితో ఉడాయింపు’ అనే శీర్షికతో టాబ్లాయిడ్‌లో ప్రముఖంగా ప్రచురితమైన కథనం చూసి నిందితుడు ఉదయమే అక్కయ్యపాలెంలోని సాక్షి కార్యాలయానికి వచ్చాడు. ఈ వార్త రాసిన రిపోర్టర్‌ ఫోన్‌ నెంబర్‌ కావాలని అక్కడి సెక్యురిటీని అడిగి తీసుకున్నాడు.   రిపోర్టర్‌కు ఫోన్‌చేసి డబ్బుతో ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వార్త రాసిన  రిపోర్టర్‌ చాకచక్యంతో బాధితులకు, పోలీసులకు సమాచారం అందించి సాక్షి కార్యాలయంలో చాటుగా వేచి ఉండమని సలహా ఇచ్చాడు. రైల్వే ఉద్యోగాల పేరిట డబ్బులు పోగొట్టుకున్న బాధితులంతా  సాక్షి ఆఫీస్‌కు వచ్చి  పార్కింగ్‌ వద్ద వేచి ఉన్నారు.

అదే సమయంలో సాక్షి రిపోర్టర్‌ నిందితుడు సాయి సంతోష్‌కు ఫోన్‌ చేసి తను ఆఫీస్‌కు వచ్చానని,  త్వరగా రావాలని లేదంటే బయటకి వెళ్లిపోతానని చెప్పాడు. దీంతో వెంటనే నిందితుడు  ఆఫీస్‌కు వచ్చాడు. ఇదే అదునుగా బాధితులు అతన్ని పట్టుకుని ఉద్యోగాల పేరిట తమను మోసంచేసి పరారైపోతావా...తమ డబ్బులు తమకివ్వాలని నిలదీశారు. ‘మీకు డబ్బులిచ్చేది లేదు.. తాను ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నాను.. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.. కోర్టులోనే తేల్చుకుందాం’ అని నిందితుడు బుకాయించడానికి ప్రయత్నించాడు. బాధితులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మూడు గంటల  పాటు ఉంచారు. నిందితుడి తరుపు లాయర్‌  యాంటిసిపేటరీ బెయిల్‌ తీసుకు వచ్చి ఎస్‌ఐకి చూపించి తీసుకెళ్లిపోయారు. బాధితులకు త్వరలో డబ్బులు ఇస్తానని ఎస్‌ఐ సమక్షంలో నిందితుడు హామీ ఇచ్చాడు. 

చార్జిషీట్‌ వేస్తాం 
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సాయిసంతోష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చాం. అయితే అతను ముందస్తు  బెయిల్‌ తీసుకురావడంతో అరెస్టు చేయలేకపోయాం.  41 నోటీస్‌ ఇచ్చాం. దీనిపై విచారణ జరుగుతుంది. పూర్తి విచారణ చేసి చార్జిషీటు వేస్తాం.    – వై.రవి, ఫోర్తు టౌన్‌ సీఐ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top